స‌మైక్యాన్ని గ‌ట్టిగా వినిపించిన ల‌గ‌డ‌పాటి..

తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం ఐదు జిల్లాలు మాత్రమే వ్యతిరేకిస్తున్నారని, గుంటూరు,విజయవాడ మధ్య రాజధాని పెట్టి పాతికవేల కోట్ల ప్యాకేజీ ఇచ్చి సరిపెట్టవచ్చని కొందరు తెలంగాణ నేతలు ప్రతిపాదించడం చాలా అన్యాయమని విజయవాడ ఎమ్.పి లగడపాటి రాజగోపాల్ వ్యాఖ్యానించారు. ఒక్క హైదరాబాద్ లోనే రాష్ట్ర ఆదాయంలో నలభై ఐదు శాతం వస్తుందని ఆయన అన్నారు. హైదరాబాదులో పదిలక్షల కో్ట్ల రూపాయల పెట్టుబడులు పెట్టారని, అన్ని ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టారని రాజగోపాల్ తెలిపారు. పది లక్షల కోట్లు పెట్టుబడి ఉన్న హైదరాబాద్ ఇరవై రెండు జిల్లాల ఆస్థి అని , అలాంటిది ఒక పాతికవేల కోట్లు ఇచ్చి పొమ్మనడం అంటే అంతకన్నా దారుణం మరొకటి లేదని రాజగోపాల్ పేర్కొన్నారు.అనేక స్కీములు అమలు చేస్తున్నామంటే అది హైదరాబాదు నుంచి వస్తున్న ఆదాయంనుంచేనని, హైదరాబాద్ ఎవరికి వారు భావించి తమది అని అన్ని జిల్లాల నుంచి వచ్చారని ఆయన అన్నారు ఇప్పటికే నీటి వివాదాలతో ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని , ఏ ప్రాజెక్టు కట్టవద్దని డిమాండు చేస్తున్నారని ఆయన విమర్శించారు. రాష్ట్రం విభజన జరిగితే ఆ తర్వాత హైదరాబాదు లో ఉన్న సీమాంధ్ర వారిని తరిమికొట్టండని కూడా పిలుపు ఇస్తారని శ్రీకృష్ణ కమిటీ హెచ్చరించిందని, మత శక్తులు విజృంభిస్తాయని చివరికి తెలంగాణలో ప్రతిజిల్లా తీవ్ర గందరగోళానికి గురి అవుతుందని హెచ్చరించారు. శ్రీకృష్ణ ముంబై లో ఉగ్రవాదులకు భయపడకుండా అక్కడ నివేదిక ఇచ్చారని, ఇక్కడ కూడా నిర్భయంగా రిపోర్టు ఇచ్చారని రాజగోపాల్ తెలిపారు. త్వరలో కేంద్రం అఖిలపక్షం నిర్వహించి నిర్ణయం తీసుకుంటుందని అన్నారు. కొందరు తెలిసో, తెలియకో, తనవల్ల రాష్ట్రం ఆగిపోయిందని చెబుతున్నారని, తనవల్ల ఆగిపోవడం ఏమిటని రాజగోపాల్ ప్రశ్నించారు. తాను కేవలం సమైక్య రాష్ట్రం ఉంటే మంచిదని అభిప్రాయం చెప్పానే తప్ప మరొకటి కాదన్నారు. తాను ఒక్కడే ప్రభావితం చేయగలిగితే, ఎమ్.పిగాఎందుకు మిగిలిపోతానని ఆయన ప్రశ్నించారు.ఎపి శాసనసభలో సభ్యులుగా ఉండవద్దనుకున్నవారు రాజీనామాలు చేసి మళ్లీ ఎందుకు పోటీచేస్తున్నారని ప్రశ్నించారు. ఆంద్ర ప్రదేశ్ ఎమ్.పిల కన్వీనర్ గా ఉన్న పొన్నం ప్రభాకర్ నానా మాటలు అంటున్నారని, ఆయన చివరికి ఆంధ్ర ప్రదేశ్ ఎమ్.పిల కన్వీనర్ పదవినే వదలడం లేదని ఎద్దేవా చేశారు. రాష్ట్రం విడిపోతే అంత అల్లకల్లోలం ఏర్పడుందని చెప్పి, రాజీనామా చేసి వెళ్లిపోయానని, రాష్ట్రం విడిపోతే రాజకీయాల నుంచి తప్పుకుంటానని కూడా స్పష్టంచేశానన్నారు.శాసనసభలో మెజార్టీ ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు కనుక రాష్ట్రం సమైక్యంగా నిలబడిందన్నారు. ఐదు జిల్లాలు మాత్రమే వ్యతిరేకించడం లేదని, రాష్ట్రం అంతా వ్యతిరేకిస్తున్నారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సమైక్యవాద పార్టీలకు 240 సీట్లు వస్తాయని , వేర్పాటువాద పార్టీలకు నలభై సీట్లు మాత్రమే వస్తాయని ఆయన అన్నారు.శ్రీకృష్ణ కమిటీ సీమాంద్రలో పర్యటించినప్పుడు ఎక్కడో ఒకరో, ఇద్దరు తప్ప అంతా సమైక్య రాష్ట్రమే కోరారని అన్నారు. తెలంగాణ ఆదివాసీలు సమైక్య రాష్ట్రాన్ని కోరుతున్నారని,లేదంటే మన్యసీమ ఇవ్వాలని కోరారని అన్నారు. హైదరాబాద్ ఎమ్.పి కూడా స్పష్టంగా సమైక్య రాష్ట్రం కోరుకున్నారని రాజగోపాల్ గుర్తు చేశారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!