మేనేజ్ మెంట్ గురు శ్రీకృష్ణ -1



శ్రీకృష్ణుడు పేరుకు నల్లనయ్య అయినా ఆయన మనసు మాత్రం వెన్నలా తెల్లనిది. పాలలా స్వచ్ఛమైనది. అందుకే కిట్టయ్య గోకులంలో అందరివాడయ్యాడు. బాలగోపాలుడిగా అల్లరితో మురిపించినా.. వేణుమాధవుడిగా అలరించినా… మురారిగా.. ముల్లోకాలకు ఆచరణయోగ్యమైన సూత్రాలను వల్లించినా అది నందగోపాలుడికే చెల్లింది. జీవితానికి అర్థం పరమార్థం చెప్పడమే కాదు… దానిని ఎలా ఎంజాయ్‌చేయాలో… ఎలాంటి బాధ్యతలను నిర్వర్తించాలో కూడా చెప్పాడీ ముకుందుడు.

ఏ పని ఏలా చేయాలి?
ఒక పని ఎలా చేయాలి? ఎలా చేయించాలి? సమర్థులను ఎలా గుర్తించాలి? ఏఏ సమయాల్లో ఎలా నడుచుకోవాలి? సత్ప్రవర్తనతో ఎలా మెలగాలి? నొప్పింపక , తానొవ్వక అన్నరీతిలో పనులను ఎలా చక్కబెట్టాలి? ప్రణాళికాబద్దంగా, వ్యూహాత్మక విధానాలతో ఎలా విజయం సాధించాలి? ఈ ప్రశ్నలన్నింటికీ ఒకటే సమాధానం… అదే – శ్రీకృష్ణ.
ఆ గోవిందుడు నుంచి అంతగా నేర్చుకోవాల్సింది ఏముంది? కార్పొరేట్ వల్డ్‌.. ఎందుకు ఆయనను మేనేజ్‌మెంట్ గురుగా కొలుస్తోంది? నాటి వెన్నదొంగే నేడు అంతగా ఆరాధ్యుడయ్యాడా? జగన్నాటక సూత్రధారి… కలియుగంలోనూ ప్రపంచాన్ని తన చుట్టూ తిప్పుకుంటున్నాడు. అన్నీ తానై వ్యవహరిస్తున్నాడు. ఈ సక్సెస్‌వెనుకు సీక్రెట్స్ ఏంటి?.

కత్తిపట్టనివాడు
అసలు శ్రీకృష్ణుడు రాజా? మంత్రా? సేనానా? అంటే అన్నీను. నిజానికి నందగోపాలుడు ఎప్పుడూ రాజరికాన్ని కోరుకోలేదు. అందుకే ఆయనను రాజని చెప్పలేం. కత్తి పట్టినవాడు కచ్చితంగా ఏదో ఒకనాడు యుద్దం చేయక తప్పదు. కానీ కన్నయ్య ఎప్పుడూ కత్తిపట్టలేదే! వ్యవహారాన్ని చక్కదిద్దగల నేర్పు… సమస్యను సానుకూలంగా పరిష్కరించగల ఓర్పు… ఇలాంటివి ఆయనకు వెన్నతో పెట్టిన విద్యలు. ఇప్పటి మేనేజ్‌మెంట్‌ లోకానికి కావల్సింది ఇవే కదా? బైండింగులు చేయించిన పుస్తకాల్లో లేనిది.. గీతాసారంలో ఉంది. కృష్ణుడి బోధనల్లో ఉంది. అందుకే జగత్తంతా ఆయనవైపు చూస్తోంది.
యశోదమ్మ గారాలపట్టి జీవితాన్ని చిన్ననాటి నుంచి చూడండి.. దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే… ఇక మనకు క్లాసు రూముల్లో పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన అవసరమే ఉండదేమో! వెన్నదొంగ లీలలు… ఆయన ప్రతీ అడుగులోనూ కనిపిస్తాయి. ఆయన బోధించిన సూత్రాలు… జీవితంలో ప్రతీ క్షణంలోనూ మనకు అసరమవుతాయి.

ఎన్ని కష్టాలో…
చిన్ననాటి నుంచి ఎన్ని సవాళ్లను అధిగమించాడు? ఎన్ని కష్టనష్టాలకు ఓర్చాడు? కన్నతల్లిదండ్రులకు దూరమైనా చలించలేదు. స్వంత మేనమామే తనను చంపాలని చూసినా.. భయపడలేదు. బాధపడలేదు. తామరాకు మీద నీటిబొట్టులా ఉన్నాడు. ముల్లును ముల్లుతోనే తీయాలి. మోసాన్ని మోసంతోనే జయించాలి. మురళీకృష్ణుడి పాలసీ ఇదే. ఇప్పుడు చాలా సంస్థలు ఫాలో అవుతోందీ ఈ ప్రిన్స్‌పుల్‌నే. అందుకే గోకుల కృష్ణుడు గోకులానికే కాదు… సర్వలోకాలకు ఆదర్శప్రాయుడయ్యాడు.

-  బాలు 
guna_716@yahoo.co.in

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!