అవినీతి భారతం (part-1)





మన జాతీయ జంతువు ఏది అని అడిగితే,
`పులి’ …అంటూ ఠక్కున సమాధానం వచ్చేస్తుంది.
మన జాతీయ పక్షి ఏది అంటే,
నెమలి అని కూడా చెప్పేస్తారు.
మరి మన జాతీయ లక్షణం ఏది అని అడిగితే…
ఈ ప్రశ్నకు కూడా తడుముకోకుండా ఠక్కున సమాధానం చెప్పేయవచ్చు.
మన జాతి లక్షణం అవినీతి.

దేశ జనాభాలో 60 శాతం మందిలో ప్రవహిస్తున్నది అవినీతి రక్తం. అవినీతి భూతాన్ని పాతరేయాలని అన్నా హజారే వంటివారు ఉద్యమాలు చేస్తున్నా, ఇప్పటివరకు ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోతున్నాం. చివరకు మానవ వనరుల్నేకాదు, ప్రకృతి వనరుల్ని సైతం అవినీతి రక్కసి స్వాహా చేస్తోంది. స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదికే తొలి కుంభకోణం వెలుగుచూసింది. దేశం ఎటు దిగజారిపోతుందో,  ఆనాడే తెలిసిపోయింది. స్వేచ్ఛ చివరకు ఎవరి గుప్పెట్లో చిక్కుకుంటుందో అప్పుడే అర్థమైంది.
అప్పటి నుంచి వేలాది కుంభకోణాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. లక్షల కోట్ల అవినీతి పేరుకుపోతూనే ఉంది. అవినీతిని అంతమొందించేందుకు శక్తివంతమైన ఆయుధం జనలోక్ పాల్ బిల్లేనని చాలా మంది విశ్వసిస్తున్నారు. ఈ బిల్లుకు చట్టబద్ధత తీసుకురావడం కోసం ఉద్యమాలు చేస్తున్నారు. ఇంతకీ `జన లోక్ పాల్ బిల్లు’లో ఏముందీ, నిజంగానే అది అంత శక్తివంతమైనదా…?
హజారే శక్తి
అవినీతిని అంతమొందించాలన్న కసిపుట్టినప్పుడే దాన్ని తుదముట్టించే ఆయుధం కూడా దొరుకుతుంది. అందుకే సంఘ సంస్కర్త అన్నా హజారే దేశ రాజధాని నుంచి అవినీతిపై శంఖాన్ని పూరించారు. శక్తివంతమైన జనలోక్ పాల్ బిల్లుతోనే అవినీతి అంతమవు తుందని ఆయనతోపాటుగా దేశంలో అనేక మంది నమ్ముతున్నారు.  లోక్ పాల్ బిల్లుకు 50 మంది అధికారులు, 50 మంది మేథావులు, పౌరులతోనూ ఒక సంయుక్త కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. లోక్ పాల్ బిల్లుని ప్రభుత్వం పార్లమెంట్ గడపతొక్కించాలనుకున్నా, ఆ బిల్లుకీ, హజారే ఆకాంక్షించిన జన్ లోక్ పాల్ బిల్లుకీ తేడా ఉండటంతో స్వాతంత్ర్యదినోత్సవం మర్నాడే హజారే మరోసారి దీక్ష చేపట్టారు. అయితే, శాంతిభద్రతల పేరిట పోలీసులు అన్నా హజారేను అరెస్టు చేసి ఏకంగా తీహార్ జైలుకు తీసుకెళ్లారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న పెద్దన్నయ్యను, అవినీతి చీడతో కుళ్లిపోయిన ఘరానా మోసగాళ్లున్న జైలుకే తరలించడంతో ప్రభుత్వ తీరుపట్ల యావత్ జాతి అసహ్యంచుకుంది. దీంతో ఒక్క రోజులోనే యావత్ దేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం ఆకాశాన్నంటింది. ఎటు చూసినా హజారే మద్దతుదారులే. పార్టీలు, కులాలు, మతాలు… విబేధాలు…ఇవేవీ అడ్డురాలేదు. కోటానుకోట్ల గొంతులు ఏకమై నినదిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జన్ లోక్ పాల్ బిల్లు స్వరూపం ఏమిటో చూద్దాం…

జన్ లోక్ పాల్ బిల్లులో ఏముందీ..
జన్ లోక్ పాల్ బిల్లును సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి, ప్రస్తుత కర్నాటక లోకాయుక్త- సంతోష్ హెగ్డే , సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్, మెగసెసె అవార్డు గ్రహీత, సామాజిక కార్యకర్త అరవింద్ కెజిర్వివాల్ రూపకల్పన చేశారు. జనలోక్ పాల్ బిల్లులోని ముఖ్యాంశాలు ఇవి…


- కేంద్రంలో లోక్ పాల్ ఏర్పాటు
-రాష్ట్ర స్థాయిలో లోకాయుక్త ఏర్పాటు
- స్వతంత్ర్యంగా దర్యాప్తు చేపట్టే అధికారం
- విచారణలో ఏమంత్రి జోక్యం ఉండదు
- దర్యాప్తు ఏడాదిలో పూర్తికావాలి
- కేసు విచారణ మరోఏడాదికి పూర్తికావాలి
- రెండేళ్లలో కేసు పరిష్కారం
- దోషులకు జైలు శిక్ష
- లోక్ పాల్ కు పోలీస్ అధికారాలు
- బిల్లులో పూర్తి పారదర్శకత
- ఫిర్యాదు పరిధిలో లోక్ పాల్ అధికారి



లోక్ పాల్ విచారణ పరిధిని కేవలం రాజకీయనాయకులకే పరిమితం చేయకుండా, అధికారులు, న్యాయమూర్తులను కూడా ఇందులో చేర్చాలని  జన్ లోక్ పాల్ బిల్లు సూచిస్తోంది.
జన్ లోక్ పాల్ బిల్లు సంగతి సరే, అసలు మనదేశానికి అవినీతి చీడ ఎలా పుట్టుకొచ్చిందో, అది ఎంత దారుణంగా పెరిగిందో ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

(మిగ‌తా రెండ‌వ భాగంలో)
– తుర్లపాటి నాగభూషణ రావు
98852 92208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!