సిఎం హామీలు హ‌ద్దులు దాటుతున్నాయా..?


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కూడా వాగ్దానాలు చేయడంలో పోటీ పడుతున్నారు.హామీలు ఇవ్వడానికి , అవన్ని నిజమని నమ్మించడానికి నానా తంటాలు పడుతున్నారు. రెండు రోజుల క్రితం విశాఖలో ఉపన్యసిస్తూ ఒక మాట అన్నారు. వచ్చే మూడేళ్లలో పదిహేను లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.అలాంటి నమ్మకం , ఆ దిశలో కృషి చేయడం తప్పు కాదు. కాని అది ఎన్నికల నినాదం కాదని ఆయన వ్యాఖ్యానించారు. నిజంగానే అలా చేయగలిగితే ఆయనను మించిన ముఖ్యమంత్రి మరొకరు ఉండదు. కాని అది అంత తేలికైన విషయం కాదు. అంకెలు చెప్పేటప్పుడు ఆచరణాత్మకంగా ఉండాలి.ఒకపక్క ఉద్యమాలతో రాష్ట్రం సతమతమవుతుంటే,రాజకీయ సంక్షోభాలతో రాష్ట్రం గందరగోళంగా ఉంటే ముఖ్యమంత్రేమో అన్ని లక్షల ఉద్యోగాలు అంటే జనం నమ్మడం కష్టం. అలాగే తాజాగా రచ్చబండ కింద వచ్చిన దరఖాస్తుదారులలో అర్హులందరికి ఇళ్లు కట్టిస్తామని ఆయన మరో వాగ్దానం ప్రకటించారు.అలా చేయాలంటే 7650 కోట్ల రూపాయలు ఖర్చు చేయవలసి ఉంటుందని అధికారులు లెక్కగట్టారు. వచ్చిన దరఖాస్తులు వడపోసి చూస్తే సుమారు పదిహేను లక్షల ఇళ్లు కట్టివ్వడానికి అర్హులైన పేదలు ఉన్నారని తేలింది. దీనికి అయ్యే ఖర్చు 7650 కోట్లు అయితే ఎప్పుడు ఆ నిధులు వచ్చేది. ఎప్పుడు ఆ ఇళ్లు కట్టేది? అన్న ప్రశ్న వస్తుంది. గత ముప్పై ఏళ్లలో ఈ ప్రభుత్వాలన్నీ కట్టిన ఇళ్ల సంఖ్య లెక్క వేస్తే బహుశా ఏ కోటి ఉంటాయో. అవన్ని ఏమయ్యాయ్యో ఏమో కాని ఎప్పటికప్పుడు లక్షల సంఖ్యలో డిమాండు అయితే కొనసాగుతూనే ఉంది. నాయకులు భారీగా వాగ్దానాలు చేస్తూనే ఉంటారు. ఇప్పుడున్న బడ్జెట్ ను రెట్టింపు చేస్తే అంటే సుమారు ఐదువేల కోట్ల మొత్తం కేటాయిస్తే అప్పడు ఈ పని జరుగుతుందేమో.కాని అది ఆచరణలో కష్టమన్న సంగతి వేరే చెప్పనవసరం లేదు.ఇదే మాటలు కోటలు దాటడం అంటే.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!