రంజాన్ పండుగ విశిష్ట‌త‌..


వివేకపు ద్వారాలు తెరచి సౌహార్ద సమభావాల్ని పంచాలనే దైవ ఆదేశాన్ని పాటించడానికి అమలిన హృదయాలతో ఒకరికొకరు సహాయపడాలి. ఇందుకు సామూహిక శక్తి అవసరం. ఈ శక్తిని కలిగించేది నమాజ్‌. దుష్టచింతనల్ని, దురాగ తాల్ని, కుహనా సంస్కారాన్ని నమాజ్‌ ఎదుర్కోగలదు. సత్ప్రవర్తనను నేర్పించ గలదు. ‘సత్ప్రవర్తనగల వ్యక్తి సర్వేశ్వ రుని దృష్టిలో అందరికన్నా మిన్న’

(ఖుర్‌ఆన్‌ 49:13)

ఈద్‌ను శ్రామికుని వేతనం లభించే రోజు అని ఖురాన్‌ విస్పష్టం చేసింది. నెలరోజులు కఠోరవ్రతం పాటించినవారి శ్రమకు పరిపూర్ణ ప్రతిఫలం ఈరోజే లభిస్తుందని విశ్వాసం. పర్వదినాన ఉదయం స్నానపానాదులు ముగించుకొని నూతన వస్త్రాలు ధరించి సుగంధం, పన్నీరు పూసుకొని ‘తక్బీర్‌’ పఠిస్తూ ఈద్‌గాహ్‌ (పండుగ నమాజ్‌ చేసే స్థలం) చేరుకుంటారు. అక్కడ ప్రార్థన చేస్తారు. ‘ఇహ్‌దినస్సిరాతల్‌ ముస్తఖీమ్‌’ (మాకు సన్మార్గాన్ని చూపు). సమస్త మానవాళి హృదయాల్ని సద్బుద్ధితో నింపాలని కోరతారు. ఈద్‌గాహ్‌లో నమాజ్‌ పూర్తి అయిన అనంతరం అక్కడ సమావేశమైన వారిలో వీలైనంత ఎక్కువమందిని కలిసి సుహృద్భావంతో చేతులు కలుపుతారు. హృదయాలు సన్నిహితమవుతాయి. సద్గుణాల పరిమళం పరిఢవిల్లుతుంది. ఈద్‌ ముబారక్‌ (ఈద్‌ శుభాకాంక్షలు) తెలియజేసుకొంటారు. అనంతరం ముస్లిమేతర సోదరుల్ని ఇంటికి ఆహ్వానిస్తారు. అమితానందంతో పరస్పరం ఆలింగనం చేసుకొంటారు. విందు ఆరగిస్తారు. ఈద్‌ మిలాప్‌ సమావేశాలు ఏర్పాటుచేస్తారు. ఇవన్నీ మతసామరస్యానికి, పరస్పర సదవగాహనకు, సమైక్యతకు ప్రతీకలు. మతసహనం మానవలోకానికి మణికిరీటంగా భాసిస్తే, మనిషి మనిషిగా జీవిస్తే భగవంతునికి ఎనలేని హర్షం. ప్రతి వ్యక్తి నిస్వార్థ సేవ చేస్తే జీవితంలోని వాస్తవిక ఆనందం బోధపడుతుంది. ఇతరుల శ్రేయంకోసం జీవిస్తే అది విరాటజీవనంలో పదార్పణమవుతుంది. అప్పుడే సర్వేశ్వరుడు మన జీవితాలకు సాఫల్యం సమకూరుస్తాడు. తన హృదయ వైశాల్యాన్ని ప్రతి వ్యక్తీ లోకానికి చాటినప్పుడే జన్మకు సార్థకత, సంపూర్ణత. అది డబ్బు గడించడంవల్ల రాదు. కోరికలు నెరవేర్చుకోవడంవల్ల ఒనగూడదు. ఇది అనంత జీవిత సత్యం, పర్వదినాల సారాంశం.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!