మేనేజ్ మెంట్ గురు శ్రీకృష్ణ -2



శ్రీకృష్ణుని స్మార్ట్ వర్క్

కృష్ణుడు రాజా? కానే కాదు. ఆయన రాజు కాదు… యుద్దంలో ఒకేఒక్కసారి ఆయుధం చేపట్టినా.. అది లోక సంరక్షణకే. కాని ఆయన మంచి వ్యూహకర్త. ఒక వ్యూహాన్ని పన్నాడంటే… నూటికి నూరు శాతం.. అది విజయవంతం అయి తీరాల్సిందే. అణువంత కూడా తేడా రాదు. శత్రువు బలాబలాలను అంచనా వేయడంలోనూ.. బలహీనతలను గుర్తించడంలోనూ కిట్టయ్యకు సాటెవ్వరు? దీనికి మహాభారత సంగ్రామమే నిదర్శనం. బుద్ధిబలం
అపాయంలో ఉపాయంతో బయటపడం కాదు… ఉపాయంతో అపాయాలను రాకుండా అడ్డుకుంటేనే సమర్థత బయటపడుతుంది అంటాడు శ్రీకృష్ణుడు. యుద్దతంత్రంలో ముకుందుడికి ఎవ్వరు ఎదురు నిలవలేరు? రణరంగంలో విజయం సాధించాలంటే భుజబలం ఉంటే సరిపోదు. దానికి బుద్దిబలం కచ్చితంగా అవసరం. దాన్ని అక్షరాలా రుజువు చేశాడీ మురారి.
కొన్ని అక్షౌహిణుల సేనను, రథ, గజ, తురగ, పదాతి దళాలను కౌరవుల పరం చేసి… తానొక్కడు మాత్రం పాండవుల పక్షం వహించి, వారిని విజయం వైపు నడిపించాడు. అంటే ఇక్కడ కావల్సింది భుజబలం కాదు.. బుద్దిబలం అని అర్థమవుతూనే ఉంది. తననే అన్నీ అనుకున్న పాండవులకు అన్నీ తానే అయి నిలిచి… వారి కోసం… మాయలు చేసి, మహిమలు చూపి.. మంత్రాంగం నడిపి మొత్తానికి కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించిపెట్టాడు. నమ్మినవారికి సదా అండగా ఉండాలన్న సూత్రాన్ని చాటిచెప్పాడు.
కత్తిపట్టే అవసరం లేకుండానే… తన మాటల చాతుర్యంతో మహాభారత సంగ్రామాన్ని అడ్డుకోవడానికి శతవిధాలా ప్రయత్నించాడు. పాండవుల తరపు రాయబారిగా… యుద్దం అవసరం లేకండా మాటలతోనే పని కానివ్వడానికి యత్నించాడు. ఇక్కడ దౌత్యం ఎలా నెరిపాడన్నదే ముఖ్యం. ఈ వెన్నదొంగ ఎప్పుడూ ప్రలోభాలకు లొంగలేదు. శత్రువులకు వెన్నుచూపలేదు. కార్యసాధన అంటే ఏంటో లోకానికి చాటిచెప్పాడు. శరణన్నవారికి సదా రక్షణగా నిలిచాడు. సహాయం కోరినవారికి చేయూతనందించాడు. అందుకే అందరికీ ఇష్టుడయ్యాడు.

చెక్ పెట్టడంలో దిట్ట


మహాభారత సంగ్రామంలో కర్ణుడిని అడ్డుకోవాలంటే అది పాండువులకు అంత సులభం కాదని గ్రహించాడు కృష్ణుడు. అందుకే కుంతి ద్వారా కార్యం నడిపించాడు. చివరకు అర్జునిడిని తప్ప… మిగిలిన వారిని వదిలేస్తానని కుంతీ పుత్రుడు చెప్పాడు. అది చాలు కిట్టయ్యకి. అర్జునిడిని ఎలాగూ తాను కాపాడుకోగలడు. అంటే సమస్య పరిష్కారమైనట్టే. రాగల ప్రమాదాన్ని ముందే ఊహించి.. దానికి ఎలా చెక్ పెట్టాలో… ఎవరి ద్వారా ఆ సమస్యకు పరిష్కారం లభించగలదో ఊహించడం… ఆ ప్రకారం తతంగాన్ని నడిపించడంలో దేవకీ సుతుడికి సాటెవ్వరు?.

స్థితప్రజ్ఞత


కృష్ణుడిలో మరో గుణం- స్థితప్రజ్ఞత. దేనికీ చలించడు. నల్లనివాడని ఎగతాళి చేసినా… వెర్రిగొల్లవాడని నిందించినా… నోరెత్తలేదు. తాత్వికుడని పొగిడినా కాదనలేదు. దైవసమానుడివి అంటూ పూజలు చేసినా… అడ్డుచెప్పలేదు. ఎవరు ఎలా చూస్తే అలానే దర్శనమిచ్చాడు. ఎవరు ఎలా పిలిస్తే అలానే పలికాడు. దేనికీ లొంగలేదు. పొంగిపోలేదు. ఈ చెక్కుచెదరని వ్యక్తిత్వమే ఆయనకు కొండంత బలం. ది బెస్ట్‌మేనేజ్‌మెంట్‌గురు అనిపించుకోవాలంటే ఇంతకన్నా ఏం కావాలి?.
కురుక్షేత్రం సంగ్రామంలో కౌరవుల తరపున తన పెద్దవాళ్లు పోరాడుతుండడంతో… వెనకడుగు వేస్తాడు పార్థుడు. అలాంటప్పుడు… కృష్ణుడే గీతను బోధించాడు. చేయించేవాడు ఎవడు.. చేసేవాడెవడు అంటూ ధర్మం కోసం పాటుపడడమే జీవిత లక్ష్యమని.. చేయాల్సిన బాధ్యతను నిర్వర్తించడమే ధర్మమని చెప్పాడు. ఈ విధంగా ధర్మాధర్మ విచక్షణ ఎలా ఉండాలో జగత్తుకు చాటాడు.
గోవిందుడు బోధించిన గీతాసారంలో లేని వ్యక్తిత్వ వికాసం ప్రపంచంలో ఇంకెక్కడ దొరుకుతుంది. పర్సనల్‌మేనేజ్‌మెంట్ పేరుతో జుట్టుపీక్కుని.. చొక్కాలు చింపుకుని మరీ బుక్స్‌ని తిరగేస్తున్నారు. లక్షలకు లక్షలు ఖర్చుపెడుతున్నారు. ఇన్నర్‌పర్సనాలిటీని చక్కదిద్దుకోవడానికి నానా తంటాలు పడుతున్నారు. కానీ కొన్ని వేల ఏళ్ల కిందటే.. వ్యక్తిత్వ వికాసం గురించి మురళీకృష్ణుడు గీతలో చెప్పాడు. అదే ఇప్పటికీ అందరకీ ఆచరణీయం… అనుసరణీయం.
- బాలు
guna_716@yahoo.co.in

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!