జగన్ `కూల్’ వెనుక కథ



ఒక వ్యక్తి యాత్రలో ఉన్నాడనుకోండి. ఇంటికి చాలా దూరంలో ఉన్నాడనుకోండి. సరిగా అదే సమయంలో ఇంట్లో దొంగలు పడ్డారనో, లేదా, ఇంట్లోని వారు తీవ్ర అస్వస్థతకు గురయ్యారనో తెలిస్తే ఎలా స్పందిస్తారు? ఈ ప్రశ్న మానవ సంబంధాలకు సంబంధించింది. ఈ ప్రశ్న భావోద్వేగాలకు సంబంధించింది. అనుకోని రీతిలో షాకింగ్ న్యూస్ విన్నప్పుడు మానసికంగానూ, శారీరకంగానూ జరిగే మార్పులను ఈ మధ్యకాలంలో బ్రిటన్ కు చెందిన మానసిక శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేశారు. 270 మందిపై వారు చేసిన పరిశోధనల్లో అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. ఆత్మీయుల గురించో, లేదా ఆస్తిపాస్తుల గురించో హఠాత్తుగా వినగూడని వార్తలు విన్నప్పుడు 82 శాతం మందిలో మొహం పాలిపోయినట్టు కనిపించింది. మిగతా వారిలో సగం మంది వెంటనే ఆ వార్తను అర్థం చేసుకోలేకపోయారు. ఇక మిగిలినవారు మాత్రం స్థితప్రజ్ఞులుగా ఉండిపోయారు.
ఈ పరిశోధనల సంగతి తెలుసుకుంటున్నప్పుడు కచ్చితంగా మీ మదిలో కడప ఎంపీ జగన్ మోహన్ రెడ్డి మెదిలే ఉంటారు. గురువారం (18-08-11) ఉదయం నుంచీ ఎడతెరపలేకుండా సీబీఐ దాడులు చేస్తున్నప్పటికీ, జగన్ మాత్రం తనదైన శైలిలో ఓదార్పు యాత్ర చేసుకుంటూనే పోయారు. జగన్ కంపెనీలమీద, ఆయన సన్నిహితుల ఇళ్లమీద ఏకకాలంలో కనీవినీ ఎరుగని రీతిలో సీబీఐ దాడులు జరుపుతున్నా, ఓదార్పు యాత్రలో ఉన్న జగన్ వెంటనే తన యాత్రను విరమించుకుని హైదరాబాద్ కో, లేదా బెంగళూరుకో పరిగెత్తుకుని వెళ్లలేదు. మామూలు వ్యక్తి అయితే, అలా చేసిఉండేవారమో…కానీ జగన్ ఆ తరహా సాదాసీదా వ్యక్తి కాదు. జనబలం కంటే, తనకేవీ లెక్కలోకి రావని ఆయన భావించారా? లేదంటే, సీబీఐ దాడుల సీరియస్ నెస్ సరిగా అర్థం చేసుకోలేకపోయారా….? పోనీ రెండోదే నిజమని అనుకుంటే, మర్నాడు (శుక్రవారం) ఆయన కృష్ణాజిల్లా ఓదార్పు యాత్రను ఆపేసి ఇంటికి వెళ్ళాలి. కానీ అదీ జరగలేదు. అసలు జగన్ ను ఎలా అర్థం చేసుకోవాలి? మానసిక శాస్త్రవేత్తలనే సవాల్ చేసే మనస్తత్వం ఆయనలో ఉన్నదని అనుకోవాలా? స్థితప్రజ్ఞుడిగా ఎదిగారని భావించాలా?
గురువారం ఉదయం కృష్ణాజిల్లాలోని పెనుగంచిప్రోలులోని స్థానిక నేత ఉట్ల నాగేశ్వరరావు ఇంట్లో బసచేశారు. ఆ ఉదయం జగన్ కు తల్లి విజయమ్మ నుంచీ, భార్య భారతి నుంచి ఫోన్ కాల్స్ వచ్చినట్టు తెలిసింది. వారేం మాట్లాడారో తెలియకపోయినా, కచ్చితంగా ఆ సంభాషణలో సిబీఐ దాడుల ప్రస్తావన వచ్చిఉంటుందని అనుకుంటున్నారు.  అయితే, జగన్ ఆ తరువాత స్థానిక నేతలతో ఓదార్పు యాత్ర గురించే మాట్లాడారు. పైకి ఎలాంటి ఆందోళన వ్యక్తం చేయలేదు. హైదరాబాద్ నుంచి అందుతున్న సమాచారాన్ని జగన్ చాలా కూల్ గానే అందుకున్నారు. ఎక్కడా ఆవేశపడినట్టు కనబడలేదు. తన ఫోన్ నుంచి మాట్లాడేటప్పుడు జగన్ ఎక్కడా వివాదాస్పద అంశాల గురించి ముచ్చటించలేదు. అలాగే, ఎస్.ఎం.ఎస్ లు పంపేటప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకున్నారు. బహుశా, ఫోన్ ట్యాపింగ్ ఉంటుందని ఆయన అంచనా వేసిఉండవచ్చని స్థానిక వర్గాలు అభిప్రాయపడ్డాయి. ఓదార్పు యాత్ర సాగుతున్నంతసేపు ఆయన తన తండ్రి వైఎస్సార్ ను అప్రదిష్టపాలుచేయడానికే తనపై బురద జల్లుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు. సోనియా ఈనాడు అనుభవిస్తున్న పవర్ తన నాన్న కష్ట్రార్జితమంటూ జగన్ వ్యాఖ్యానించారు. ఇదంతా మరచిపోయి మహానేతను కాంగ్రెస్ పార్టీవాళ్లు అవమానపరుస్తున్నారని జగన్ ఆవేశంగా అన్నారు.
ఓదార్పు యాత్ర సందర్భంగా మాట్లాడినప్పుడు చూపించిన ఆవేశం, సీబీఐ దాడులు మొదలయ్యాయని తెలియగానే ఆయన ప్రదర్శించలేదు. బహుశా, ఇలాంటిదేదో జరుగుతుందని జగన్ ముందుగానే ఊహించి వ్యూహాత్మకంగా నడుచుకుంటున్నారన్న వాదన కూడా వినబడుతోంది. ఏది ఏమైనా జగన్ లోపలి మనిషి ఎలా ఉంటాడన్న సందేహం అందరిలో కలుగుతోంది. మరి దీన్ని మానసిక శాస్త్రవేత్తలు ఎలా విశ్లేషిస్తారో చూడాల్సిందే.
– ఎన్నార్టీ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!