`సుప్రీం’ పవర్ (Part-3)



మనదేశంలో న్యాయవ్యవస్థ సమానాంతర పరిపాలన సాగిస్తోందా? ఇటీవల కాలంలో న్యాయస్థానాలు ఇస్తున్న సంచలన తీర్పులు, స్వయంగా కేసులు స్వీకరించి పరిష్కరిస్తున్న తీరుతెన్నులు చూస్తుంటే ఏమనిపిస్తోంది? ప్రజదల పక్షాన నిలుస్తున్నది శాసన వ్యవస్థ ద్వారా ఎన్నికైన పాలకులా, లేక న్యాయవ్యవస్థను సమున్నుతంగా నడిపిస్తున్న న్యాయమూర్తులా? ఏది నిజం? మరేది అవాస్తవం…??

(మూడ‌వ భాగం)



కోక్ టు కపాడియా

1607లోనే న్యాయవ్యవస్థకున్న  పవర్ ఏమిటో యావత్ ప్రపంచానికీ తెలిసిపోయింది.  ఇంగ్లండ్ లోని సర్ ఎడ్వర్డ్ కోక్ అనే న్యాయమూర్తి రాజ్యదిక్కారంగా అంతా భావించేరీతిలో  నాటి రాజు జేమ్స్  వైఖరిని తప్పుపట్టారు. ఈ సందర్భంగానే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. అందులో కీలకమైనది ఇదే…

`రాజు జ్ఞానసంపన్నడు అయితే కావచ్చు…
కానీ, రాజుకు న్యాయశాస్త్ర మర్మాలు తెలియవు’



మహోన్నత విలువలతో కూడిన తీర్పులు చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అంతటి మేరు శిఖరస్థాయి న్యాయమూర్తులూ ఉన్నారు.
ఎంతవరకో ఎందుకు… ప్రస్తుత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి S.H. కపాడియా ఆ కోవకు చెందిన న్యాయమూర్తే. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఆయన 2010 మే లో పదవీబాధ్యతలు చేపట్టినప్పటి నుంచీ ఇప్పటివరకు అనేక ప్రజాప్రయోజన వ్యాజ్యాల్లో సంచలన తీర్పులు ఇచ్చారు. అంతేకాదు, కొన్ని కేసులను సుమోటొగా స్వీకరించిన సందర్భాలూ ఉన్నాయి. చీఫ్ జస్టిస్ కపాడియా 2012లో రిటైర్ అవుతారు.

ఎమర్జెన్సీ వెనుక కథ

అలహాబాద్ హైకోర్టు ఒక కేసులో ఇచ్చిన తీర్పు కారణంగా ఇందిరాగాంధీ తన ప్రధాని పదవిని వదులుకోవాల్సి వచ్చింది. అనంతరకాలంలో ఎమర్జెన్సీ సెక ఏమిటో ప్రజలకు తెలిసింది. ఇలాంటి శక్తివంతమైన తీర్పులు భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఎన్నో నిక్షిప్తమై ఉన్నాయి.
పాలకులు దారితప్పితే, దేశాన్ని సన్మార్గంలో నడిపించాల్సిన బాధ్యతను న్యాయస్థానాలు సక్రమంగానే నిర్వహిస్తున్నాయి. రాజ్యాన్ని సన్మార్గంలో నడిపించడంలో న్యాయవ్యవస్థ అనేక సందర్భాల్లో కీలకపాత్రనే పోషించింది.
న్యాయస్థానాలు ఎప్పుడూ ప్రజలపక్షానే నిలుస్తుంది. పాలకులు దారితప్పినప్పుడల్లా  తీవ్రస్థాయిలో మందలిస్తూనే ఉంటోంది. అందుకే దేశాన్ని సన్మార్గంలో నడిపించడంలో న్యాయస్థానాలు తలమానికంగా నిలుస్తున్నాయి. న్యాయవ్యవస్థకీ, లెజిస్లేచర్ కీ మధ్య ఉత్పన్నమయ్యే అనేక వివాదాల్లో ఇదే విషయం సుస్పష్టమైంది.

1975లో అలహాబాద్ హైకోర్టు -  రాజ్ నారాయణ్ వేసిన పిటీషన్ కు స్పందిస్తూ,  ఇందిరాగాంధీ ఎన్నిక చెల్లదనీ, ఆమెను ఆరు సంవత్సరాలపాటు ఎన్నికల నుండి బహిష్కరించాలని న్యాయస్థానం తీర్పు చెప్పింది. ఈ కారణంగానే  ఆమె ప్రధాని పదవినుంచి వైదొలగాల్సి వచ్చింది. చివరకు ఈ వివాదం  దేశంలో ఎమర్జెన్సీ రావడానికి కారణమైంది.
1992లో ఒబీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు రిజర్వేషన్ ప్రతిపాదనలను అంగీకరిస్తూనే,  కొన్ని అభ్యంతరాలు లేవనెత్తింది. క్రీమీలేయర్ ను పరిగణలోకి తీసుకోవాలని సూచించింది. క్రీమీలేయర్ పరిధిలోని వారికి ఓబీసీ రిజర్వేషన్లు వర్తింపజేయకూడదని కుండబద్దలుకొట్టినట్టు చెప్పింది. అంతేకాదు, రిజర్వేషన్లు మొత్తం కలిపి 50 శాతం దాటకూడదని కూడా తేల్చిచెప్పింది.

ఎన్నికలపై మార్గదర్శకాలు

2002లో సుప్రీంకోర్టు ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఎన్నికల్లో నిలబడే అభ్యర్థులు విధిగా పాటించాల్సిన మార్గదర్శకాలు ఉండాలని తేల్చి చెప్పింది. అభ్యర్థుల ఆస్తి వివరాలు వెల్లడించాలనీ, నేరపూరిత కేసులు ఉంటే వాటి వివరాలు చెప్పాలనీ, అలాగే, విద్యార్హత వివరాలు కూడా పొందుపరచాలని కూడా తేల్చిచెప్పింది.  ఒక నెల తరువాత ఎన్నికల కమిషన్ ఈ మార్గదర్శకాలనే నోటిఫికేషన్ లో ప్రకటించింది. అయితే, ప్రభుత్వం దీన్ని ప్రతిఘటించాలని చూసింది. ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణ ద్వారా ప్రతిఘటించాలని ప్రయత్నించింది. అయితే, 2003లో సుప్రీంకోర్టు బెంచ్ ఈ సవరణ రాజ్యాంగవిరుద్ధమంటూ తేల్చిచెప్పింది.



ప్రజల సమస్యలపైనా తీర్పులు


నాయకుల తప్పులనేకాదు, దేశ ప్రజలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలపై కూడా మన సుప్రీంకోర్టు కీలక తీర్పులు చెప్పింది. దీంతోపాటుగా న్యాయవ్యవస్థలోని లొసుగులను కూడా ప్రక్షాళ చేసుకోవాల్సిన పరిస్థితి సర్వోన్నత న్యాయస్థానం గుర్తించింది.
పాలనావ్యవస్థలోని లోపాలను ఎండగట్టడంలోనే కాదు, ప్రజలు ఎదుర్కుంటున్న అనేక సమస్యలపై కూడా సుప్రీంకోర్టు ఈ మధ్య కాలంలో అనేక కీలక తీర్పులు వెలువరించింది.



-1998లో వాతావరణ కాలుష్యంపై తీర్పు
- 2005లో ధ్వని కాలుష్యంపై తీర్పు
- 90వ దశకంలో నీటి కాలుష్యంపై తీర్పు
- 2010లో రోడ్ల భద్రతపై తీర్పు
- 2011లో ఆహారభద్రతపై తీర్పు

సుప్రీం తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు కొరుకుడుపడని మాట వాస్తవమే. ఈ విషయంలో ప్రతిపక్షం, అధికారపక్షం అన్న తేడాలేదు. పిజె థామస్ కేసు విషయం తీసుకుందాం. ఆయనకు పదవి కట్టబెట్టే విషయంలో ప్రధానమంత్రి ప్రేమయాన్ని సుప్రీం సూటిగాప్రశ్నించింది.
బాబ్రీ మసీదు కూల్చివేత కేసులో   ఎల్.కె.అద్వానీ, మురళీమనోహర్ జోషీలకు కూడా సుప్రీం సమన్లు జారీచేసింది. రాజకీయ పార్టీల స్థాయిబేధాలు చూడకుండా సుప్రీం చురకలు అంటిస్తూనే వస్తున్నది.
న్యాయవ్యవస్థలోని అవకతవకలను కూడా ప్రక్షాళన చేసుకోవాల్సిన పరిస్థిత భారత న్యాయస్థానాలకు ఏర్పడింది. రాజకీయంగా దుర్వినియోగం కాకుండా చూసుకునేందుకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి లేకపోలేదు. ఎమర్జెన్సీ టైమ్ లో స్వేచ్ఛగా జీవించే హక్కు ఉండదంటూ ధర్మాసనం చెప్పడం అలాంటిదే…
న్యాయవ్యవస్థ ఎదుట హామీ ఇచ్చి, ఆ తర్వాత అందుకు విరుద్ధంగా స్పందించిన సంఘటన కూడా  లేకపోలేదు. 1990-92 మధ్యకాలంలో అయోధ్య రామాలయ నిర్మాణంపై పెద్దపెట్టున ప్రచారం జరిగింది. కల్యాణ్ సింగ్ అప్పట్లో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కల్యాణ్ సింగ్ స్వయంగా సుప్రీంకోర్టు ఎదుట అయోధ్య కట్టడానికి ఎలాంటి హానీ జరగదని హామీ ఇచ్చారు. అయితే సుప్రీంకోర్టుకు ఇచ్చిన హామీకి భిన్నంగా 1992 డిసెంబర్ 22న బాబ్రీమసీదు కూల్చివేత జరిగింది. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఎదుట ఇచ్చిన హామీకి ఉల్లంఘన చర్యగా దీన్ని ఇప్పటికీ చెప్పుకుంటున్నారు.
ఈమధ్యనే సీపీఎం నాయకుడు బిమన్ బోస్ న్యాయవ్యవస్థపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు.  ఈసంఘటనలు న్యాయవ్యవస్థకు, పాలనావ్యవస్థకు చెందినవారు లేదా రాజకీయపార్టీలకు చెందిన వ్యక్తులకు మధ్య ఉన్న అఘాతాలను ఎత్తుచూపుతోంది.
పాలనా వ్యవస్థ తనకున్న పరిధిలను, పరిమితులను నేర్పుగా, హుందాగా పాటించేపక్షంలో సాధారణంగా న్యాయవ్యవస్థ జోక్యం చేసుకోదు. న్యాయవ్యవస్థ చురుగ్గా మారుతున్నదంటే, దానికి కారణం, పాలనావ్యవస్థలోని లోపాలే. అంటే, పాలనావ్యవస్థ స్వరూపస్వభావాలను న్యాయవ్యవస్థ అద్దం పడుతోంది. ప్రస్తుతం జరుగుతున్నది అదే…
న్యాయస్థానాలు చిటికీమాటికీ జోక్యం చేసుకుంటున్నాయన్న వాదన సరికాదు. నిజానికి, అత్యంత కీలకమైన పరిస్థితుల్లోనే న్యాయస్థానాలు సుమొటొగా కేసులు చేపడుతున్నాయి. మిగతా అన్ని సందర్భాల్లో ఎవరైనా కేసు పెడితేనేకానీ న్యాయస్థానాలు జోక్యం చేసుకోవు.  ప్రజాప్రయోజన వ్యాజ్యాలకు సుప్రీం తగు స్థానం కల్పిస్తూనే ఉంది. అందుకే పిల్స్ కు తగిన ప్రాధాన్యత లభిస్తోంది. అంటే, ప్రజలు మేలుకుంటే, తప్పకుండా సమాజంలోని అనేక రుగ్మతలకు న్యాయస్థానాలు చికిత్స చేయగలవు. న్యాయస్థానాల తీరుతెన్నులపై ఆలోచించేముందు, ప్రతి పౌరుడు తన బాధ్యత ఎంతో గుర్తించి సమస్యలను న్యాయస్థానాల దృష్టికి తీసుకువస్తే మంచిది. మరి మీరేమంటారు..?

- తుర్లపాటి నాగభూషణరావు
nrturlapati@gmail.com

కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!