అనుబంధానికి ప్రతీక రాఖీ పౌర్ణమి

చరిత్రలో మొగలాయి చక్రవర్తుల పాలనలో ఈ రక్షాబంధనానికి నూతనమైన విశిష్టత సమకూరింది. రాఖీ కట్టే ఆచారం తమ స్త్రీల రక్షణ కోసం రాజపుత్రులు చేసిన ఏర్పాటని పండితులు పేర్కొంటున్నారు. చిత్తూరు మహారాణి కర్ణావతి గుజరాత్ నవాబైన బహదూర్ షా తమ కోటను ముట్టడించబోతున్నప్పుడు తనను రక్షించమని ఢిల్లీ చక్రవర్తిగా ఉన్న హుమయూన్‌కు రక్షాబంధనాన్ని పంపి ప్రార్థించిందట. ఆ రక్షాబంధనాన్ని స్వీకరించిన హుమయూన్ ఆ రాణిని తన సోదరిగా భావించి బహదూర్‌షాను తరిమి వేశాడని ఆనాటి నుంచి సోదరీసోదర బంధానికి గుర్తుగా ఈ రక్షాబంధనం ప్రచారంలోకి వచ్చిందని పండితులు పేర్కొంటున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలలో శ్రావణ పూర్ణిమను నార్ణీపూర్ణిమ అని అంటారు. ఆ రోజున ప్రజలు సముద్రపు ఒడ్డుకు వెళ్ళి పూజలు చేసి నారి కేళాలను (కొబ్బరి కాయలను) కొడతారు. అందుకే ఇది నారికేళ పూర్ణిమగా (నార్ల పూర్ణిమ) వ్యవహారంలోకి వచ్చింది. పాల్కురికి సోమనాధకవి తన పండితారాధ్య చరిత్రలో ఈ పండుగను నూలిపున్నమ అని వర్ణించాడు. నూల్ అంటే యజ్ఞోపవీతం అని అర్థం. శ్రావణ పూర్ణిమ నాడు నూతన యజ్ఞోపవీతాలను ధరించే ఆచారాన్ననుసరించి ఇలా ఈ పండుగ పేరు వ్యవహారంలోకి వచ్చింది.
రక్షాబంధనానికి సంబంధించి ఇతర పురాణ కథలు కూడా ఉన్నాయి. పౌరాణిక గాథలు ఎలా ఉన్నప్పటికీ ఆధునిక కాలంలో రాఖీ పౌర్ణమి సోదర సోదరీమణుల మధ్య ఆప్యాయతకు, ప్రేమకు ప్రతీకగా మారింది. ఏడాదిలో అన్నిటి కన్నా సోదరసోదరీమణుల మధ్య ప్రేమకు ఈ పర్వదినమే ప్రతీకగా నిలుస్తుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి