అవినీతి భారతం (part-2)



1948లో తొలి కుంభకోణం

అది 1948.
అంటే మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన మరుసటి సంవత్సరం.
స్వాతంత్ర్య భారతావనికి ఏడాది వయసుకూడా రాకముందే అవినీతికి బీజాలు పడ్డాయి. 1948లోనే జీపుల కుంభకోణం బయటపడింది.
కాశ్మీరం నుంచి కన్యాకుమారి వరకు
దేశం మొత్తాన్ని గడగడలాడిస్తున్న భయంకరమైన వ్యాధి ఏమిటో తెలుసా…?
ప్లేగు కంటే భయంకరమైన వ్యాధి మరొకటి ఉన్నదని ఐక్యరాజ్యసమితి మాజీ ప్రధానకార్యదర్శి కోఫీ అన్నన్ దేన్ని ఉద్దేశించి అన్నారో తెలుసా…?
అది మరేదో కాదు… అవినీతి.
వందకోట్లకు పైబడిన జనాభా భవితవ్యంపై ఆటలాడుకుంటున్న విష పురుగు ఇది.
మనదేశ జనాభాలో 60 శాతం మందికి అవినీతి జాడ్యం అంటుకుంది.
స్వైన్ ప్లూ కంటే భయంకరమైన వైరస్ లా పాకిపోతున్నది.  సుమారుగా 50 కోట్ల మంది అవినీతి కారణంగా బాధితులుగా మారిపోతున్నారు.
మనదేశంలోని ప్రతి పౌరుడు సగటున ఒక్కసారికాదు…రెండు సార్లు కాదు…ఆరుసార్లు అయినా అవినీతి కాటుకు గురవుతున్నాడు. ప్రతి పౌరుడు సగటున 1300 రూపాయలు లంచాల కింద ముట్టచెప్పాల్సి వస్తోంది. మొత్తం జనాభాని లెక్కలోకి తీసుకుంటే  కేవలం లంచాలకిందే 3,900 కోట్లు చేతులు మారుతున్నాయన్నమాట. ఇదేమీ చిన్నమొత్తంకాదు. పదిలక్షల 24వేల 52 మంది భారతీయుల తలసరి ఆదాయంతో సమానం. అవినీతి సంపాదన మొత్తం మనదేశ GDPకి 4.36 శాతం ఎక్కువే అంటున్నారు ఆర్థికవేత్తలు.
మనదేశ అవినీతి ఏ స్థాయిలో ఉన్నదో నిపుణులు లెక్కలుతీశారు.
1948 నుంచి 2008 వరకు అవినీతి సొమ్ము 22లక్షల కోట్ల రూపాయలకు చేరుకుంది.
రాజకీయనాయకులు, లంచగొండి అధికారుల  జేబుల్లోకి కాకుండా ఈ మొత్తం ప్రభుత్వ ట్రజరీలకు చేరితే దేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఓసారి ఆలోచించండి.
అవినీతి అనగానే దేశంలోకెల్లా అతిపెద్ద కుంభకోణానికి రారాజుగా నిల్చిన మాజీ టెలికాం మంత్రి ఎ. రాజా పేరు గుర్తుకురాకమానదు. కాగ్ తీసిన లెక్కల్లోనే ఇతగాడి అవినీతి లక్షా77వేల కోట్లకు చేరింది. 2g స్పెక్ట్రం కుంభకోణంలో అందినకాడికి దోచుకోవడంలో రాజా అండ్ హిజ్ గ్రూప్ బరితగించింది.
సంస్కరణలు – అవినీతి
ఆర్థిక సంస్కరణలు ఒకందుకు మొదలుపెడితే,
అవి మరొకందుకు దారితీశాయి.
ఎకనమికల్ రిఫార్స్మ్ పేరిట గేట్లు ఎత్తేయడంతో అవినీతి పాములు బుసలు కొడుతూ లోపలకు ప్రవేశించాయి.
నీరు, నేల, ఆకాశం, భూమి అన్న తేడా లేకుండా అవినీతి రాజ్యమేలింది.
దీంతో అవినీతి సూచికలో భారత్ ఎగబాకింది.
ఎంత సిగ్గుచేటు…ఎంత దయనీయ స్థితి.
ఆర్థిక సంస్కరణల పర్వం 1992లో మొదలైనప్పటి నుంచి అవినీతి పురులువిప్పింది. మన్మోహన్ సింగ్ ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడే ఆర్థిక సంస్కరణల పేరిట గేట్లు ఎత్తేశారు. ఫలితంగా లైసెన్స్ పర్మిట్ల రాజ్యం వచ్చేసింది. టాక్స్ రేట్స్ తగ్గించేశారు. దీంతో ఆర్థిక పరిస్థితి పుంజుకుంది. టెలికాం, ఎయిర్ లైన్స్, బ్యాంక్స్, రోడ్స్, సెజ్ లు, ప్రకృతి వనరులు…ఇలా ఎన్నో ఆర్థికాభివృద్ధి పథకాలు, కార్యక్రమాల్లో లక్షలాది కోట్లు చేతులుమారాయి. రాజకీయనాయకులు, అధికారగణం ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని అయినకాడికి దోచుకున్నారు. ఎవియేషన్ లైసెన్స్ రాబట్టడం కోసం ఒక పారిశ్రామకవేత్త 15 కోట్లు లంచం ఇచ్చేశారు. సెజ్ లను చేజిక్కించుకోవడం కోసం మరో పారి్శ్రామిక వేత్త కోట్లు కుమ్మరించేశాడు.
అవినీతిలో మనదేశ కీర్తి యావత్ ప్రపంచం గుర్తిస్తోంది. అవినీతి బాగా ప్రబలిన దేశాల జాబితాలో మనదేశం ఎప్పుడో చేరిపోయింది. టాన్స్ పరెన్సీ ఇంటర్నేషనల్ అధ్యయనం ప్రకారం, గవర్నమెంట్ ఆఫీస్ ల్లో పనికావాలంటే, 75 శాతం మంది ప్రజలు లంచాలు ఇచ్చుకోక తప్పడంలేదని తేలిపోయింది.
2009 గణాంకాల ప్రకారం అవినీతి సూచిలో భారత్ 84వ స్థానంలో ఉంది.
ఇక్కడే మరో విషయాన్ని కూడా చెప్పుకోవాలి. తక్కువ అవినీతి ఉన్న దేశంగా సింగపూర్ ఎదిగింది. నీతివంతమైన, సక్రమమైన మార్గంలో నడుస్తున్న దేశాల్లో సింగపూర్ ది మూడోస్థానం. మొత్తం పది మార్కులకు గాను సింగపూర్ 9.2 మార్కులు కొట్టేసింది.
మనదేశ పార్లమెంట్ సభ్యుల్లో నాలుగో వంతు మంది నేరారోపణలు ఎదుర్కుంటున్నవారేనని అమెరికాలోని వాషింగ్టన్ పోస్ట్ వెల్లడించింది. అన్ని రాష్ట్రాల్లోనూ అవినీతి రాజ్యమేలుతోంది. కొన్నేళ్ల కిందట బీహార్ లో సబ్సిడీకి ఆహార పథకం ప్రవేశపెడితే, 80 శాతాన్ని అధికారులు కొల్లగొట్టారు. పలుచోట్ల వ్యవస్థీకృత మాఫియా రాజ్యమేలుతుందనడానికి ఇదో ఉదాహరణ మాత్రమే.
కుంభకోణాల చిట్టా
కుంభకోణాల చిట్టా సాగిపోతోంది.
అవినీతి కోణాల సంఖ్య పెరిగిపోతూనే ఉన్నాయి.
అక్రమార్కుల అరాచకం పెట్రేగిపోతూనే ఉంది.
అవినీతి కారణంగా ఏ సంక్షేమ పథకం పూర్తి స్థాయి ఫలితాలను ఇవ్వలేకపోతున్నాయి.
పేదలు నిరుపేదలుగా మారిపోతున్నారు.
సంపన్నులు కుబేరులుగా ఎదిగిపోతున్నారు.
ఆర్థిక అసమానతలు పెరిగిపోతున్నాయి.

అంతులేని సంపద అవినీతి పరుల సొత్తుగా మారిపోతున్నది.
అవినీతి కారణంగా దేశ ప్రజల జీవన ప్రమాణాలు మరింతగా దిగజారతాయి. దారిద్ర్యం తాండవిస్తుంది. అంతేకాదు, అనేక రంగాల్లో అస్థిరత పెరిగిపోతుంది. చివరకు ఇది రాజ్య వైఫల్యానికి దారితీస్తుంది. ఇది ఎవరో చెప్పిన మాటలు కాదు…ఆర్థిక శాస్త్రాన్ని రంగరించిన కౌటిల్యుని వాక్కులు ఇవి.
(మిగ‌తా రెండ‌వ భాగంలో)
– తుర్లపాటి నాగభూషణ రావు
98852 92208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!