కోరిన‌వ‌రాలిచ్చే కాణిపాకం విఘ్నేశ్వరుడు



దేవగణాలకు అధిపతిగా అవతరించిన వినాయకుడు ఈ కాణిపాక క్షేత్రంలో స్వయం భువ విఘ్నేశ్వరుడుగా బావి నుంచి ఉద్భవించాడు. దేశ నలుమూలల నుంచి ఇక్కడికి వచ్చే భక్తుల పాలిట కొంగు బంగారమై ఉద్ధరిస్తున్నాడు. సత్య ప్రమాణాలకు ప్రతీకగా, మానవ పరివర్తనకు మూలస్థానంగా భాసిల్లుతున్న ఈ కాణిపాక క్షేత్రం శాతవాహనుల కాలం నుంచే విశేష పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం. ఒక చారిత్రక సత్యం.
పుణ్యక్షేత్రాలకు నెలవైన చిత్తూరు జిల్లాలో తిరుమల, శ్రీకాళహస్తిల తరువాత కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం చెప్పుకోదగ్గ అపురూప పుణ్యక్షేత్రం. ఈ ఆలయానికి వెయ్యి ఏళ్ళ చరిత్ర ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు సత్య ప్రమాణా లకు నెలవుగా ఉంది. జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణానికి 12 కి.మీ దూరంలో బహుదా నది ఒడ్డున పచ్చని పంట పొలాల మధ్య వెలసిన ఈ క్షేత్రంకు వింత గొలిపే పురాణ ప్రాశస్త్యం ఉంది.

బావిలో దేవుడు

ఇక్కడ వెలసిన వినాయకుడు స్వయంభువుడు. బావిలో నుంచి దిన దిన ప్రవర్థమానంగా పెరుగుతున్నాడన్నది భక్తుల నమ్మకం. ఇది నిజమనడానికి ఆధారాలు ఉన్నాయి. వెయ్యి ఏళ్ళ క్రితం చోళ రాజుల ఏలుబడిలో ఉన్న ఈ కాణిపాకం అప్పుడు విహారపురి అని పిలవబడేది. ఈ గ్రామంలో పుట్టుకతో మూగ, చెవుడు, గ్రుడ్డి వారైన ముగ్గురు సోదరులు ఉండేవారు. వీరికున్న కాణి విస్తీర్ణం (25 సెంట్ల భూమి) ద్వారా వ్యవసాయమే జీవనాధారం.
వీరు ఈ స్థలంలోనే ఒక బావిని త్రవ్వుకుని అందులో యాతం ద్వారా నీటిని తోడి భూమి సాగు చేసుకునే వారు. ఒకసారి వర్షాభావం కారణంగా బావిలో నీరు తగ్గడంతో వీరు బావిని త్రవ్వడానికి ఉపక్రమించారు. ఇలా త్రవ్వుతూ ఉండగా బావిలో నుంచి ఠంగ్ మని శబ్దం వినిపించడంతో ముగ్గురు సోదరులు బావిలో ఉన్న రాయిని గమనించి దానిని తొలగించడానికి గడ్డపార, పార ఉపయోగించారు. గడ్డపార రాయి మీద పడగానే రక్తం చిమ్ముకుని పైకి ఎగసిందట.
ఆ రక్తం వికలాంగులైన సోదరులకు తగలడంతో వారి అంగవైకల్యం పోయిందట. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు బావిని మరి కొంత లోతుకు త్రవ్వగా గణనాధుని విగ్రహం బయట పడిందట. దీంతో ప్రజలు భక్తి పారవశ్యంతో టెంకాయలను సమర్పిం చారు. విశేషంగా పగిలిన టెంకాయల నీటి ద్వారా గుడ్డి, మూగ, చెవుడు సోదరుల కాణి భూమి అంతా ప్రవహించింది. దీంతో కాణి భూమి పారిన ఈ స్థలానికి కాణి పారకం అనే పేరు వచ్చింది. కాలక్రమేణా అది కాణిపాకంగా మారింది. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న కుళత్తుంగ చోళుడనే రాజు 11వ శతాబ్దంలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించినట్లు ఆధారాలున్నాయి. అప్పటి నుంచి బావిలోని వినాయకుడు క్రమంగా పెరుగుతూ ఉన్నాడని ప్రజల విశ్వాసం.

ప్రమాణాలకు, పరివర్తనకు నెలవు

కాణిపాకం స్వయంభు వరసిద్ది వినాయక స్వామి ఆలయం సత్యప్రమాణాలకు, మానవ పరివర్తనకు నెలవుగా భాసిల్లుతోంది. పురాణ పురుషుడైన శ్రీ వరసిద్ధి వినాయకుడే ఇక్కడ న్యాయ నిర్ణేత. ఎటువంటి వివాదాలు వచ్చినా, నేరారోపణలు జరిగినా నిర్దోషిత్వం నిరూపణకు కాణిపాకంలో ప్రమాణం చేస్తావా అన్న మాటలే వినిపిస్తాయంటే స్వామి వారి మీద భక్తులకు ఉన్న నమ్మకం అర్థమవుతుంది. స్వామి వారి ముందు తప్పుడు సాక్ష్యమిచ్చిన వారు వెంటనే తగిన ప్రాయశ్చిత్తం అనుభవిస్తారన్నది ప్రజల ప్రగాఢ నమ్మకం.
అందుకే ఈ ఆలయంలో సత్య ప్రమాణాలు బ్రిటీష్ కాలం నుంచి ఇప్పటి వరకు ఆనవాయితీగా కొనసాగుతున్నాయి. ఇక్కడి ప్రమాణాలకు ఆంగ్లేయుల కాలంలోని న్యాయస్థానాలలో కూడా అత్యంత విలువ ఉండేది. దురలవాట్లకు బానిసలైన వారిని కూడా స్వామి వారి సన్నిధిలో చేసే ప్రమాణాలు పరివర్తులను చేస్తున్నాయి. దురలవాట్లు మానుకొంటామని ఇక్కడ ప్రమాణం చేసి ఎందరో పరివర్తన చెందారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!