లోక్ పాల్ ఏకైక పరిష్కారమా? – 2


రాజకీయ శక్తుల జోక్యం

ఈ దేశంలో రాజకీయ శక్తుల ప్రమేయం లేకుండా ఒక ఉద్యమం ప్రారంభమైనప్పటికీ,  ఆ తరువాత అది రాజకీయశక్తులతో కలుషితం కావడం ఖాయం.  సుంకిచిత ఆలోచనలతో సాగేవారి ఉద్యమాలు, భావస్వారూప్యతతో మద్దతు పలికేవారిని అండగా చూసుకుంటూ సాగించే పోరాటాలు చివరకు ప్రమాదకరమైన మలుపులు తిరగొచ్చు.
స్వాతంత్ర్యం వచ్చిన తరువాత సామ్యవాదం పేరిట ఆర్థికాభివృద్ధి చర్యలు చేపట్టినప్పుడే అవినీతికి బీజం పడింది. నాటి నుంచి అనేక కుంభకోణాలు వెలుగుచూశాయి. ఆమాటకొస్తే, స్వాతంతత్ర్యం వచ్చిన మరుసటి ఏడాదే తొలి కుంభకోణం వెలుగుచూసింది. ఈ పరిస్థితిని గుర్తించిన  ప్రభుత్వం అవినీతిని కట్టడిచేయడంకోసం చర్యలు ప్రారంభించింది . అందులో భాగంగానే అవినీతి వ్యతిరేక వ్యవస్థ అవతరించింది. అయితే, విచ్చలవిడిగా సాగిపోతున్న అవినీతి కుంభకోణాల అంతు చూడాలేంటే, సమర్థవంతమైన బిల్లు కావాలన్న ఆలోచన నుంచే జన్ లోక్ పాల్ బిల్లు మొగ్గతొడిగింది.

నాడు తెల్లవాడు- నేడు మనోడు

ఒకప్పుడు తెల్లవాడు వ్యాపారం చేసుకుంటానంటూ మనదేశ గడ్డమీద కాలుమోపాడు. ఆ తరువాత వ్యాపారి కాస్తా, పాలకుడిగా మారిపోయాడు. ఇంచుమించు ఇదే సీన్ ఇప్పుడూ జరుగుతోంది. అయితే, పరాయిదేశస్థులు పాలనాపగ్గాలు అందిపుచ్చుకుంటే, ఇప్పుడు ఇండియన్ కార్పొరేట్ సంస్థలే పాలనా వ్యవస్థపై పట్టుసాధించడం మొదలుపెట్టాయి. దీంతో ప్రభుత్వమే అవినీతిని ప్రోత్సహించే విచిత్ర పరిస్థితి వచ్చేసింది.
గడచిన ఆరు దశాబ్దాల కాలంలో దేశంలో ఎన్నో మార్పులు చోటుచేసుకున్నాయి. దేశ ఆర్థిక స్థితి మారింది. ఫ్రీ-మార్కెట్లు రాజ్యమేలడం మొదలుపెట్టాయి. జాతీయ, బహుళజాతీయ సంస్థల మూలాలు బలిష్టమయ్యాయి.  వ్యాపారానికి దిగిన కార్పొరేట్ సంస్థలు నెమ్మదిగా   పాలనావ్యవస్థపై పట్టుసాధించడం మొదలుపెట్టాయి. ఫలితంగా, పాలకులు ఈ తరహా కార్పొరేట్ సంస్థల జేబుబొమ్మలుగా మారిపోయారు. `పవర్’ అన్నది గవర్నమెంట్ నుంచి  కార్పొరేట్ చేతుల్లోకి మారిపోయింది. దీంతో అవినీతి, లంచగొండితనం జడలు విప్పింది.  ఈ కోణాలను పరిగణలోకి తీసుకోకుండా, కేవలం ఒక ఉద్యమంతోనో, ఒక దీక్షతోనో లేదా ఒక బిల్లుతోనూ మొత్తం అవినీతిని అంతమొందించవచ్చని అనుకోవడం భ్రమే అవుతుంది.

భ్రమలు – భావోద్వేగాలు

భ్రమలతో కూడిన ఉద్యమాల వల్ల ప్రజల్లో భావోద్వేగాలు ఏర్పడుతుంటాయి. ఈ కారణంగా ఆత్మహత్యలు, ప్రాణత్యాగాల చేసుకునేవారి సంఖ్య పెరగవచ్చు. శాంతి భద్రతల  సమస్య కూడా తలెత్తవచ్చు. ఫలితంగా ఉద్యమాలను  పాలకులు అణగతొక్కవచ్చు.
ప్రజాస్వామ్య దేశాల్లో ఇలాంటివి కూడా జరుగుతుంటాయి. అన్ని ఉద్యమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వకపోవడానికి ఇది కూడా ఒక కారణమే. పైకి చూసినప్పుడు ప్రభుత్వ కఠిన వైఖరి వల్లనే ప్రజోద్యమాలు అణచివేయబడుతున్నాయని అనిపించవచ్చు, కానీ అసలు విషయం ఏమిటంటే, సమస్య మూలాలు తెలుసుకోకుండా  కేవలం భావోద్వేగాలను రెచ్చగొట్టడం వల్లనే అనర్ధాలు జరుగుతున్నాయన్నదే  సామాజికవేత్తలు జరిపిన సర్వేలో తేలిన నిజం.
అవినీతిపై ఉద్యమిస్తున్నవారు మరో భ్రమలో కూడా ఉంటున్నారు. అవినీతిపై పోరు అంటే, అధికారులమీద, మంత్రులు, ప్రధానమంత్రి, లేదా పార్లమెంట్ సభ్యులమీదనే అని అనుకుంటున్నారు. అందుకే హజారే వంటి వారు జన్ లోక్ పాల్ బిల్లుతో ప్రధానమంత్రి, చివరకు న్యాయమూర్తుల అవినీతిపై కూడా కొరడా ఝుళిపించాలని ప్రతిపాదిస్తున్నారు. అయితే, అసలు విషయం ఏమిటంటే, పవర్ సెంటర్స్ లో ఇదొకటి మాత్రమే. మిగతా పవర్ సెంటర్స్ కూడా ఉన్నాయి.
ప్రైవేట్ పారిశ్రామిక సంస్థలు, జాతీయ, బహుళజాతీయ సంస్థలు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ట్రైడ్ యూనియన్లు చివరకు చారిటబుల్ ట్రస్ట్ లు కూడా పవర్ సెంటర్స్ గా మారిపోయాయి. వీటన్నింటితోపాటుగా, కుల, మత సంస్థలు కూడా ఈ ప్రభుత్వాలను ఓ ఆట ఆడిస్తున్నాయి. ఇన్ని పవర్ సెంటర్స్ ఉండటమే అసలు సమస్య. వీటన్నింటిలోని అవినీతికి కూడా జన్ లోక్ పాల్ బిల్లు సమాధానం చెప్పగలదా అన్నది ఆలోచించాల్సిందే.



అవినీతికి కాపలా శక్తులు

అవినీతి అనే రక్కసిని అనేక శక్తులు కాపలా కాస్తున్నాయి. కేవలం ఒకే ఒక్క బిల్లు రామబాణంలా పనిచేస్తుందని అనుకోగలమా…? లోక్ పాల్ బిల్లుకు చట్టబద్దత వస్తే, అది చాపకిందనీరులా పాకిపోతున్న అవినీతిని పూర్తిగా తొలిగించగలదా… అసలు అవినీతిని అంతమొందించడానికి ఒక వ్యవస్థ ఉండగా, మరో వ్యవస్థ అవసరం ఉన్నదా…?
అవినీతిని ఎదుర్కోవడానికి ఒక వ్యవస్థ నడుస్తుండగా, మరొకటి అవసరం ఉన్నదా అని కూడా ఆలోచించాలి.
దేశంలో అవినీతి ఒక మహా రోగంలా మారిపోయిందన్నది నిజమే. అయితే, ఈ రోగాన్ని కుదర్చడానికి ఒకేఒక మందు ఉన్నదని కొందరు భావిస్తూ,  లోక్ పాల్ బిల్లు తీసుకురావాల్సిందేనంటూ వాదిస్తున్నారు. అయితే, సర్వకాలసర్వావస్థల్లోనూ ఇదే ఏకైక మందు అని అనుకోవడం మాత్రం సమర్థనీయం కాదు.
దేశ ఆర్థిక వ్యవస్థను నడిపే కీలక వ్యక్తి తానే రైలు ఇంజన్ లాగానూ, తానే డ్రైవర్ లాగానూ వ్యవహరిస్తుండటంతో సమస్య అంత తేలిగ్గా తెగుతుందని అనుకోలేం. మాంత్రికుడి ప్రాణం సప్తసముద్రాల ఆవల ఒక గుహలోని చిలకలో ఉన్నట్టుగా అవినీతి ప్రాణం దాగున్నది. దీనికి  రక్షణగా అనేక ఆర్థిక, రాజకీయ, సామాజిక శక్తులు కాపలా కాస్తున్నాయి. ప్రపంచీకరణ కారణంగా ఈ కాపలా మరింతగా పెరిగిపోయింది. అలాంటప్పుడు కేవలం  ఒక బిల్లు వీటన్నింటినీ ఛేదించుకుని నేరుగా లక్ష్యాన్ని చేధిస్తుందనీ, ఒక్క రోజులో దేశంలో అవినీతి మటుమాయం అవుతుందని అనుకోవడం కలలోని దృశ్యంగానే మిగిలిపోవచ్చు. అవినీతి నిరోధక వ్యవస్థ ప్రభుత్వం గుప్పెట్లో ఉండటం వల్ల మొత్తంగా దేశంలోనే అవినీతి తొలిగిపోయిందని ఎలా అనుకోగలం…?
రాష్ట్ర ప్రభుత్వాలకున్న అధికారం కేంద్రానికి కొన్ని విషయాల్లో ఉండదు. ఒక చట్టం తీసుకురావాలన్నా, ఒక కీలక నిర్ణయం తీసుకోవాలన్నా, కేంద్ర ప్రభుత్వం ఒంటరిగా ఏదీ చేయలేదు. పార్లమెంట్ లో ప్రతిపక్షాల సమక్షంలో బిల్లు ఆమోదం పొందితేనేగానీ దానికి చట్టబద్ధత రాదు. అలాంటప్పుడు ప్రతిదానికీ కేంద్ర ప్రభుత్వానిదే జవాబుదారీతనం ఆపాదించకూడదు.
అవినీతి, లంచగొండితనం సంఘటనలు చాలా సందర్భాల్లో వెలుగులోకి రావడంలేదు. ఎందుకంటే, ఎలా చేస్తే అది అవినీతి నిఘా కళ్లనుంచి తప్పించుకుంటుందో అవినీతికి పాల్పడే వ్యక్తికి తెలయడం వల్ల గుట్టుచప్పుడు కాకుండానే అనేక అవినీతి సంఘటనలు జరిగిపోతుంటాయి. పైగా, అవసరం తీరిందన్న సంతృప్తి ఇచ్చేవానికీ,  డబ్బు తీసుకున్నా పనిచేసిపెట్టాను కదా, అన్న సర్దుబాటు ధోరణి సమాజంలో పెరిగిపోవడంతో అవినీతి నిఘానేత్రాలను ఇట్టే తప్పించుకోగలుగుతోంది.

- తుర్లపాటి నాగభూషణ రావు
9885292208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!