జగన్ ఏం చేయబోతున్నారు?

భవిష్యత్ కార్యాచరణపై చర్చలకు రమ్మంటూ జగన్ తన సన్నిహితులు, హితులకు ఇప్పటికే కబురు పంపారు. వైఎస్సార్ వర్ధంతి తరువాత ఏ క్షణంలోనైనా ఈడీ కేసు కింద జగన్ అరెస్ట్ అవడం ఖాయమన్న వాదనలు వినబడుతున్న తరుణంలో జగన్ తన వాళ్లను దగ్గరకు తీసుకోవడంలోని ఆంతర్యం బయటపడుతూనే ఉన్నదని ఓ సీనియర్ కాంగ్రెస్ నాయకుడు అన్నారు. జగన్ పైకి బింకంగానే ఉన్నప్పటికీ, లోపల జంకు మొదలైందనీ, ఇందుకు సంకేతంగానే సన్నిహితులతో సమావేశాన్ని ఏర్పాటు చేయడమని ఆ నాయకుడు చెప్పారు. ఇప్పటికే జగన్ అనేక మంది స్వయంగా ఫోన్లు చేసి హైదరాబాద్ లో పెట్టే సమావేశానికి రావాలంటూ కోరారు. ప్రభుత్వాన్ని కూల్చాలన్న ఆలోచన కంటే, ఒక వేళ తాను అరెస్టయితే, పార్టీని రక్షించుకోవడం, పార్టీని బలపరచేందుకు ఎవరిని నియమించాలన్నది ఖరారు చేయడం సమావేశం ముఖ్యోద్దేశం కావచ్చని కూడా అనుకుంటున్నారు.
అయితే, జగన్ కు ఇప్పటికీ ఛాన్స్ మిగిలే ఉన్నదనీ, ఆయన కాంగ్రెస్ అధిష్ఠానం వద్ద లొంగిపోతే సమస్య వీగిపోతుందని కూడా అనుకుంటున్నారు. కానీ, జగన్ మనస్తత్వం ఇందుకు వ్యతిరేకం. మడమతిప్పని నేతగా ప్రజాబలం సంపాదించుకున్న జగన్ ఇప్పుడు సడన్ గా ప్లేట్ తిప్పేయడనీ, అవసరమైతే ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కుంటారని ఆయన వర్గం వారు చెబుతున్నారు.
మొత్తం మీద జగన్ పరిస్థితి ఇరకాటంలో పడిందన్న సంకేతాలే ఎక్కువగా అందుతున్నాయన్నది జగమెరిగిన సత్యం.
– ఎన్నార్టీ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి