ప్రభుత్వాలు పడగొట్టే బిల్లు ! (పార్ట్ 1)


ఢిల్లీ పాలకులు పార్లమెంట్ లో ఎన్నో బిల్లులు ప్రవేశపెట్టి ఉండవచ్చు. బిల్లు ప్రయోజనాల గురించి గంటలకొద్దీ చట్టసభల్లో మాట్లాడుతుండవచ్చు. కానీ ఒక బిల్లు పేరు చెబితే మాత్రం భయపడిపోతున్నారు. ఆ బిల్లు పేరెత్తగానే ముచ్చెమటలు పోస్తున్నాయి. ఇంతకీ ఆ బిల్లు మరేదోకాదు, దేశ ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న లోక్ పాల్ బిల్లు. ఏ బిల్లు పేరుచెబితే అవినీతిపరులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయో, ఆ బిల్లే చాలా చిత్రంగా పాలకుల్ని సైతం భయపెడుతోంది. కాకతాళీయమో, లేక అతీతమైన కారణాలేమైనా ఉన్నాయో తెలియదుకానీ, లోక్ పాల్ బిల్లు పార్లమెంట్ గడపతొక్కినప్పుడల్లా రాజకీయ సంక్షోభం ఎదురవుతూనే ఉంది. చాలా సందర్భాల్లో బిల్లు ఇలా చర్చకు రాగానే, అలా ప్రభుత్వాలు పడిపోయాయి.
అన్నా హజారే దీక్షలతోనో, లేదంటే, ప్రస్తుతం ఊపెక్కిన అవినీతి వ్యతిరేక ఉద్యమాలతోనో లోక్ పాల్ బిల్లు ఉన్నట్టుండి తెరమీదకు రాలేదు. ఈ బిల్లుకు 40ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. ఇప్పటి వరకు 9సార్లు బిల్లు పార్లమెంట్ గడపతొక్కింది. అయితే అలా జరిగిన ప్రతిసారీ కేంద్రంలో ఏదోరూపంలో రాజకీయ సంక్షోభం తలెత్తుతూనేఉంది.

బిల్లు ప్రవేశపెడితే
ప్రభుత్వం కూలిపోతుందా?


అవినీతిని అంతమొందించే ఏకైక అస్త్రం జన్ లోక్ పాల్ బిల్లేనంటూ దేశమంతటా ప్రచారం జరుగుతోంది. సంఘ సంస్కర్త అన్నా హజారే  వరుస దీక్షలతో జన్ లోక్ పాల్ బిల్లునే పార్లమెంట్ గడపతొక్కించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతానికి స్థాయీసంఘం పరిశీలనలో ఉన్న జన్ లోక్ పాల్ బిల్లుకు పదునెక్కువ. అందుకే దేశంలో అవినీతి పరుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అయితే లోక్ పాల్ బిల్లు కేవలం అవినీతి పరులనేకాదు, యుపీఏ సర్కార్ ను నడుపుతున్న నేతలకు కూడా చెమటలు పట్టిస్తోంది. ఈ భయం అవినీతి పరులవడటం వల్ల వచ్చిందికాదు. బిల్లు ప్రవేశపెడితే, ప్రభుత్వం పడిపోతుందన్న భయం.  బిల్లు ప్రవేశపెడితే
ప్రభుత్వం కూలిపోతుందా?  అసలు ఇలాంటి భయం రావడానికి సహేతుక కారణాలున్నాయా?  వాస్తవాలు తెలియాలంటే లోక్ పాల్ బిల్లు చరిత్ర తిరగేయాల్సిందే.
లోక్ పాల్ బిల్లును ఇంతకు ముందు ఒకసారికాదు, రెండుసార్లు కాదు,  ఏకంగా 9సార్లు ప్రవేశపెట్టారు. యాదృశ్చికమో, లేక కాకతాళీయమోగానీ  ఈ కీలక బిల్లును ప్రవేశపెట్టిన ప్రతిసారీ పాలకపక్షానికి గడ్డురోజులే. ఈ బిల్లు ముట్టుకుంటే సర్కార్ మటాషే అన్నట్టు తయారైంది వ్యవహారం. జరిగిన సంఘటనలకీ, బిల్లుకీ ప్రత్యేక్షంగా ఎలాంటి ప్రమేయం లేకపోయినా, లోక్ పాల్ బిల్లు అనగానే చరిత్ర కళ్లముందు కనబడటం ఖాయం. పాలకులకు కళ్లు తిరగడం ఖాయం.
అది 1968. అంటే 43ఏళ్ల కిందటి ముచ్చట. ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న రోజులవి. నాటి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న శాంతిభూషణ్ అప్పట్లో లోక్ పాల్ బిల్లు ముసాయిదాను లోక్ సభకు సమర్పించారు. అక్కడ బిల్లు ఆమోదం పొందింది. అయితే, బిల్లు రాజ్యసభ   పరిశీలనలో ఉండగానే దిగువ సభ రద్దయింది. దీంతో బిల్లు అటకెక్కింది. అంతేకాదు, కాంగ్రెస్ పార్టీలో  ముసలం పుట్టింది. ఫలితంగా పార్టీ చీలిపోయింది. ఇందిరా కాంగ్రెస్ ఏర్పడింది.
అది 1971.  కేంద్రంలో ఇందిర సర్కారే నడుస్తున్న రోజులు. మరోసారి లోక్ పాల్ బిల్లును  మరోసారి పార్లమెంట్ లో ప్రవేశపెట్టారు. బిల్లుపై చర్చలు జరుగుతుండగానే, యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. బంగ్లాదేశ్ విముక్తి కోసం పాకిస్తాన్ తో యుద్ధం అనివార్యమైంది. దీంతో కీలకమైన  ఈ బిల్లు మరోసారి మూలనపడింది.


(మరిన్ని వివరాలు 2వ భాగంలో…)

- తుర్లపాటి నాగభూషణ రావు
98852 92208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!