బొత్సకి చెక్ పెట్టనున్న సిఎం


ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి, పిసిసి అద్యక్షుడు బొత్స సత్యనారాయణకు మధ్య నెలకొన్న విబేధాలు కొత్తకోణంలోకి వెళుతున్నాయి. ఆకస్మికంగా మద్యం సిండికేట్లపై అవినీతి నిరోధక శాఖ చేసిన దాడులు ముఖ్యమంత్రి కిరణ్ కు అనుకోని వరంగా కలిసి వచ్చినట్లు చెబుతున్నారు. బొత్స సత్యనారాయణ కుటుంబానికి కోస్తాలోని వివిధ జిల్లాలలో మద్యం వ్యాపారం ఉండడం, మద్యం సిండికేట్లతో సంబంధాలు ఉన్నాయన్న కధనాలు రావడం, ఎసిబి దాడులకు సంబంధించి పలు విశేషాలు ముఖ్యమంత్రి దగ్గరకు వెళ్లడంతో ఆయన వెంటనే ఈ సమాచారాన్ని అధిష్టానం పెద్దలకు తీసుకువెళ్లారని అంటున్నారు. ఎసిబి నివేదికలో మద్యం వ్యాపారంలో బొత్స పాత్రకు సంబంధించి ఉన్న భాగాన్ని కిరణ్ తెలివిగా వాడుకుని అధిష్టానం పెద్దలకు ఆ విషయాలతో రహస్య నివేదిక ఇప్పటికే పంపించారన్న ప్రచారం కాంగ్రెస్ వర్గాలలో గుప్పుమంది.ప్రధానంగా బొత్స సత్యనారాయణ తరచూ ఢిల్లీ వెళ్లి ముఖ్యమంత్రి కిరణ్ పనితీరుపై ఫిర్యాదులు చేస్తున్నారని , దానిని కట్టడి చేయడానికి ఎసిబి నివేదిక ఉపయోగపడుతుందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ప్రధానంగా బొత్సను పిసిసికి మాత్రమే పరిమితం చేయాలని కిరణ్ కోరుకుంటున్నారని, రాష్ట్ర మంత్రివర్గం నుంచి తప్పించాలని గట్టిగా యత్నిస్తున్నారని, దానికి ఈ నివేదిక ఉపయోగపడుతుందని కాంగ్రెస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సచివాలయంలో కూడా బొత్స వ్యూహాత్మకంగా పిసిసి అద్యక్షుడి హోదాను ఉపయోగించుకోవడం కిరణ్ సన్నిహితులకు
అంతగా నచ్చడం లేదు. ఈ నేపధ్యంలో మద్యం సిండికేట్లపై ఎసిబి ఇచ్చిన నివేదిక ద్వారా బొత్సను దెబ్బగొట్టడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారని కాంగ్రెస్ ప్రముఖుడు ఒకరు పేర్కొన్నారు. దీంతో బొత్స, కిరణ్ ల మధ్య ప్రచ్చన్న యుద్దం ప్రత్యక్ష యుద్దంగా మారుతుందా అన్న చర్చ ఇప్పుడు కాంగ్రెస్ లో జరుగుతోంది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!