ప్రభుత్వాలు పడగొట్టే బిల్లు ! (పార్ట్ 4)


లోక్ పాల్ బిల్లును అవినీతిని అంతమొం దించే ఏకైక అస్త్రంగా ఎన్డీఏ ప్రభుత్వం కూడా అప్పట్లో అనుకుంది. బిల్లు చకచకా పార్లమెంట్ గడపతొక్కింది. కానీ మళ్లీ అంతలో రాజకీయసంక్షోభం. అంతే, బిల్లు మరోసారి అటకెక్కేసింది. యూపీఏ పాలనలో కూడా బిల్లు ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏదో కలత….మరేదో అలజడి… పాలకులకు నిద్రపట్టడంలేదు.
సంకీర్ణ ప్రభుత్వాలు  నడుస్తున్న రోజులవి. 1998లో బీజేపీ నేతృత్వంలోని  సంకీర్ణ కూటమి – NDA గద్దెనెక్కింది. గతంలో జనాతాపార్టీ అవినీతిపై నడిపిన మహోద్యమంలో భాగస్వాములైన రాజకీయ పక్షాలే ఎన్డీయేలో కూడా ఉండటంతో ఈ కూటమి అధికారంలోకి రాగానే మరోసారి లోక్ పాల్ బిల్లు ప్రస్తావన వచ్చింది. దీంతో బిల్లు నేరుగా  మరోసారి పార్లమెంట్ గడపతొక్కింది. ఇక బిల్లుకు చట్టబద్ధత రావడమే తర్వాయి అనుకుంటున్నవేళలో అన్నాడీఎంకె అధినేత్రి జయలలిత, వాజ్ పేయ్ ప్రభుత్వం నుంచి మద్దతు ఉపసంహరించుకోవడంతో కథ మళ్ళీ మొదటికివచ్చింది.
ఎన్డీయే 2001లో మరోసారి ఎన్డీయే అధికారం చేపట్టినప్పుడు కూడా పట్టువదలని విక్రమార్కునిలా బిల్లును కిందకు దించింది. అయితే ఈసారి తొందరపడకుండా నిదానంగా , వ్యూహాత్మకంగా అడుగులు వేసింది. దీంతో ఆరేళ్లయినా బిల్లుకు మోక్షం రాలేదు. ఈలోగా ఎన్డీయే  అధికారం కోల్పోయింది.
దాదాపు 8ఏళ్ల నిరీక్షణ ఫలించింది. 2004లో  కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని  యూపీఏ కేంద్రంలో అధికార పగ్గాలు అందుకుంది. యూపీఏ కూటమి బలోపేతంగా ఉన్నప్పటికీ, మరో ఏడాదిలో ఫస్ట్ టర్మ్ ముగుస్తుందనగానే ఈ బిల్లును అటకమీదనుంచి దించారు. అయితే అదే సమయంలో భారత్ – అమెరికా అణు ఇంధన ఒప్పందం విషయంలో వామపక్షాలు తిరుగుబాటుబావుటా ఎగురవేశాయి. విశ్వాస పరీక్ష నెగ్గేసరికి యూపీఏ సర్కార్ కు తాతలు దిగొచ్చినంత పనైంది. దీంతో కీలకమైన  ఈ బిల్లు గురించి ఆలోచించే తీరక లేకుండా పోయింది.
తాజా పరిస్థితుల్లో యూపీఏ ప్రభుత్వం మరోసారి లోక్ పాల్ బిల్లు గురించి ఆలోచించక తప్పలేదు. జన్ లోక్ పాల్ బిల్లు కోసం  అన్నా హాజారే మహోద్యమం సాగిస్తుండటంతో చివరకు యూపీఏ సర్కార్ దిగిరాక తప్పలేదు. ఈ బిల్లుపై దేశమంతటా చర్చ జరుగుతుండటంతో చేసేదిలేక యూపీఏ ప్రభుత్వం అన్నా హజారే షరతులను అంగీకరిస్తూ జన్ లోక్ పాల్  బిల్లును పరిశీలన నిమిత్తం స్థాయీసంఘానికి పంపిచాల్సి వచ్చింది.
అవినీతి సర్పం యూపీఏనే కబళించే పరిస్థితి ఏర్పడింది. దీంతో ముందుచూస్తే నొయ్యి, వెనక చూస్తే గొయ్యి అన్నట్టుగా మారింది యూపీఏ మనుగడ. తన ప్రభుత్వం తీగమీద నడకలా సాగుతోందని ప్రధాని మన్మోహన్ సింగ్ స్వయంగా అంగీకరించారు. కాగ్ తవ్వుతున్న కొద్దీ అవినీతి బయటపడుతూనే ఉంది.  లోక్ పాల్ బిల్లును అటకదించినప్పటి నుంచీ మన్మోహన్ ప్రభుత్వం కల్లోల కడలిలోనే పయనిస్తోంది.
అవినీతిని అంతమొందించాలని ప్రజలు కోరుతున్నారు. అలా చేయాలనే పాలకులూ అడపాదడపా కృతనిశ్చయంతోనే ఉన్నారు. అయినప్పటికీ ఏవో అనుకోని ఆటంకాలు. ప్రభుత్వాలు కూలిపోయే స్థాయిలో రాజకీయ సంక్షోభాలు. ఒక మంచి లక్ష్యంతో లోక్ పాల్ బిల్లుకు చట్టబద్ధత తీసుకొద్దామని అనుకుంటున్నా చూస్తుండగానే నాలుగు దశాబ్దాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మరి ఈసారి ఏమమవుతందో చూడాలి.
(సమాప్తం)

- తుర్లపాటి నాగభూషణ రావు
98852 92208

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!