రూపాయి క్షీణిస్తే..!


రూపాయి మారకవిలువ పడిపోతుండటంతో భారత్ ఆర్థిక సంక్షోభం అంచున నిలబడినట్టయింది. రూపాయి విలువను కట్టడిచేయకపోతే దేశంలో ఆర్థిక సంక్షోభం తలెత్తే అవకాశాలున్నాయి. కన్నీరు కారుస్తున్న రూపాయి విలువ‌ని పెంచ‌డానికి కృషిచేయాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది..
రూపాయి విలువ దారణంగా పడిపోవడంతో ఆర్థిక వ్యవస్థ మరింత క్రుంగిపోయే పరిస్థితి తలెత్తింది. యూరోజోన్ రుణ సంక్షోభం తారాస్థాయికి చేరడం, స్టాక్ మార్కెట్లు మరింత బలహీనం కావడంతో డాలర్లకు అంతులేని డిమాండ్ వచ్చేసింది. రూపాయి పతనాన్ని అరికట్టే మంత్రదండం తమవద్దేమీలేదంటూ రిజర్వ్ బ్యాంక్ చేతులెత్తేయడంతో పరిస్థితి ఎంత తీవ్రస్థాయికి చేరుకుందో అర్థమవుతోంది.
రూపాయి విలువ మనదేశ దిగుమతులపైన తీవ్ర ప్రభావమే చూపుతోంది. రూపాయి కొనుగోలు శక్తి తగ్గిపోతే విదేశీ మారక నిల్వలు పెంచుకోవాల్సిఉంటుంది. దిగుమతుల్లో మనదేశం అగ్రగామిగానే ఉండటంతో ఇది అనివార్యమే. 1991-92లో విదేశీ మారక నిల్వలు తగ్గిపోతే, అంతర్జాతీయ ద్రవ్య నిధి సంస్థ వద్ద 200 టన్నుల బంగారాన్ని తాకట్టుపెట్టాల్సిన పరిస్థితి ఎదురైంది. ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి మెరుగుకావడడంతో తాకట్టును విడిపించుకోగలిగాం.
రూపాయి పతనమవుతున్నా, మరో పక్క బంగారం విలువ పెరుగుతుండటం కొంత ఊరట కలుగుతుంది. ఈ కారణంగా తక్కువ బంగారం తాకట్టుపెట్టి విదేశీ మారక నిల్వలను పెంచుకునే అవకాశం ఉంది.
రూపాయి పతనం కొంతమందికి మేలు చేస్తుంటే, మరికొంతమందికి కన్నీటిపర్యంతమే అవుతోంది. రూపాయిల విలువ మరింత పతనమైతే జింబాబ్వే తరహా ఆర్థికసంక్షోభం తలెత్తుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. జింబాబ్వేలో ద్రవ్యోల్బణంస్థాయి పెరిగిపెరిగి చివరకు హైపర్ ద్రవ్యోల్బణానికి చేరుకుంది. దీంతో అక్కడ నోట్ల కట్టలు కుమ్మరిస్తేనేకానీ, ఓ చిన్న బ్రెడ్ ముక్క దొరకని పరిస్థితి ఏర్పడింది. ఆర్థిక సుస్థిరత దెబ్బతింటే, పరిస్థితులు ఎంతటి భయంకరంగా ఉంటాయో చెప్పడానికి జింబాబ్వేనే నిలువెత్తు నిదర్శనం. గ్రీస్ వంటి ఐరోపా దేశాలు ఇప్పటికే పీకలలోతున ఆర్థిక సంక్షోభంలో కూరుకు పోయాయి. కరెన్సీ విలువ పడిపోతే వచ్చే కష్టాలేమిటో ఆయా దేశాలకు బాగా తెలుసు.
ఇప్పటివరకు ఆర్థికంగా పటిష్ఠంగా ఉన్న భారత్ లో సంక్షోబం తలెత్తకుండా ఉండేందుకు ప్రయత్నాలు చురుగ్గా సాగుతున్నా, మరో పక్క రూపాయికి విదేశీమారక విలువ రోజురోజుకీ తగ్గిపోతుండటం ఆందోళన కలిగిస్తోంది. అయితే, రూపాయి విలువ పడిపోతుండటంతో విదేశీ చదువులపై విద్యార్థులు పెట్టే డబ్బు తడిసిమోపెడవడం ఖాయం.
విదేశీ బ్రాండ్ వస్తువులైన రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషెన్లు, మైక్రోఓవెన్లు, ఫోన్లు, లాప్ టాప్ లు వంటివి ఇండియన్ మార్కెట్ లోకి వెళ్లి విదేశీ బ్రాండెడ్ వస్తువులు కొనుక్కోవాలంటే ఇకపై ఎక్కువ డబ్బు చెల్లించాల్సిందే. లాప్ టాప్ లమీద సుమారు 3.5 శాతం ధరలు పెరగొచ్చు.
రూపాయి విలువ పడిపోయిన ప్రతిసారీ ముడిచమురు బిల్లు పెరిగిపోతూనేఉంది. దీని విలువ దాదాపుగా 8000కోట్లకు పైమాటే.  ఈ నష్టం కేంద్రప్రభుత్వ విధాననిర్ణయాలపై పడుతుంటుంది. దీంతో ద్రవ్యోల్బణం విపరీతంగా పెరగొచ్చు. అదే జరిగితే జింబాబ్వే కథ ఇండియాలో రిపీట్ కావచ్చు. అందుకే రూపాయి విలువ తగ్గడం ఏరకంగా చూసినా ఆందోళనకరమే.
-ఎన్నార్టీ

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!