రివ్యూ : ఆక‌ట్టుకునే రాజ‌న్న


రేటింగ్ : 3.25/5
బ్యాన‌ర్‌: అన్నపూర్ణ స్డూడియోస్‌
సంగీతం: ఎమ్‌.ఎమ్‌.కీరవాణి
యాక్షన్ డైరక్టర్ : ఎస్.ఎస్.రాజమౌళి
ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు
ఛాయాగ్రహణం: శ్యామ్ కే నాయుడు, అనీల్ బండారి మరియు పూర్ణ
నిర్మాత: అక్కినేని నాగార్జున
దర్శకత్వం: విజయేంద్రప్రసాద్‌

నటీనటులు: నాగార్జున, స్నేహ, బేబీ అని, శ్వేతామీనన్‌, నాజర్‌, అజయ్‌, సుప్రీత్‌, ప్రదీప్‌రావత్‌, ముఖేష్‌రుషి, రవి కాలే, హేమ, శకుంతల తదితరులు.
అక్కినేని నాగార్జున న‌టించి, నిర్మించిన చిత్రం రాజ‌న్న. చారిత్రక నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ చిత్రంపై ఎన్నో అంచ‌నాలు మొద‌ల‌య్యాయి. అక్కినేని నాగార్జున రాజ‌న్నగా తెలంగాణ పోరాట వీరుడిగా క‌నిపించ‌డం, విజ‌యేంద్రప్రసాద్ ద‌ర్శక‌త్వం, ఎస్ ఎస్ రాజ‌మౌళి యాక్షన్ ఎపిసోడ్స్‌, కీర‌వాణి సంగీతం వెర‌సి ఈ చిత్రంపై అంచ‌నాల‌ని అమాంతం పెంచేసాయి. మ‌రి ఆ స్థాయికి ఈ చిత్రం చేరుకుందా..?  చూద్దాం..
క‌థ విష‌యానికి వ‌స్తే… ఈ చిత్రం 1948వ‌ కాలం లో ఆదిలాబాద్ జిల్లా నేలకొండపల్లి అనే గ్రామం లో జరిగిన కథ. అప్పటి నైజాం పాల‌న‌లో స్వాతంత్ర్యం వ‌చ్చినా కూడా దొర‌ల దౌర్జన్యాలు కొన‌సాగే రోజులు. ఆ గ్రామంలో మ‌ల్లమ్మ (బేబీ అనీ) అనే అనాధ పాప‌ని ఓ ముస‌లాయ‌ని చేర‌దీసి పెంచుతూంటాడు. స్వత‌హాగా మంచి గొంతుతో పాటు అందంగా పాట‌లు పాడ‌టం మ‌ల్లమ్మకి పుట్టుక‌తోనే వ‌స్తాయి. త‌న పాట‌ల‌తో ఆ ఊరి వారిని ఉత్తేజ ప‌రుస్తూంటూంది. అయితే ఆ పాట‌లంటే ఆ ఊరి దొర‌సాని (శ్వేతా మీన‌న్‌)కి అస్సలు గిట్టదు.. దాంతో మ‌ల్లమ్మ పాట‌లు పాడ‌కుండా హుకుం జారీచేస్తుంది. అయితే తాను అనాధ కాద‌ని త‌న తండ్రి రాజ‌న్న (నాగార్జున‌) కూడా పోర‌ట‌వీరుడ‌ని, త‌న పాట‌ల‌తో ఉద్యమాలు చేసాడ‌ని త‌న సంగీత గురువు (నాజ‌ర్‌) ద్వారా తెలుసుకుంటుంది. త‌న ఊరి స‌మ‌స్యల‌ని జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూకి తెల‌పాల‌ని ఢిల్లీకి బ‌య‌లు దేరుతుంది.. మ‌రి ఆమె నెహ్రూని క‌లిసిందా..?  లేదా..? అన్నది మిగ‌తా క‌థ‌.
విశ్లేష‌ణ : ఈ చిత్రానికి ప్రధాన బ‌లం మ‌ల్లమ్మ క్యారెక్టర్‌. చిత్రం మొత్తం ఆ అమ్మాయి చుట్టూరానే తిరుగుతండ‌టంతో ఆ పాత్రకి అంత ప్రత్యేక స్థానం ల‌భిస్తుంది. అయితే మ‌ల్లమ్మ క్యారెక్టర్‌లో న‌టించిన బేబీ అనీ త‌న అద్భుత‌మైన న‌ట‌న‌తో ఆ పాత్రకి వ‌న్నె చేకూర్చింది. ఎమోష‌న్స్‌కి త‌గ్గట్టుగా ఎక్స్‌ప్రెష‌న్స్ ప‌లికిస్తూ.. ఆమెలో ప్రేక్షకుడు మ‌ల్లమ్మని చూసుకునేలా న‌టించింది. ఖ‌చ్చితంగా ఆమె న‌ట‌న‌కి నంది అవార్డు వ‌స్తుంద‌ని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక ఈ చిత్రాన్ని ద‌ర్శకుడు విజ‌యేంద్రప్రసాద్ తెర‌కెక్కించిన విధానం బావుంది.. అయితే తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో వ‌చ్చిన ఈ చిత్రంలో నాగార్జున చెప్పే డైలాగ్స్ కూడా తెలంగాణ యాస‌కి ద‌గ్గర‌గా ఉండేలా జాగ్రత్తప‌డితే మ‌రింత స‌హ‌జ‌త్వం పండేది ఆ పాత్రలో.. చారిత్రక నేప‌థ్యం క‌లిగిన చిత్రం కాబ‌ట్టి అప్పటి కాల‌మాన ప‌రిస్థితులు తెర‌పై క‌నిపించే విధంగా మ‌రికొంత జాగ్రత్తలు తీసుకుంటే మంచిద‌ని కొన్ని సీన్లు చూస్తే అనిపిస్తుంది.. అంతే త‌ప్ప క‌థ‌, క‌థ‌నాల‌ని న‌డిపించ‌డంలో ద‌ర్శకుడు స‌క్సెస్ సాధించారు.

న‌టీన‌టులు : రాజ‌న్నగా నాగార్జున పాత్ర థియేట‌ర్లో చ‌ప్పట్లు మ్రోగిస్తుంది.. పాత్రకి త‌గ్గట్టుగా నాగార్జున త‌న బాడీలాంగ్వేజ్‌ని మార్చుకుని మంచి న‌ట‌న‌ని అందించాడు. అత‌ని న‌ట‌న ఈ చిత్రానికి హైలెట్ కాగా, బేబీ అని న‌ట‌న ఈ చిత్రానికి ప్రాణం.. ఆమె న‌ట‌న అంద‌రినీ ఆక‌ట్టుకుంటుంది. ఇక దొర‌సానిగా శ్వేతామీన‌న్‌, సంగీత గురువుగా నాజ‌ర్‌, రాజ‌న్న స్నేహితులుగా అజ‌య్‌, సుప్రీత్‌, శ్రావ‌ణ్‌, ప్రదీప్ రావ‌త్‌లు రాజ‌న్న స్నేహితులుగా బాగా న‌టించారు. ఇక ముఖేష్‌రుషి, తెలంగాణ శ‌కుంత‌ల‌, హేమ మొద‌ల‌యిన న‌టులు త‌మ పాత్రల మేర‌కు బాగానే న‌టించారు.
సాంకేతిక వ‌ర్గం : ఈ చిత్రానికి మ‌రొక ప్లస్ పాయింట్ కీర‌వ‌ణి సంగీతం, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమా ఫీల్‌ని చెడ‌గొట్టకుండా ప్రేక్షకుడు క‌థ‌లో లీన‌మ‌య్యే విధంగా చాలా బాగా చేసాడు. కీర‌వాణి అందించిన సాంగ్స్ అన్నీ బావున్నాయి. ముఖ్యంగా అమ్మ, అవ‌నీ సాంగ్ హృద‌యానికి హ‌త్తుకుంటుంది.. కెమెరా, గ్రాఫిక్స్ వ‌ర్క్స్ కూడా చాలా చ‌క్కగా కుదిరాయి. ఇక రాజ‌మౌళి ద‌గ్గరుండి చేయించిన యాక్షన్ సీక్వెన్స్ రాజ‌మౌళి స్టాండ‌ర్డ్ కి త‌గ్గట్టుగానే ఉండి ఆక‌ట్టుకుంటాయి. ఎడిటింగ్ కూడా చ‌క్కగా కుదిరింది..
ద‌ర్శకుడు విజ‌యేంద్ర ప్రసాద్ ఈ క‌థ‌ని ఎంతో ఇష్టప‌డి తానే ద‌ర్శక‌త్వం చేయాల‌ని సంక‌ల్పించి చేసిన చిత్రం కాబ‌ట్టి క‌థ‌, క‌థ‌నాల‌లో ఎలాంటి క‌న్‌ఫ్యూజ్‌న్ లేకుండా చ‌క్కగా మ‌లిచారు.
ఈ చిత్రాన్ని నాగార్జున‌, బేబీ అనిల న‌ట‌న‌, కీర‌వాణి సంగీతంలోని సాంగ్స్‌, చారిత్రక నేప‌థ్యం క‌లిగిన క‌థాంశాన్ని తెలుసుకోవ‌డానికి ఈ చిత్రాన్ని త‌ప్పకుండా చూడొచ్చు.


సిహెచ్‌. సంతోష్‌కృష్ణ
santoshkrishnach@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!