అన్నా కంట కన్నీరు



అవినీతి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాటానికి శంఖం పూరించిన సామాజిక కార్యకర్త అన్నా హజారే ఆశలను యూపీఏ సర్కార్ నీరుగార్చింది. పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే లోక్ పాల్ బిల్లుకీ అన్నా ఆశించిన జన్ లోక్ పాల్ బిల్లుకీ సహస్రం తేడా కనబడుతోంది. అయినా తానేదో గొప్ప పని చేస్తున్నట్టు ప్రధాని మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని కేంద్ర సర్కార్ చంకలుగుద్దుకుంటోంది. కోరలు పీకేసి ఇదిగో ఇదే అవినీతి అనకొండను చంపేసే చట్టమని చెప్పడం హాస్యాస్పదం. ప్రధానమంత్రిని కూడా లోక్ పాల్ పరిధిలోకి తీసుకువచ్చామంటూనే మరో పక్క షరతుల చట్రం బిగించారు. జాతీయ భద్రతా వ్యవహారాల అంశాల్లో ప్రధానమంత్రిని లోక్ పాల్  పరిధిలోకి తీసుకురాకుండా జాగ్రత్తపడ్డారు. అన్నా హజారే మొదటినుంచి ఎలాంటి షరతులు లేకుండా ప్రధానమంత్రిని లోక్ పాల్ పరిధిలోకి తీసుకురావాలని కాంక్షించారు. అలాగే, లోక్ పాల్ పై సీబీఐకి ఎలాంటి నియంత్రణలేకుండా చేశారు. దర్యాప్తు సంస్థలను కూడా లోక్ పాల్ పరిధిలోకి తీసుకురావాలని అన్నాబృందం పట్టుబట్టింది. మూడోతరగతి ఉద్యోగులను లోక్ పాల్ బిల్లులోకి తీసుకురావడానికి యూపీఏ సర్కార్ ఇష్టపడలేదు. అన్నా గతంలో నిరశన దీక్షచేపట్టినప్పుడు ప్రభుత్వం దిగివచ్చి ఏ షరతులకు అంగీకరించిందో వాటినన్నటినీ ఒక్కొటొక్కటిగా పాతరపెట్టేసింది.
అసలు యూపీఏ ప్రభుత్వం ఇప్పటికే అనేక గండాలు గట్టెక్కించుకుని కొసఊపిరితో ఉంది. లోక్ పాల్ బిల్లునే తీసుకుందాం. పార్లమెంట్ లో ఐదువందల నలభైఐదు మంది సభ్యులున్నారు. ప్రస్తుతానికి సంకీర్ణ ప్రభుత్వ నికర బలం రెండువందల ఆరు మాత్రమే.  చిత్రమైన విషయం ఏమిటంటే, అధికారకూటమిలోని మిత్రపక్షాల్లోనే చాలామటుకు అన్నాకు అండగా ఉండటం. రాజకీయకారణాలు ఏవైనప్పటికీ, వీరంతా అన్నా హజారే వెనకే నిలుస్తారన్నది ఖాయం. డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్ వారివారి రాజకీయ స్వార్థాల కోసం లోక్ పాల్ బిల్లు విషయంలో కాంగ్రెస్ కు ఎదురుతిరగవచ్చు. అన్నా హజారే ఆశయాలు నచ్చినా, నచ్చకపోయినా ప్రభుత్వం కూలదోయడంలో మాత్రం వీరు అన్నా అస్త్రాన్ని ఉపయోగించుకోవడం అంతకన్నా ఖాయం. ప్రతిపక్షాలు, అధికారకూటమిలోని వ్యతిరేక పార్టీల బలం మొత్తం కలిపితే 201దాకా ఉంటుంది. ఈలెక్కలన్నీ తెలిసినా కాంగ్రెస్ మాత్రం రాబోయే యూపీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తన సత్యశీలతను లోక్ పాల్ బిల్లుద్వారా చూపించాలని తెగతపనపడిపోతోంది. యూపీ బ్రాండ్ రాజకీయాలు నడుపుతున్నది యువ నేత రాహుల్ గాంధీనే. అన్నాహజారేకు గతంలో ఇచ్చిన మాటను మార్చేసి, తనకిష్టమొచ్చినట్టు బిల్లును తయారుచేయించి మరోసారి పార్లమెంట్ గడపతొక్కిస్తున్న రాహుల్ ఈ విషయంలో తన గడుసరితనం చూపిస్తున్నారనే చెప్పాలి.
కుళ్లు రాజకీయాల నేపథ్యం లేకుండా ఉంటే, కాంగ్రెస్ చేసిన, చేస్తున్న పనిని అంతా మెచ్చుకునేవారు. దేశం ఆర్థికంగా బలహీనంగా ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వాలు కూలడం, తద్వారా తరుముకొచ్చే ఎన్నికల ఖర్చును స్వాగతించడం హర్షనీయం కాదు. అయితే అదే సమయంలో అన్నా సంకల్పానికి విరుద్దంగా స్వార్థరాజకీయాలతో ముందుకు దూకితే గోతిలో పడటం ఖాయం. చివరిగా ఒక మాట. అన్నా హజారే ఆశయం దేశానికే స్ఫూర్తిదాయకం. అందుకే ఆయన మళ్ళీ ఉద్యమిస్తే ఈ కుళ్లురాజకీయాలు పాతాళంలోకి పడిపోక తప్పదు. అన్నా హజారే కంటనీరు ఒలికితే, అది దేశానికే అరిష్టం. తస్మాత్ జాగ్రత.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!