2011.. హిట్సూ.. ఫ్లాప్స్‌..


2012కి స్వాగ‌తం ప‌లుకుతూ 2011 సంవ‌త్సరం ముగియ‌ బోతోంది.. ఈ సంద‌ర్భంగా ఒక‌సారి  తెలుగు చిత్రాల జ‌యా ప‌జ‌యాల గురించి రివ్యూ చేస్తే… 2010 సంవ‌త్సరం క‌న్నా ఈ సంవ‌త్సరం తెలుగు చిత్రాల విజ‌యాలు కాస్త మెరుగ్గానే ఉన్నా తెలుగు చిత్రసీమ‌కి ఈ విజ‌యాలు స‌రిపోవు. సంవ‌త్సరం మొద‌ట్లో వ‌చ్చిన స్టార్ హీరోల చిత్రాలు ఘోర ప‌రాజ‌యాలు కావ‌డం అంద‌రినీ నిరాశ‌ప‌రిచిన‌ప్పటికీ సంవ‌త్సరం చివ‌ర్లో వ‌చ్చిన చిత్రాలు వ‌రుస‌గా వ‌సూళ్ళు సాధించ‌డంతో ఊపిరిపీల్చుకున్నారు. 2011లో మొత్త వ‌చ్చిన తెలుగు స్ట్రెయిట్ చిత్రాలు 114 కాగా త‌మిళం, క‌న్నడం, మ‌ళ‌యాలం, హిందీ భాష‌ల‌నుండి డ‌బ్బింగ్ అయిన చిత్రాల సంఖ్య 120 ఉండ‌టం విశేషం. అయితే డ‌బ్బింగ్ చిత్రాల సంఖ్య ఎక్కువ‌గానే ఉన్నప్పటికీ విజ‌యాల‌ని న‌మోదు చేసుకున్న చిత్రాలు మాత్రం నాలుగ‌యిదు కంటే ఎక్కువ‌గా లేవు. తెలుగు స్ట్రెయిట్ విష‌యాల‌కి వ‌స్తే… ‘పరమవీరచక్ర’, ‘మిరపకాయ్’, ‘గోల్కొండ హైస్కూల్’, ‘అనగనగా ఓ ధీరుడు’ చిత్రాలు వ‌రుస‌గా విడుద‌ల‌య్యాయి.. మరో బెబ్బులిపులి అంటూ విడుదలకు ముందు గాండ్రించిన పరమవీరచక్ర… పిల్లిలా కుదేలైపోయింది. దాసరి నారాయణరావు-బాలకృష్ణల కలయిక కాసుల వర్షం కురిపించలేదు సరికదా… థియేటర్‌లు ప్రేక్షకులు లేక వెలవెలబోయాయి. ‘మిరపకాయ్’లో రవితేజ ప్రయోగాల జోలికి పోకుండా తనకు అచ్చొచ్చిన మాస్ మసాలా కథే ఎంచుకున్నారు. దాంతో గట్టెక్కేశారు. గొప్ప కథ కాకపోయినా, సినిమాలో ఊహించని మలుపులూ లేకపోయినా ఈ సినిమా ఆడిందంటే కారణం. రవితేజ కామెడీ టైమింగే. దాంతోపాటు సంక్రాంతి బరిలో పోటీ ఇచ్చే మరో సినిమా లేకపోవడంతో వసూళ్లు బాగానే పిండుకొన్నారు. ‘గోల్కొండ హైస్కూల్’ క్లాస్ టచ్ ఎక్కువై ఆ వర్గానికే పరిమితమైంది. ఇక విజువల్ ఎఫెక్ట్స్‌తో బ్రహ్మాండం బద్దలుగొడతాం అని బయల్దేరిన ధీరుడు… ఏమాత్రం మెప్పించలేదు. సిద్ధార్థ్ కళ్లకు గంతలు కట్టడం నుంచి సినిమా డ్రాపవుట్ అయిపోయింది.
ఇక ఈ సంవ‌త్సరం ఎంతో ఘ‌నంగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్, గోపీచంద్, పవన్‌కల్యాణ్‌, అల్లు అర్జున్‌లకు ఈ ఏడాది ఒక్క హిట్టూ దక్కలేదు. ఎన్టీఆర్ నటించిన రెండు సినిమాలు ఈ ఏడాది విడుదలయ్యాయి. ‘శక్తి’, ‘ఊసరవెల్లి’ రెండూ భారీ అంచనాలతో వచ్చినవే. ఆ అంచనాలే ఈ సినిమాల కొంప ముంచా యి. ‘శక్తి’లో హంగూ ఆర్భాటం తప్ప విషయం లేకపోవడంతో తేలిపోయింది. ‘ఊసరవెల్లి’ తొలిరోజు వసూళ్లు అదరగొట్టినా… ఆ ఊపు కొనసాగించలేకపోయింది. ఎన్టీఆర్ పాత్ర చిత్రణలో లోపాలు ఈ సినిమాకి శాపంలా తోచింది. గోపీచంద్ ‘వాంటెడ్’, ‘మొగుడు’ సినిమాలతో జనం ముందుకొచ్చారు. దర్శకుడి వైఫల్యంతో ‘వాంటెడ్’ బోర్లా పడింది. కథలో కొత్తదనం లేకపోవడంతో ‘మొగుడు’ ఆకట్టుకోలేదు. ఇక పవన్‌కల్యాణ్ సినిమాలు ‘తీన్‌మార్’ ‘పంజా’ సినిమాలు ఫ్లాపుల లిస్టులో చేరిపోయాయి. నాగచైతన్యకు ‘100% లవ్’ ఒక్కటే ఊరట నిచ్చింది. మాస్ ఇమేజ్ కోసం చేసిన ప్రయత్నాలు ‘దడ’, ‘బెజవాడ’ రూపంలో బెడిసికొట్టాయి. ఇక ప‌క్కా మాస్ క్యారెక్టర్‌ల‌తో హీరోయిజాన్ని చూపించే ప్రభాస్ ఒక మంచి కుటుంబ క‌థని న‌మ్ముకుని చేసిన  ‘మిస్టర్ పర్‌ఫెక్ట్’తో ప్రభాస్ కుటుంబ ప్రేక్షకులకు బాగా నచ్చాడు. ఈ సినిమాపై తొలుత డివైడ్ టాక్ నడిచినా… వసూళ్లు క్రమంగా ఊపందుకొన్నాయి. కుటుంబ అనుబంధాలకు పెద్దపీట వేయడంతో ఈ చిత్రం విజయతీరాలకు చేరగలిగింది. తెలుగు చిత్రపరిశ్రమలో మినిమం గ్యారెంటీ ట్యాగు సంపాదించుకొన్న హీరోలు ఇద్దరున్నారు. ఒకరు రవితేజ, ఇంకొకరు అల్లరి నరేష్. వీరిద్దరికి ఈసారి మిశ్రమ ఫలితాలే వచ్చాయి. రవితేజ ‘మిరపకాయ్తో తన ఫార్ములా కరెక్టే అని నిరూపించుకొన్నా… ‘దొంగలముఠా’, ‘వీర’ సినిమాలతో వెనుకడుగు వేయాల్సి వచ్చింది. నరేష్ పరిస్థితీ అంతే. ‘అహనా పెళ్లంట’ ఒక్కటే ఈ ఏడాది చెప్పుకోదగిన సినిమా. ‘సీమ టపాకాయ్’, ‘మడతకాజా’, ‘సంఘర్షణ’ సినిమాలు పరాజయాన్ని మూటగట్టుకోవలసి వచ్చింది.
చిన్న సినిమా తన ఉనికిని కాపాడుకోవడానికి ఈ ఏడాది కూడా ఆపసోపాలు పడింది. ‘అలా మొదలైంది’. ‘పిల్లజమిందార్’ సినిమాలు చిన్న నిర్మాతలకు కొండంత బలాన్నిచ్చాయి. ముఖ్యంగా నందినిరెడ్డి ‘అలా మొదలైంది’ అంటూ ప్రేక్షకులకు ఓ ప్రేమకథను చూపించారు. నటీనటుల ప్రతిభ, చక్కని సంగీతం, సున్నితమైన భావాల్ని తెర మీద ఆవిష్కరించిన విధానం, కథకు వినోదం అద్దిన తీరు ప్రేక్షకులకు నచ్చాయి. దాంతో ఈ చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. సాయికుమార్ తనయుడు ఆదిని కూడా ప్రేక్షకులు ఆశీర్వదించారు. ‘ప్రేమకావాలి’ పాస్ మార్కులు దక్కించుకుంది.  కొత్త ఆలోచనలతో తీసిన ‘ఎల్బీడబ్ల్యు’ విమర్శకుల ప్రసంశలు దక్కించుకుంది. ప్రేక్షకుల్ని పదిహేను రోజుల ముందే ఏప్రిల్ ఫూల్స్‌గా మార్చారు రాంగోపాల్‌వర్మ. ఐదు రోజుల్లో సినిమా తీసి భళా అనిపించారు. తీరా బొమ్మ చూస్తే ఆ సినిమాకి ఒకరోజు కూడా ఎక్కువే అనిపించింది. అదే ‘దొంగలముఠా’. ఈ చిత్రం మార్చి 18న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 19 నుంచి థియేటర్లో ఒక్కరంటే ఒక్కరూ కనిపించలేదు. వివాదాల‌తో సినిమాన గ‌ట్టెక్కించాల‌నే రాంగోపాల్ వ‌ర్మకి ప్రేక్షకుటు ఈ ఏడాది గ‌ట్టిగానే బుద్ది చెప్పారు.. ‘కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం అప్పల్రాజు’తో చేసిన ప్రయత్నం కూడా ఘోరంగా బెడిసికొట్టింది. ఇక బెజ‌వాడ అని హంగామా క్రియేట్ చేసినా ఆ చిత్రం లో స‌రుకు ఏమీ లేక‌పోవ‌డంతో దాన్నీ ప్రేక్షకులు తిర‌స్కరించారు.
ఈ సంవ‌త్సరం చివ‌ర్లో వ‌చ్చిన శ్రీ‌రామ రాజ్యం, రాజ‌న్న చిత్రాలు బాక్సాఫీసు వ‌ద్ద మంచి విజ‌యాన్నే న‌మోదు చేసుకున్నాయి. బాల‌కృష్ణకి సంవ‌త్సరం మొద‌ట్లో ప‌ర‌మ‌వీర చ‌క్ర ఫ్లాఫ్ రావ‌డం, చివ‌ర్లో శ్రీ‌రామ‌రాజ్యం లాంటి మంచి చిత్రంతో విజ‌యాన్ని ద‌క్కించుకోవ‌డంతో ఆయ‌న ఈ సంవ‌త్సరం రెండు మిశ్రమ ఫ‌లితాల‌ని చ‌వి చూడాల్సి వ‌చ్చింది.
ఈ ఏడాది రికార్డుల గురించి మాట్లాడుకొన్నది, పాత రికార్డులు సవరించాల్సి వచ్చింది ‘దూకుడు’ సినిమా విషయంలోనే జరిగింది. శ్రీనువైట్ల-మహేష్‌బాబుల మాయాజాలం బాగా పనిచేసింది. బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ ఈ సినిమాకి బాగా ప్లసయ్యారు. కోన వెంకట్ సృష్టించిన పాత్రల మధ్య ‘దూకుడు’ హంగామా చేసింది. కథ, కథనాల మాట అటుంచితే మహేష్ నటన, బ్రహ్మానందం కామెడీ టైమింగ్ ఈ సినిమాకి ప్రాణం పోశాయి. అగ్ర హీరో సినిమా హిట్‌టాక్ సంపాదించుకొంటే ఫలితం ఎలా ఉంటుందో ఈ సినిమా నిరూపించింది. అయితే ఏడాదికి ఒక్క సూపర్‌హిట్ సరిపోదు. పరిశ్రమ ఇంకా కోరుకొంటోంది. తెలుగు ప్రేక్షకుడు సినిమాల‌ని అంచ‌నా వేయ‌డంలోనూ, సినిమా స‌క్సెస్ చేయ‌డంలోనూ ఎప్పుడూ వెనుకాడ‌లేదు. మంచి క‌థ‌, క‌థ‌నాల‌తో వ‌చ్చే చిత్రం వ‌స్తే ఈ చిత్రంలో హీరో ఎవ‌ర‌నేది కూడా చూడ‌కుండా ఆ చిత్రాన్ని ఘ‌న విజ‌యం సాధిస్తారు. దీనికి చ‌క్కని ఉదాహ‌ర‌ణ త‌మిళ హీరో జీవా న‌టించిన రంగం చిత్రం. ఈ చిత్రం త‌మిళ అనువాద‌మ‌యినా, ఇందులోని హీరో జీవా తెలుగువారికి అంత‌గా ప‌రిచ‌యం లేక‌పోయ‌నా సినిమాని మాత్రం వంద‌రోజులు ఆడించారు. వ‌చ్చే సంవ‌త్సరం కూడా తెలుగు చిత్ర సీమ‌లో కొన్ని ప్రయోగాల‌తో కూడిన చిత్రాలు ముందుకు వ‌స్తున్నాయి. మ‌హేష్‌, వెంక‌టేష్ క‌లిసి న‌టిస్తున్న మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు రాబోతున్నాయి. హీరోల క‌మిట్‌మెంట్‌, ద‌ర్శకుల స్పీడు చూస్తుంటే 2012 తెలుగు చిత్ర సీమ‌కి బంగారు భ‌విష్యత్తుని అంద‌స్తుంద‌ని అనిపిస్తుంది.. ఇదే నిజం కావాలని ఆశిస్తూ… అంద‌రికీ నూత‌న సంవ‌త్సర శుభాకాంక్షల‌తో…
-సిఎస్‌కె
checheske@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!