‘థానే’ తో తీరాలు అల్లక‌ల్లోలం..


బంగాళాఖాతంలో ఏర్పడిన థానే తుపాను తీర ప్రాంతాన్ని కలవర పరుస్తోంది. బుధవారం తీరంలో తుపాను ప్రభావం పెరిగింది. సముద్ర తీరం వెంబడి అలల తీవ్రత పెరిగింది. నిజాంపట్నం హార్బర్ వద్ద అలలు ఎగసి పడుతుండటంతో సముద్రంలోకి ఎవరూ వెళ్లకుండా చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే నిజాంపట్నం హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. బాపట్ల నుంచి సముద్రంలోకి వేటకు వెళ్లిన ఒక పడవలోని నలుగురు మత్స్యకారుల ఆచూకీ కోసం అధికారులు ప్రయత్నిస్తున్నారు. తుపాను ప్రభావంతో బుధవారం సాయంత్రం నుంచి వాతావరణంలో పెనుమార్పు చోటు చేసుకుంది.
ఆకాశం పూర్తిగా మేఘావృతమైంది. రేపల్లె ప్రాంతంలో చిరు జల్లులు పడ్డాయి. నిజాంపట్నం హార్బర్ వద్ద రెండో నెంబర్ ప్రమాద సూచిక కొనసాగుతోంది. తుపాను ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు అధికార యం త్రాంగం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తీర ప్రాంతంలో ఆర్టీసీ బస్సులను సిద్ధం చేశారు. అలాగే నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అధికారులు, ఉద్యోగుల సెలవులను రద్దు చేసి అందరూ అందుబాటులో ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించారు.
థానే తుఫాను చెన్నైకి 300 కి.మీ దూరంలో కేంద్రీకృతం అయి రేపు చెన్నై-నాగపట్నం మధ్య పుదిచ్చేరి దగ్గర తీరం దాటే అవకాశం ఉన్నట్లు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటలకు 90-110 వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు. థానే తుఫాను ప్రభావంతో వచ్చే 24 గంటల్లో దక్షిణ కోస్తాకు భారీ వర్ష సూచన ఉన్నట్లు విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో అన్ని ప్రాంతాల ఓడరేవుల్లో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. థానే తుఫాను ప్రభావంపై ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి గురువారం ఉదయం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పంకజ్ ద్వివేదితో ఫోన్‌లో మాట్లాడారు. తీర ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. తీర ప్రాంత మత్స్యకారులకు తగిన సహాయం అందించాలని సీఎం వెల్లడించారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!