ఎమ్మెల్యేల‌కు డ‌బ్బు ఆఫ‌ర్‌


ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కారులో డబ్బులు ఉంచి, కాంగ్రెస్ కు ఓటేసి ఆ డబ్బు తీసుకుని వెళ్లమన్నారని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై , కాంగ్రెస్ నేతలపై వై.ఎస్. ఆర్.కాంగ్రెస్ నేత జగన్మోహన్ రెడ్డి చేసిన ఆరోపణలలో నిజమెంత ఉందన్నది ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ముఖ్యమంత్రి ఈ ఆరోపణను తీవ్రం ఖండించారు. కాంగ్రెస్ పార్టీ తన ఎమ్మెల్యేలకే లంచం ఇస్తుందా అని ఆయన ప్రశ్నించారు. తాము అలాంటి నీచమైన రాజకీయాలకు పాల్పడజాలమని స్పష్టం చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. కాని కాంగ్రెస్ వ్యూహకర్తలు జగన్ వర్గం ఎమ్మెల్యేలను ఆకట్టుకోవడానికి రకరకాల వ్యూహాలను అమలు చేశారు. అందులో ముఖ్యమంత్రి సన్నిహితులు,పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ సన్నిహితులు ఉన్న మాట నిజమేనని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అది వీరిద్దరికి తెలియకుండా జరుగుతుందా అన్నది చర్చనీయాంశంగా ఉంది.అయితే ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై ఇంతవరకు కాంక్రీట్ గా నిర్దిష్టమైన అవినీతి ఆరోపణలు రాకపోవడం గమనించవలసిన అంశం. కాగా రాజకీయ పార్టీలు ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో తమ ఉనికిని కాపాడుకోవడానికి నానా తంటాలు పడుతున్నాయి.ఇతర పక్షం ఎమ్మెల్యేలను ఆకర్షించడం కోసం గతంలో వై.ఎస్.రాజశేఖరరెడ్డి ప్యాకేజీలు ఇచ్చేవారన్న ఆరోపణలు ఉన్నాయి. ఆ దశ పోయి ఉన్న సొంత ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి ప్యాకేజీలు ఇవ్వవలసి వస్తున్నది. ఇది అధికార పార్టీ కే కాదు. ప్రతిపక్ష పార్టీలకు కూడా వర్తిస్తుంది.అదే సందర్భంలో అసెంబ్లీలో అధికార పార్టీ విశ్వాస పరీక్ష సందర్భంగా కారులో డబ్బులు పెడుతోందన్న ఆరోపణలు సభా ప్రాంగణంలో విస్తారంగా ప్రచారం అయ్యాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందన్నది మాత్రం ఇచ్చినవారికి, పుచ్చుకున్నవారికి, చూసినవారికే తెలియాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!