అత్యుత్సాహంతో సిఎం అసంతృప్తి


రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన రెండు రోజుల కలెక్టర్ల సమావేశం సందర్భంగా చివరిలో ఎస్.పిలతో జరిగిన శాంతిభద్రతల సమీక్షలో హోం మంత్రి తప్ప మిగిలిన మంత్రులను సమావేశ మందిరం నుంచి వెళ్లిపోవాలని కోరడం వివాదాస్పదం అయింది. గతంలో ఎప్పుడూ ఇలా మంత్రులను అవమానించలేదని కొందరు మంత్రులు బాధపడితే, గతంలో కూడా శాంతి భద్రతల సమీక్షలో ఇతర మంత్రులు పాల్గొనలేదని రెవెన్యూశాఖ మంత్రి రఘువీరారెడ్డి అభిప్రాయపడ్డారు. అయితే నిజానికి దీనికి ఇంత రభస జరగవలసిన అవసరం లేదని , ముఖ్యమంత్రి పేషీ అధికారులు కాస్త సమన్వయంతో , ముందు జాగ్రత్తతో వ్యవహరించి ఉంటే ఈ అనవసర చికాకు తప్పి ఉండేది కాంగ్రెస్ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. సుదీర్ఘకాలం మంత్రులుగా ఉన్న జానారెడ్డి వంటివారు ఈ పరిణామంతో అసహనానికి గురి కావలసి వచ్చిందని, మంత్రి శంకరరావును అయతే ఏకంగా సీనియర్ అదికారి ఒకరు బయటకు వెళ్లవలసిందిగా కోరవలసి వచ్చిందని గుర్తు చేస్తున్నారు. మంత్రులు సమావేశంలో ఉంటే ఎస్.పిలు అన్ని విషయాలు చెప్పడానికి కాస్త ఇబ్బంది పడవచ్చని, అలాగే సున్నితమైన కొన్ని అంశాలు ప్రస్తావించడానికి వెనుకాడవచ్చని,ఆ కారణంగానే ఇతర మంత్రులతో నిమిత్తం లేకుండానే శాంతిభద్రతల సమీక్ష జరుగుతుందని అంటున్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేషీ అధికారులు మంత్రులకు ఎజెండాను పంపేటప్పుడే మధ్యాహ్న సమావేశం తర్వాత మంత్రులు జూబిలి హాలుకు రావలసిన అవసరం లేదని తెలియచేసి ఉంటే సరిపోయేదని అంటున్నారు. అయితే దీనిపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి పేషీ అధికారులను తీవ్రంగా మందలించారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రికి గతంలో ఎన్నడూ రానంతగా కోపం వచ్చిందని,అధికారులు చేసిన పొరపాటు వల్ల తమ ప్రభుత్వానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైందని ఆయన బాధపడ్డారని కాంగ్రెస్ నాయకుడు ఒకరు చెప్పారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!