పొగతో మనిషి `మాయం’ (పార్ట్ -1)

ఒక సరదా మీ జీవితాన్ని మార్చివేస్తుంది. ఇదేదో వ్యాపార ప్రకటన కాదు. ఇది నిప్పులాంటి నిజం.  సరదా కోసం ప్రారంభించే స్మోకింగ్‌ అలవాటు మీ జీవితాన్ని మాడ్చి మసిచేస్తుంది. ప్రపంచ నో  టొబాకో అవగాహన దినం (మే 31) సందర్భంగా ప్రత్యేకం…

చూడటానికి ఎంతో అమాయకంగా ఉండే పొగ గొట్టం.. అదేనండీ సిగరెట్‌… మిమ్మల్ని వశం  చేసుకుని తన ఇష్టం వచ్చినట్టు ఆడించే మంత్రదండం. సిగరెట్‌ తాగడం మీకు ఇష్టంగానే  ఉండవచ్చు. కానీ, మీ హృదయస్పందన ఏమిటీ..దాని మాటేమిటీ…ఓసారి ఆలోచించండి. పొగతో మీ జీవితం `మాయం’ కాకూడదు.
గురజాడవారు రాసిన కన్యాశుల్కం నాటకం మీకు గుర్తుండే ఉంటుంది. అందులో గిరీశం పాత్ర  కీలకమైనది. తెలుగుదనం ఉట్టిపడేలా తెల్లటి పంచెకట్టు.  అంతే తెల్లదనంతో మెరిసిపోయే  పొడుగుచేతల షర్టు.  విలాసంగా నిలబడుతూ చుట్ట కాల్చడం అతగాడి స్టైల్‌. చూడటానికి అతని  రూపు బాగుండవచ్చు. అలాగే, వినడానికి మాటలు కూడా కమ్మగా ఉండవచ్చు. కానీ  పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్‌ అంటూ చమత్కారంగా కామెంట్‌ చేయడం మాత్రం  బాగోలేదు.  పైగా అమృతం చుక్క నేలమీద రాలగా అది పొగచెట్టుగా అవతరించిందంటూ  కన్‌క్లూజన్‌కు రావడం మరీ బాగోలేదు. నిజంగా అది అమృతమే అయితే ధూమపానానికి అలవాటు  పడి మానలేక భయానక రోగాలతో మృత్యువాత పడ్డవారు ఎందరో.

మృత్యుదారి

కేవలం ఆనందం కోసం మీరు పీల్చే పొగాకు ఎంత హానీ చేస్తుందో తెలుసా..?   పొగ నేరుగా  ఊపిరితిత్తుల్లోకి పాకుతోంది. గుండెల్ని మండిస్తోంది. రక్తనాళాలను కలుషితం చేస్తుంది. నోటి  క్యాన్సర్‌నే కాదు, ఊపిరితిత్తులను, గుండెను పిండేస్తోంది.  ప్రతి సిగిరెట్ దమ్ము  ఆనందపుటుంచులకు తీసుకువెళుతుందనుకోవడం ఒట్టి భ్రమ. చివరకు తీసుకువెళ్లేది  మృత్యువాకిట్లోకే.

మే-31 నొ-టొబాకొ డే

స్మోకింగ్‌ సమస్య ఇప్పుడు ఒక్క మనదేశంలోనే కాదు, యావత్‌ ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఉగ్రవాదం, కాలుష్యం, అంటువ్యాధులు వంటివాటి సరసన స్మోకింగ్‌  ఏనాడో చేరిపోయింది. మరి స్మోకింగ్‌తో పట్టిన పొగను వదలించుకోవడం ఎలా..? ఒక్కసారి  మీరూ ఆలోచించండి…
పొగాకు వాడ‌కాన్ని తగ్గించేందుకు ఇప్పటికే ప్రపంచదేశాలు నడుం బిగించాయి. ప్రపంచ ఆరోగ్య  సంస్థ ప్రత్యేక శ్రద్ధపెట్టింది. ప్రతిఏటా మే 31న నో టొబాకో అవగాహనా దినంగా పాటిస్తోంది..

టిఎన్నార్‌..

email:ntrurlapati@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!