పొగతో మనిషి `మాయం’ (పార్ట్ -3)


స్మోకింగ్‌కి చిన్నాపెద్దా తేడాలేదు. మహిళలు, పురుషులు అన్న లింగబేధం అంతకన్నాలేదు. అందర్నీ  పీల్చి పిప్పిచేస్తున్నదీ సిగరెట్‌. ఆరోగ్యంగా ఉండేవారిని సైతం సైలెంట్‌గా చంపగల శక్తి దీనికే ఉంది. పొగ తాగడం ఎంతటి ప్రమాదకరమో, పొగ తాగే వారి పక్కన ఉండేవారికి అంతటి  ప్రమాదమేనంటున్నారు డాక్టర్లు. స్మోకర్లు కాన్సర్‌కు గురికావడంతో పాటుగా అనేక ఇతర రోగాల  బారిన కూడా పడుతుంటారు. పిల్లలు, పెద్దల్లో అకాల మరణాలు చోటుచేసుకుంటున్నాయి.  గుండెజబ్బులు, ఊపిరితిత్తి రోగాలు వస్తున్నాయి. 13 నుంచి 15 ఏళ్ల లోపు పిల్లల్లో 14.1 శాతం మంది  పొగాకు వినియోగదారులవుతున్నారని గ్లోబల్‌ యూత్‌ టొబాకో సర్వే తేల్చిచెప్పింది. మన  దేశంలో ఏటా లక్షలాది మందిపొగాకు సంబంధిత రోగాల వల్ల మృత్యువాత పడుతున్నారు.  అనారోగ్యంతో బాధపడుతున్న వారిలో 40 శాతం మంది, కాన్సర్‌ రోగంతో బాధపడుతున్న వారిలో  50 శాతం మంది పొగాకు వాడకందార్లే.
పొగాకు చేసే హాని , రోగాల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం కొన్ని చట్టాలు కూడా  తీసుకువచ్చింది. సిగరెట్లు, ఇతర పొగాకు ఉత్పత్తుల వాడకం, అమ్మకాలపై ఆంక్షలు పెడుతూ  2003లో ఒక చట్టం వచ్చింది. ఈ చట్టం దేశమంతటా అమల్లో ఉంది. ఈ చట్టం ప్రకారం, బహిరంగ  ప్రదేశాల్లో పొగత్రాగడాన్ని నిషేధించారు. అంతేకాదు, మైనారిటీ దాటని పిల్లలకు పొగాకు  ఉత్పత్తులను విక్రయించకూడదు. వీటికి సంబంధించిన వ్యాపార ప్రకటనలపై కూడా నిషేధం  విధించారు. విద్యాసంస్థలకు వంద గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల అమ్మకాలను నిషేధించారు.  పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక గుర్తులు ఉండేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఈ చట్టంలో  మార్పులు చేసిన నిబంధనలు గత ఏడాది అక్టోబర్‌ రెండవ తేదీ నుంచి అమలు చేశారు. ఈ  కారణంగా బహిరంగ ప్రదేశాల్లో పొగ తాగడాన్ని నిషేధిస్తూ, బహిరంగ ప్రదేశాలంటే ఏమిటో వివరణ  ఇచ్చారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే 200 రూపాయల దాకా జరిమానా విధించే వీలు కల్పించారు.

స్మోకర్స్ గా నూరేళ్లు బతకలేమా?

స్మోకింగ్‌ హాబిట్‌ ఉన్నా హాయిగా బతికేస్తున్నవాళ్లు ఉన్నారుకదా…ఎంతో పెద్దవాళ్లను చూశాం.  ఇప్పటికీ చుట్టలు కాలుస్తూ కూడా కులాసా ఉంటున్నారన్న మాటలు అప్పుడప్పుడు  వినబడుతుంటాయి. అయితే ఎవరు ఎన్ని సిగరెట్లు కాలిస్తే వారి ఆరోగ్యం పాడవుతుందన్నది  వారికున్న వ్యాధినిరోధక శక్తిపైన ఆధారపడి ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. ఒక వేళ స్మోకింగ్‌తో  ఎక్కువకాలం బతికి ఉన్నా, వారి అనారోగ్య సమస్యలను తీసుకుంటే వాటిలో చాలామటుకు  పొగత్రాగడం వల్ల వచ్చినవే అయిఉంటాయి.
పొగతాగడం అలవాటున్నవారిలో పది శాతం మందిలో ఎక్కువగా దీనికి సంబంధించిన రోగాలతోనే  బాధపడుతున్నారు. స్మోకింగ్‌ మానేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ ఏవో కారణాల వల్ల  మానలేకపోతుంటారు. ఉదాహరణకు ఒక వ్యక్తి రేపటి నుంచి సిగరెట్‌ మానేద్దామని అనుకంటే  అంతలో ఏదో ఒక కష్టం వస్తుంది. దీంతో కష్టాన్ని మరచిపోవడానికి ఇంకా ఎక్కువ సిగరెట్లు  కాల్చడం మొదలుపెడతాడు. సిగరెట్‌ మానలేకపోతున్నామని చెప్పడానికి అనేక కారణాలు  వెతుక్కుంటాడు. ఇదో బలహీనత. నిజానికి సిగరెట్‌లోని నికోటిన్‌ అనే అల్కలాయిడ్‌ మెదడుపై  ప్రభావం చూపడంతో సిగరెట్‌ మానేయలేని స్థితి ఏర్పడుతుంది.

జేబుకు చిల్లే…

నోట్లో సిగరెట్‌ పెట్టుకుని దాన్ని  స్టైల్‌గా వెలిగించి రింగ్‌రింగ్‌లుగా పొగవదలడంలో ఆనందం  ఉండవచ్చు. మరి ఖర్చుమాటేమిటి? పొగరాయుళ్లు సిగరెట్లపై పెట్టే ఖర్చు తక్కువేమీకాదు.  లక్షాధికారుల సంగతి ఎలా ఉన్నా, మధ్యతరగతి, పేదవారికి మాత్రం ఈ ఖర్చు భరించలేనిదే.  ఆరోగ్యాన్నే కాకుండా జేబును కూడా కాల్చేస్తున్నదీ సిగరెట్‌.
స్మోకింగ్‌ మీ జేబుకు చిల్లుపెడుతుంది. మధ్యతరగతిలో అనేక మంది కేవలం స్మోకింగ్‌కే నెలకు  వెయ్యి నుంచి 1500 రూపాయలదాకా ఖర్చుపెడుతున్నారని ఒక సర్వేలో తేలింది. దీనికి తోడు  మద్యం ఇంకా ఇతర దుర్వ్యసనాలు ఉంటే నెలకు మూడునాలుగు వేలు ఖర్చుఅవుతుంటుంది.  దీంతో అనేక మధ్య, అల్పాదాయ వర్గాలు అతలాకుతలం అవుతున్నాయి. కుటుంబాలు  విచ్ఛిన్నమవుతున్నాయి. అంటే సరదాగా మొదలయ్యే స్మోకింగ్‌ చివరకు వారి కుటుంబాన్ని  వీధినపడేస్తున్నది. వారి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తుంది.
సిగరెట్లకు మీరెంత ఖర్చుపెడుతున్నారని తెలుసుకోవాలంటే సిగరెట్‌ కాస్ట్‌ క్యాలిక్యులేటర్‌ని  ఉపయోగించుకోవచ్చు. ఇంటర్నెట్‌లో లభించే ఈ క్యాలిక్యులేటర్‌ ద్వారా ఏడాదికి మీ సిగరెట్‌ ఖర్చు  ఎంతో ఇట్టే తెలుసుకోవచ్చు. అంతేకాదు, మీరు సిగరెట్‌ స్మోకింగ్‌ మొదలుపెట్టినప్పటి నుంచి  ఇప్పటి వరకు అయిన ఖర్చు కూడా తెలిసిపోతుంది. ఉదహరణకు 1999 జనవరి 1 న ఒక వ్యక్తి  రోజుకు పది సిగరెట్లు కాలుస్తుంటే, ఒక పెట్టె ఖరీదు సుమారు 40 రూపాయలు అనుకుంటే ఏడాదికి  అతగాడు సిగరెట్ల కోసం పెట్టిన ఖర్చు 14వేల 600 రూపాయలు. మొత్తం ఈ పదేళ్లలో పెట్టిన ఖర్చు  ఒక లక్షా 52వేల 80 రూపాయలు.

- టీఎన్నార్

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!