ఎన్టీఆర్ విశ్వరూపం(పార్ట్ 3)


బాల్యం ఓ కమ్మని కావ్యం

ఎన్టీఆర్‌ బాల్యం కూడా ఓ కమ్మని కావ్యంలా సాగింది. కాలేజీ కుర్రాడిగా ఉన్నరోజుల్లోనే  మీసాల నాగమ్మగా కొత్త రూపాన్ని ప్రేక్షకులకు పరిచయం చేసిన సాహసి. అప్పటి నుంచి  ఎన్నో నాటకాల్లో నటించారు. చిన్నతనంలోనే ఆర్థిక ఇబ్బందులంటే ఏమిటో రుచిచూశారు.  అయినా కళామతల్లిని మాత్రం విడవలేదు.
నందమూరి తారకరామారావు 1923 మే 28 సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో  జన్మించారు. కృష్ణాజిల్లా పామర్రు మండలం నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి,  వెంకటరామమ్మ దంపతులకు పుట్టిన ముద్దుల బిడ్డడు ఎన్టీఆర్. పండంటి బిడ్డడికి  ముందుగా కృష్ణ అని పేరుపెట్టాలని కన్నతల్లి అనుకున్నారు. మేనమామ సలహా మేరకు  తారక రాముడు పేరు ఖరారు చేశారు. తరువాత ఆ పేరు తారక రామారావుగా మారింది.  విజయవాడ మున్సిపల్‌ స్కూల్‌లో చదువుకున్న తరువాత అక్కడే ఎస్‌.ఆర్‌.ఆర్‌  కాలేజీలో చేరారు. రామారావు ఆ కాలేజీలో చేరే సమయంలో విశ్వనాథ సత్యనారాయణ  తెలుగు విభాగానికి అధిపతిగా ఉండేవారు. అప్పుడే రామారావును  నాటకంలో నాగమ్మ పాత్ర  పోషించమని విశ్వనాథవారు కోరారు. అయితే మీసాలు తీయడానికి ఎన్టీఆర్‌ ఇష్టపడలేదు.  దీంతో మీసాలతోనే ఆ నాటకంలో నటించారు. మీసాల నాగమ్మగా పేరు తెచ్చుకున్నారు.

1942 మే నెలలో 20 ఏళ్ల వయసులో తన మేనమామ కుమార్తె బసవరామ తారకంను  ఎన్టీఆర్‌ పెళ్లి చేసుకున్నారు. ఆ తరువాత గుంటూరు ఆంధ్రా క్రిస్టియన్‌ కాలేజీలో చేరారు.  అక్కడే నాటక సంఘాల వారితో పరిచయాలు ఏర్పడ్డాయి. కొంగర జగ్గయ్య, ముక్కామల,  నాగభూషణం, కె.వి.ఎస్‌.శర్మ వంటివారితో కలిసి ఎన్నో నాటకాల్లో నటించారు. ఎన్టీఆర్‌ మంచి  చిత్రకారుడు కూడా. ఆయన గీసిన చిత్రానికి రాష్ట్ర స్థాయి చిత్రలేఖన పోటీల్లో బహుమతి  కూడా అందుకున్నారు. ఒక సారి సుభాష్‌ చంద్రబోస్‌ విజయవాడ వచ్చినప్పుడు ఆయన  చిత్రాన్ని గీసి కానుకగా ఇచ్చాడు. రామారావు కాలేజీలో చదివేరోజుల్లో ఆర్థిక ఇబ్బందులను  ఎదుర్కోవలసి వచ్చింది. దీంతో జీవనం కోసం కొన్ని రోజులు పాలవ్యాపారం చేశారు. మరి  కొన్ని రోజులు కిరాణాకొట్టు నడిపారు. ఇకొన్ని రోజులు ముద్రణాలయం నడిపారు. ఆర్థిక  ఇబ్బందులు ఉన్నప్పటికీ ఏనాడు అప్పుజేసేవారు కారు.  ఆ తరువాత సబ్‌రిజిస్టార్‌ ఉద్యోగం  వచ్చినా సినిమాలమీద ఉన్న మోజుతో ఎక్కువకాలం జాబ్‌ చేయలేకపోయారు.  సినిమాల్లో చేరాక ఇక వెనుదిరిగి చూసుకోలేదు. విజయోత్సాహంతో ముందుకే ఉరికారు.

సినీరంగంలోనూ, రాజకీయ జీవితంలోనూ రారాజుగా వెలుగొందిన మహోన్నత వ్యక్తి  ఎన్టీఆర్‌. తాను అనుకున్న లక్ష్యాలను సాధించేవరకు విశ్రమించని కార్యోన్ముఖుడు ఎన్టీఆర్‌.  కాలం పరుగులుతీస్తున్నా నేటికీ కళ్లముందు కనిపించే మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్‌.  తెలుగువారి గుండెల్లో ఆరని జ్యోతి ఎన్టీఆర్. మరచిపోని మధురస్మృతులే ఆయనకు మనం  అందించే నీరాజనం.

- రచన: తుర్లపాటి నాగభూషణ రావు
email:nrturlapati@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!