జయ- సోనియా – మిత్రలాభం (పార్ట్-2)

తమిళనాట విజయబావుటా ఎగురవేసిన జయలలిత ఇప్పుడు ఎంతో హుషారుగా ఉన్నారు. తన చిరకాల రాజకీయ ప్రత్యర్థి డీఎంకె అధినేత కరుణానిధిపై మరోసారి తనివితీరా కసితీర్చుకునే అదును దొరకడం నిజంగానే ఆమె ఆనందించే విషయమే. ఆశించినట్టుగానే జయలలిత సీఎం సీట్లు కూర్చున్న కొద్ది గంటల్లోనే కరుణానిధి కూతురు కనిమొళిని సీబీఐ అదికారులు అరెస్టు చేసి తీహార్ జైలుకు తరలించారు. దీంతో 86ఏళ్ల పెద్దాయన కంగుతున్నాడు. అంతకముందే ఎన్నికల ఫలితాలతో కళ్లుబైర్లుకమ్మిన కరుణానిధికి ఇది కుటంబపరంగానూ, పార్టీ పరంగానూ పెద్ద షాకై కూర్చుంది. అదే సమయంలో జయలలితకు ఇదెంతో ఊరట కలిగించి ఉండవచ్చు. అయితే ఇది ఇక్కడతో ఆగదు. గతంలో శాసనసభలోనే దుశ్యాసన పర్వంతో పగలబడి నవ్విన డిఎంకె ప్రతినిధులపై జయ ఇప్పటికీ పగబట్టే ఉంది. 2జి స్పెక్ట్రమ్ కేసును కేంద్రం సీరియస్ గా తీసుకోవడం ఒక్కొక్క దిగ్గజాన్ని అరెస్టు చేయిస్తుండట జయకు సంతోషం కలిగిస్తోంది. యుపీఏ అధినేత్రి సోనియా ఇప్పుడు అవినీతిపై కొరడా ఝుళిపిస్తూ, తన శత్రువుల పని పట్టడం `కాగల కార్యం గంధర్వులే చేసినట్టు’గా జయ సంబరపడిపోతున్నారు. షాక్ మీద షాక్ తగులుతుండటంతో కరుణానిధి రాజకీయ అస్త్రసన్యాసం చేసే దిశగా సాగిపోతుండటం కూడా ఆమెకు ఆనందం కలిగించే విషయమే. ఇక ముందు కూడా సోనియా తీసుకునే కీలక నిర్ణయాలు డీఎంకెకు గుదిబండలే అవుతాయి. అవన్నీ జయకు అనుకూలిస్తాయి. ఈ కోణంలో ఆలోచిస్తే, జయ- సోనియాల మధ్య మైత్రీ బంధం ఏర్పడే అవకాశాలను సైతం కొట్టిపారేయలేం. ఇప్పటికే, జయలలిత మనసులో సోనియాపై ఉన్న ధ్వేషం తగ్గుముఖం పట్టినట్టుగా ఆమె ఆంతరంగిక వర్గాలు చెబుతున్నాయి. ఇదే నిజమైతే, జయ- సోనియాలు మిత్రలాభం వైపు అడుగులు వేయవచ్చు. కరుణానిధినీ, ఆయన వారసులను దెబ్బతీయడంలో సోనియా సహకరిస్తే, అందుకు ప్రతిగా, జయలలిత యూపీఏ కూటమివైపు అడుగులు వేయవచ్చు. ప్రస్తుతానికి సోనియా పంపిన ఆహ్వానాన్ని జయలలిత తిరస్కరించినా, మున్ముందు పరిస్థితిలో మార్పు రావచ్చని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అదే జరిగితే, జయ- సోనియా మిత్రలాభం కథ రసవత్తరంగానే సాగుతుందని అనుకోవచ్చు.
- భూషణ్ (న్యూఢిల్లీ)

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!