వెన్నుపోటు గుట్టువిప్పిన చంద్రబాబు..



తెలుగుదేశం పార్టీని బ‌లోపేతం చేయ‌డానికి చంద్ర‌బాబు నాయుడు కొన్ని కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నారా..? మ‌హానాడు సాక్షిగా చంద్ర‌బాబు మారిపోయారా..? ఇప్ప‌టి వ‌ర‌కూ టిడిపిలో జ‌రిగిన కొన్ని లోటుపాట్ల‌ను ప్ర‌స్తావించి, కొన్ని పొర‌పాట్లు జ‌రిగాయ‌ని కూడా అంగీక‌రించిన చంద్ర‌బాబు ప్ర‌వ‌ర్త‌న‌లో ఇంత‌టి మార్పు ఎలా వ‌చ్చింది..? ఒక వైపు తెలంగాణ ప్రాంత నాయ‌కులు జై తెలంగాణ అని అంటూండ‌డం, తెలంగాణ నినాదంతో పార్టీలోనుండి ముఖ్య‌నేత‌, సీనియ‌ర్ అయిన నాగం జ‌నార్థ‌న్‌రెడ్డి బ‌య‌టికి వెళ్ళిపోవ‌డం, అదే నినాదంతో మ‌రికొంత మంది తెలంగాణ ఎమ్మెల్యేలు కూడా టిడిపి నుండి వెళ్ళిపోయే అవ‌కాశం ఉండ‌డం,  మ‌రోవైపు వార‌స‌త్వపు పోరులో హ‌రికృష్ణ‌తో విభేధాలు క‌ల‌గ‌డం, వ్యూహాత్మ‌కంగా పావులు క‌దిపి ఈ మ‌హానాడు వేదిక ద్వారా నారా లోకేష్‌ని రాజ‌కీయ రంగం ప్ర‌వేశించాల‌నే ఆయ‌న కోరిక నీరుగారిపోవ‌డం, పార్టీలో అంత‌ర్గ‌తంగా త‌లెత్తుతున్న విభేధాల‌ని ఎలా నివారించాలో అర్థం గాక ఆయోమయంలో ఉండ‌టం.. వెర‌సి చంద్ర‌బాబు పార్టీ భ‌విత‌వ్యం గురించి ఆత్మ ప‌రిశీల‌న చేసుకోవాల్సిన అవ‌స‌రం ఏర్ప‌డింది. అందుకే ఆయ‌న మ‌హానాడు చివ‌రి రోజున సుదీర్ఘ ప్ర‌సంగంలో గ‌తంలో జ‌రిగిన పొర‌పాట్ల గురించి రివ్యూ చేశారు. అంతేకాదు తాను స్వ‌ర్గీయ ఎన్టీఆర్ ని గ‌ద్దెదించాల‌ని అనుకోలేదని, ఆరోజు ఉన్న ప‌రిస్థితుల్లో ఓ దుష్ట‌శ‌క్తి నుండి ఎన్టీఆర్ ని, పార్టీని ర‌క్షించాల‌నే ఉద్దేశ్యంతోనే తాను అలా చేయ‌వ‌ల‌సి వ‌చ్చింద‌ని వివ‌ర‌ణ ఇచ్చుకున్నారు. అదికూడా ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగానే తాను ఎన్టీఆర్‌ని గ‌ద్దెదింపానే త‌ప్ప స్వార్థ‌పూరితంగా కాద‌ని అన్నారు.  లీడ్ లోనే ఎన్టీఆర్‌ని తొలగించి సీఎం సీట్లో కూర్చున్న 16 ఏళ్ల తరువాత చంద్రబాబు నాటి వెన్నుపోటు సంఘటనపై స్పందించారు. ఇంత‌వ‌ర‌కూ పెద‌వి విప్ప‌ని చంద్ర‌బాబు మ‌హానాడు వేదిక‌పై త‌న‌కు తాను ఈ విష‌యంపై మాట్లాడ‌టం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురిచేసింది. త‌న‌ని వెన్నుపోటు దారుడ‌ని ప్ర‌తిప‌క్ష పార్టీలు విమ‌ర్శించ‌డంతో ఈ విమ‌ర్శ‌నుండి బ‌య‌ట‌ప‌డ‌టానికే ప్ర‌త్యేకంగా ఈ విశ‌యాన్ని ప్ర‌స్తావించార‌ని విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఇక వార‌స‌త్వ పోరు గురించి కూడా  ఆయ‌న స్ప‌ష్ట‌త తీసుకువ‌చ్చారు. నంద‌మూరి కుటుంబం నుంచి జూనియ‌ర్ ఎన్టీఆర్‌కి, త‌న కుమారుడి నారా లోకేష్‌కి మ‌ధ్య న‌డుస్తున్న వార‌స‌త్వ పోరుకి ముగింపు ప‌ల‌క‌డానికి చంద్ర‌బాబు ప్ర‌య‌త్నించారు. త‌న కుమారుడు నారా లోకేష్ ప్ర‌స్తుతం బిజినెస్‌లో బిజీగా ఉన్నాడ‌ని, రాజ‌కీయాల్లోకి ఇప్పుడు వ‌చ్చే అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేసారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో హ‌రికృష్ణ‌, జూనియ‌ర్ ఎన్టీఆర్‌ల‌ని శాంతింప‌జేసే ప్ర‌య‌త్నం చేశారు. మొత్తం మీద మునుప‌టి చంద్ర‌బాబు లా కాకుండా ఈ మ‌హానాడు వేదిక‌లో మ‌రో కొత్త చంద్ర‌బాబుని చూసిన‌ట్టు కార్య‌క‌ర్త‌లు భావిస్తున్నారు. ఆయ‌నలో వ‌చ్చిన మార్పు ద్వారా భ‌విష్య‌త్తులో టిడిపి తిరిగి అధికార ప‌గ్గాలు చేప‌ట్ట‌డం ఖాయ‌మ‌ని కొంద‌రు టిడిపి నేత‌లు అంటున్నారు. ఏది ఏమ‌యిన‌ప్ప‌టికీ మూడు రోజుల పాటు జ‌రిగిన మ‌హానాడు ద్వారా కొత్త‌గా ఏ నిర్ణ‌యం తీసుకోక‌పోయిన‌ప్ప‌టికీ, చంద్ర‌బాబులో వ‌చ్చిన మార్పుని మాత్రం అంద‌రూ ప్ర‌త్యేకంగా చ‌ర్చించు కుంటున్నారు.

సిహెచ్‌. సంతోష్‌కృష్ణ

email:santoshkrishnach@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!