పొగతో మనిషి `మాయం’ (పార్ట్ -2)


ప్రపంచ దేశాల్లో ప్రతిఏటా లక్షలాది మంది పొగాకు వాడకం వల్ల మృత్యువాత పడుతున్నారు.  రోడ్డు ప్రమాదాలు, మద్యపానం, ఆత్మహత్యలు, ఎయిడ్స్‌, మాదకద్రవ్యాల వాడకం వంటి వాటి  వల్ల మృత్యువాత పడేవారి సంఖ్యకంటే పొగాకు వాడకం వల్ల మరణాలు ఎక్కువగా ఉంటున్నాయని  సర్వేలు చెబుతున్నాయి. క్యాన్సర్‌ వ్యాధితో బాధపడేవారిలో ముప్పయిశాతం మంది సిగరెట్లు  తాగడం వల్లనే ఆ మహమ్మారిని కౌగలించుకుంటున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వచ్చే వాళ్లలో  కూడా అత్యధికులు అంటే 87 శాతం మంది స్మోకర్లే.

సిగరెట్ లో క్యాన్సర్ కారకాలు

అసలు పొగాకులో ఏముంది..? పొగ తాగాలని ఎందుకంత మంది తపనపడిపోతుంటారు?? మనం  పీల్చే పొగ లోపలకి వెళ్ళి ఏం చేస్తుంది…?? తెల్లటి పొగగొట్టంలో ఏముంటాయి? చూడటానికి అమాయకంగా కనిపించే సిగరెట్‌లో మనిషి  ప్రాణం తీసే అనేక విషపదార్థాలు ఉన్నాయి.  వాటిలో మనిషికి చేటుచేసేవి క్యాన్సర్‌ కారకాలు సుమారు 60దాకా ఉన్నాయి. వీటివల్లనే క్యాన్సర్ వంటి భయానక వ్యాధులు వస్తున్నాయి. అంటే  సిగరెట్‌ పెదవుల మధ్య నాట్యం చేసే అందగత్తె కాదు… అది విషనాగు.  సిగరెట్‌లోని నికోటిన్‌ అత్యంత ప్రభావం చూపుతుంది. నేరుగా ఇది మెదడు కణజాలాన్ని యాక్టివేట్‌  చేస్తుంది. దీంతో సిగరెట్‌ తాగాలన్న తపన ఎక్కువ అవుతుంది. ఫలానా సమయంలో సిగరెట్‌ తాగకపోతే మెదడు పని చేయడం మానేస్తుందన్నంతగా  మనిషి బానిసైపోతాడు.
ఒక మనిషి ప్రతి సిగరెట్‌ నుంచి పది పఫ్స్‌ లాగితే, అలాంటి వ్యక్తి రోజుకు ఒకటి నుంచి ఒకటిన్నర  పెట్టలు తగలేస్తే పది నుంచి పదిహేను మిల్లీగ్రాముల నికోటిన్‌ మెదడులోకి చేరుతుంది. పొగాకు  తగలబడుతుంటే ప్రతి ఘనపు అడుగుకి అందులోనుంచి 1500 కోట్ల తార్‌ పార్టికిల్స్‌ వెలువడతాయి.  అంతేకాదు, మోటారు వాహనాల వల్ల కలిగే కాలుష్య ప్రభావం కంటే సిగరెట్లు తాగడం వల్ల కలిగే  హాని ఎక్కువ.

మన వ్యూహాలు

సిగరెట్‌ తాగేవాళ్లనీ, వారి పక్కన ఉన్నవాళ్లనీ ముప్పతిప్పలుపెడుతున్న పొగాకుపై ఇప్పటికే ప్రపంచ దేశాలు తీవ్రస్థాయిలో యుద్ధం ప్రకటించాయి. ఈ మహమ్మారిని తరిమికొట్టడానికి అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. మరి ఈ విషయంలో మన దేశం ఎటు పోతున్నది?
సిగరెట్‌ పెట్టెల మీద హెచ్చరిక గుర్తులు ముద్రించాలన్న విషయంలో వివిధ దేశాల్లో విభిన్న పద్ధతులను పాటిస్తున్నారు. ఆస్ట్రేలియాలో పెట్టె ముందు భాగంలో 30 శాతం బొమ్మ, వెనుక  భాగంలో 90 శాతం బొమ్మ వాడుతున్నారు. అదే బ్రెజిల్‌లో రెండు వైపులా నూటికి నూరు శాతం  హెచ్చరిక బొమ్మలు ముద్రించి ఉంటున్నాయి. కెనడాలో 50 శాతం బొమ్మలు ఉంటే మిగతా సగం కంపెనీ ముద్రలు ఉంటున్నాయి. థాయిలాండ్‌, ఇంగ్లండ్‌ ఇలా అనేక దేశాల్లో సిగరెట్‌ పెట్టెల మీద  హెచ్చరిక బొమ్మలు వచ్చేశాయి.

డేంజర్ మార్క్స్

ఇక మనదేశంలో పొగాకు ఉత్పత్తులపై హెచ్చరిక బొమ్మల విషయంలో చాలా కథే నడించింది.  మొదట్లో ఫీల్డ్‌ టెస్ట్‌ కింద మూడు బొమ్మలను కేంద్ర ఆరోగ్య శాఖ విడుదలచేసింది. అయితే ఈ  బొమ్మల విషయంలో రాజకీయంగా దుమారం రేగింది. పుర్రె గుర్తు ఉండటాన్ని కొన్ని పార్టీలు  పనిగట్టుకుని రాజకీయం చేశాయి. అలాగే శవం గుర్తుపై కూడా మతపరమైన అభ్యంతరాలు లేవనెత్తారు. దీంతో ఈ గుర్తు మరుగునపడి పోయింది. అలాగే మరీ భయంకరంగా ఉండే  బొమ్మలను మూలనపడేశారు. అలాగే పెట్టెలమీద 50 శాతం బొమ్మలు ఉండాలన్న ప్రతిపాదన కూడా వెనక్కి వెళ్లింది. ఎవ్వరినీ ఇబ్బంది పెట్టని రీతిలో తేలికపాటి బొమ్మలను ఎంచుకున్నారు. పెట్టె ముందు భాగంలో 40 శాతం మేరకు బొమ్మలు ఉంటే చాలన్న అవగాహనకు వచ్చేశారు. దీంతో  ప్రస్తుతం అమలులోకి వచ్చిన బొమ్మల హెచ్చరికల్లో మూడింటిని ఖరారు చేశారు. వాటిలో మొదటిది లంగ్‌ క్యాన్సర్‌ని సూచించే బొమ్మ. `పొగ చంపుతుంది…పొగాకు త్రాగడం వలన  కాన్సర్‌ వస్తుంద’న్న హెచ్చరిక రాసి ఉంటుంది. మరొక బొమ్మలో ఊపిరితిత్తులు ఎలా   చెడిపోతాయో చెప్పే బొమ్మ ఉంటుంది. మూడవ బొమ్మలో తేలు గుర్తు ఉంటుంది.

నిషేధం

ప్రజారోగ్యం దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే బహిరంగ ప్రదేశాల్లో ధూమపానాన్ని నిషేధించింది.  అలా చేస్తే జరిమానాలు విధించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. మన రాష్ట్రంలో ఈ ఏడాది మార్చి నాటికి ఒక లక్షా నలభైవేల రూపాయల మేరకు జరిమానాల రూపంలో వసూలు చేశారు.

రెండో స్థానంలో ఇండియా

ప్రపంచంలో పొగాకు వాడకంలో మన దేశం రెండవ స్థానంలో ఉంది. పొగాకు వాడకం అనేక  రకాలుగా ఉంది. సిగరెట్లు తాగేవారు కొందరు. చుట్టలు కాల్చేవారు మరికొందరు. హుక్కా పీల్చే వారు ఇంకొందరు. చిలుం పీల్చడం, గుట్కా, జర్దా, పాన్‌ మసాలా ఇలా అనేక ఉత్పత్తుల్లో పొగాకు  వాడకం ఉంటుంది.
(స్మోకర్స్ గా ఉంటూనే నూరేళ్లు బతకలేమా… నిజంగా అది సాధ్యమేనా…ఆ వివరాలు తరువాయి భాగంలో)
-టీఎన్నార్
email:nrturlapati@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!