ఎన్టీఆర్ విశ్వరూపం(పార్ట్ 2)


క్రమశిక్షణకు మారుపేరు

క్రమశిక్షణకు ఎన్టీఆర్‌ పెట్టింది పేరు. నటన అంటే ఆయనకు ప్రాణం. అందుకోసం కఠోర శిక్షణ  పొందేవారు. అంతేస్థాయిలో శ్రమించేవారు. నర్తనశాల సినిమా కోసం వెంపటి చినసత్యం దగ్గర  కూచిపూడి నాట్యాన్ని నేర్చుకున్నారు. డైలాగ్‌లు కంఠతాపట్టేశాకే కెమేరా ముందు  నిలబడేవారు. అంతేకాదు పాత్రలో పూర్తిగా లీనమవడం వల్ల డైలాగ్‌లు అప్పజెపుతున్నట్టుగా  ఎక్కడా ఉండేదికాదు.
సినిమాల్లో  విశ్వరూపాన్ని ప్రదర్శించిన నందమూరి తారకరామారావు అంతే స్థాయిలో  రాజకీయాల్లో కూడా విరాట్‌ రూపం ప్రదర్శించి రాష్ట్ర రాజకీయ చరిత్రలో సుస్థిర స్థానం  సంపాదించుకున్నారు. తెలుగుదేశం పిలుస్తోంది రా…అంటూ ఎలుగెత్తి పిలుస్తూ పాలిటిక్స్‌లో  కొత్త ఒరవడి సృష్టించారు. ప్రజాసేవలో పునీతులయ్యారు.
1982లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. కేవలం తొమ్మిదినెలల వ్యవధిలోనే  రాష్ట్రంలో ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న కాంగ్రెస్‌ పాలనను అంతమొందించి తెలుగుదేశం  పాలనకు నాంది పలికారు. ఆ తరువాత ఎనిమిది సంవత్సరాలపాటు మూడు  దఫాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నారు.
సినిమాల్లో రారాజుగా ఎదిగిన ఎన్టీఆర్‌ మొదటి నుంచి రాష్ట్ర రాజకీయాలను నిశితంగానే  గమనించేవారు. అధికార కాంగ్రెస్‌ పార్టీలోని అంతర్గత కుమ్ములాటలు, తరచూ  ముఖ్యమంత్రులు మారడం వంటి సంఘటనలపై ఆయన చురుకైన వ్యాఖ్యలు చేస్తుండేవారు.  ఐదు సంవత్సరాల వ్యవధిలో నలుగురు ముఖ్యమంత్రులను ఢిల్లీ అధిష్టానం నియమించడం  ఆయనలో ఆగ్రహం తెప్పించింది. ఈ ఆగ్రహం నుంచి ఆలోచన జనించింది. తెలుగు ప్రజలకు  ఏదైనా చేయాలన్న తపన ఆవిర్భవించింది. అప్పడే ఆయన రాజకీయ ప్రయాణానికి గ్రీన్‌సిగ్నల్‌ పడింది.
1982 మార్చి 29 మధ్యాహ్నం రెండు గంటల ముప్పయినిముషాలకు ఎన్టీఆర్‌ కీలక  నిర్ణయం తీసుకున్నారు. కొత్త పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. ఆ శుభముహుర్తంలోనే  తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. అప్పటి నుంచి ఎన్టీఆర్‌ నాయకునిగా కూడా ప్రజలకు  మరింత చేరువయ్యారు. తన దగ్గర ఉన్న పాత వ్యాన్‌ను బాగుచేయించి ప్రచార రథాన్ని  తయారుచేయించారు. ఖాకీ దుస్తులు ధరించి కోట్లాది ఆంధ్రుల్లో తానూ ఒకనిగా కలిసిపోయారు. `తెలుగుదేశం పిలుస్తోంది రా… కదలిరా..’ అంటూ నినదించారు. ఇప్పుడు  ఊరూవాడ తిరుగుతున్న అనేక రాజకీయ రథాలకు స్ఫూర్తి ఈ చైతన్య రథమే. ఆయన  చేసిన ప్రసంగాలు ఉద్వేగభరితంగాసాగేవి.
1983 జనవరి ఏడున ఎన్నికల ఫలితాలు పూర్తిగా వెల్లడయ్యాయి. తెలుగుదేశం పార్టీ విజయఢంకా మ్రోగించింది.  సుదీర్ఘ చరిత్ర ఉన్న కాంగ్రెస్‌ పార్టీ అలా తొమ్మిదినెలల్లోనే తెలుగుదేశం పార్టీ చేతుల్లో ఓటమిపాలైంది. ఆ తరువాత సాగిన ఆయన  రాజకీయ జీవితంలో ఎగుడుదిగుడులు తప్పలేదు. అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్‌ అనేక  సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సినీరంగంలో స్లాబ్‌ సిస్టమ్‌ ప్రవేశపెట్టారు.  శాసనమండలిని రద్దుచేశారు. హుస్సేన్‌సాగర్‌ ట్యాంక్‌బండ్‌మీద సుప్రసిద్ధులైన తెలుగువారి  విగ్రహాలను ప్రతిష్టించారు.  రెండురూపాలయకు కిలో బియ్యం పథకాన్ని తీసుకువచ్చారు.  సంపూర్ణ మద్యపాన నిషేధాన్ని ప్రవేశపెట్టారు.
ముప్పైమూడేళ్ల తెర జీవితంలోనూ, పదమూడేళ్ల రాజకీయ జీవితంలోనూ స్టార్‌గా  వెలుగొందిన ఎన్టీఆర్‌ 73 ఏళ్ల వయసులో 1996 జనవరి 18న గుండెపోటుతో మరణించారు.
- రచన: తుర్లపాటి నాగభూషణ రావు
email:nrturlapati@gmail.com

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!