గాడిదపాలతో గాత్ర శుద్ధి !


ఛీ..గాడిద పాలా అంటూ తేలిగ్గా కొట్టిపారే యకండి…గాడిదపాలు తాగితే దగ్గు తగ్గిపోతుంది. కాలేయ సంబంధమైన వ్యాధులు మటుమాయమైపోతాయి. అంతే కాదండోయ్.. స్వరపేటిక కూడా బలపడుతుంది. గొంతువాపు వంటివి తగ్గిపోతాయి. ఫలితంగా గాత్ర శుద్ది ఏర్పడుతుంది. గార్దభ స్వరం అంటూ పాపాం…గాడిదగార్ని ఎగతాళి చేస్తుంటామేకానీ, దాని పాలు గాత్రశుద్ధికి దోహదపడతాయని మరిచిపో తున్నాం. రేడియోలోనో, సినిమాల్లోనూ, లేదా కచేరీల్లోనూ పాటలు పాడాలనుకునేవారంతా తెల్లవారగానే గాడిదను స్మరించుకోవాల్సిందే. ఓ గ్లాస్ గాడిదపాలు తాగి పాటకచేరీ అందుకుంటే ఇక తిరుగేలందటున్నారు రాష్ట్ర బయోడైవర్శిటీ బోర్డ్ చైర్మన్ ఆర్. హంపయ్య. జీవావరణంలో గాడిదల సంఖ్య బాగా తగ్గిపోతున్నదట. పదేళ్లక్రితం లక్ష ఉండే గాడిదలు ఇప్పుడు వెయ్యికి పడిపోయాయి. గాడిదలను మనం పట్టించుకోకపోతే మరో పదేళ్లలో ఆ జాతి అంతరించే ప్రమాదం కూడా ఉన్నదట.

గాడిద స్థానంలో మోపెడ్లు

గాడిద బరువులు మోయడంలో దిట్ట. అందుకనే మొన్నమొన్నటివరకు ధోబీలు బట్టలు మోయడానికి వాటినే వాడేవారు. అయితే, ఈ మధ్య టూవీలర్ మోపెడ్లు వచ్చేయడంతో గాడిద పని అవి చేసేస్తున్నాయి. దీంతో ధోభీ ఘాట్స్ లో పనిచేసుకునేవారంతా గాడిదలను వదిలించుకుని టూవీలర్స్ లోకి వచ్చేశారు. ఒకప్పుడు గాడిద ప్రధాన రవాణా సౌకర్యంగా ఉండేది. ప్రతిఊర్లో కనీసం ఓ పాతిక గాడిదలు ఉండేవి. గాడిదలు సామాన్లను ఒక చోటు నుంచి మరో చోటుకు తేలిగ్గా తీసుకువెళ్లగలవు. అంతేకాదు, మనుషులను కూడా మోసుకుపోతాయి.

తల్లిపాలతో గాడిదపాలు సమానం

గాడిద పాలకు మరో ప్రత్యేకత ఉందండోయ్…దాని పాలు తల్లిపాలకు చాలా దగ్గరగా ఉంటాయి. గాడిద పాలలో లాక్టోస్ ఎక్కువగా ఉంటుంది. ఆవు పాలతో పోలిస్తే ఇందులో కొవ్వు పదార్దాల శాతం తక్కువ. అందుకే పిల్లలకు గాడిదపాలు పడితే ఇంచుమించు తల్లిపాలు ఇచ్చినట్టే లెక్క.

గాడిద మాంసం కిలో 400

గాడిద మాంసం కూడా మేలు చేస్తోంది. ఇందులో ఔషధగుణాలు అనేకం ఉన్నాయట. పైగా బాగా రుచిగా ఉంటుంది. కోస్తా జిల్లాల వాసులు గాడిద మాంసం అంటే ఇష్టం చూపిస్తుంటారు. గాడిద మాంసంలో కొవ్వు పదార్ధాలు తక్కువగా ఉండటం, ప్రొటీన్లు, కాల్సియం, ఐరన్, పాస్పరస్ వంటి మినరల్స్ ఎక్కువగా ఉండటంతో గాడిద మాంసంకు గిరాకీ బాగా ఎక్కువే. కిలో మాంసం 300 నుంచి 400 దాకా పలుకుతోంది.
ఇటు పాలు, అటు మాంసంలో ఇన్ని మంచి లక్షణాలున్నప్పటికీ గాడిద జాతిని రక్షించుకోలేకపోవడం నిజంగా మన దురదృష్టం. అందుకే, గాడిద సంరక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయాలి. ఇందుకోసం ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!