రాహుల్‌ కంటే ప్రియాంక బెటరా?

మళ్లీ కాంగ్రెస్‌లో ప్రియాంక పేరు ప్రముఖంగా విన్పిస్తోంది. రాజీవ్‌, సోనియాగాంధీ కుమార్తె ప్రియాంకగాంధీ తండ్రి మరణానంతరం రాజకీయాల్లోకి వస్తారని అంతా అనుకునేవారు. అచ్చం నాయనమ్మ ఇందిరాగాంధీ మాదిరిగా ప్రియాంక కూడా ఉంటుందని అనుకునేవారు. అప్పట్లో రాహుల్ విదేశాల్లో చదువుకుంటుం డేవారు. అందువల్లే ప్రియాంకనే రాజకీయవారసత్వం అందుకుంటుందని భావించేవారు. కానీ సోనియా గాంధీ కుటుంబంలో ఏం జరిగిందో కానీ ప్రియాంక రాజకీయాల్లోకి నేరుగా రాలేదు. ఆమెకు వివాహం చేసి కాపురానికి పంపించారు. సంసారం బాధ్యతలు కొంత తగ్గాక ఆమె రాజకీయాల్లోకి రావచ్చునని అనుకునేవారు. కానీ రాహుల్ గాంధీ ఇండియా తిరిగివచ్చి లోక్‌సభకు పోటీ చేయడంతో ఆయనే ఇక రాజకీయవారసుడిగా ముందుకు వస్తున్నాడని అర్థమయింది. తాజాగా సీనియర్ కాంగ్రెస్ నేత, కేంద్రమాజీ మంత్రి వసంత్ సాఠే మాట్లాడుతూ ప్రియాంక రాజకీయాల్లోకి రావాలని అకాంక్షించారు. రాహుల్‌తో పోలిస్తే సోనియా, ప్రియాంకలు ఎక్కువ ప్రజాదరణ కలిగిన వ్యక్తులని ఆయన అభిప్రాయపడ్డారు. రాహుల్‌ను పక్కనపెట్టవద్దన్న ఉద్దేశంతోటే ప్రియాంక రాజకీయాల్లోకి రావడం లేదని ఆయనంటున్నారు. ఇప్పటికైనా ప్రియాంక రాజకీయాల్లో రాణించాలనే ఆయన పిలుపునిచ్చారు. దీనిపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్‌తివారీ స్పందిస్తూ ఈ విషయం ప్రియాంకగాంధీ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందని, ఆమె ఇష్టానికే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. ప్రియాంక రాజకీయాల్లోకి వస్తే రాహుల్ ప్రతిష్ట దెబ్బతింటుందా అని అడిగితే ఇది సరైన ప్రశ్న కాదని మాత్రమే ఆయన సమాధానమిచ్చారు. ఈ మధ్య కాలంలో రాజకీయకుటుంబాల్లో చిచ్చు అని వ్యాఖ్యలు వస్తున్నందున అలాంటి గొడవేమీ లేకుండా ప్రియాంక రాజకీయాల్లోకి రావడం లేదేమోనని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంత సంపద వెనుక కన్నీటి కథలు-3

జగన్ జైలుకెళ్తే…

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!