మరణం లేదని తెలిస్తే, ఎగిరిగంతేస్తాం. అయితే, దీంతోపాటు వృద్ధాప్యం కూడా లేకుండా వందలాది సంవత్సరాలు ఉత్సాహంగా బతుకు బండిని లాగించే ఛాన్స్ వస్తే, ఆనందం అంబరాన్ని అంటుతుంది. ఇప్పుడు ఇది సాధ్యం కాకపోయినా, పురాతన కాలంలో మనిషి ఆయుఃప్రమాణం చాలా ఎక్కువేనని పురాణాలు చెబుతున్నాయి . రాజులు, చక్రవర్తులు, మనులు, మహర్షులు ఎలా ఎందరో వేలాది సంవత్సరాలు హాయిగా జీవించారని పురాణాల్లో ఉంది. మరణం ఎంతో భయంకరమైనది. అప్పటివరకు మనమధ్యనే ఉన్న వ్యక్తి ఉన్నట్టుండి కట్టెలా మారిపోతే ఆ దృశ్యాన్ని జీర్ణించుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఆదిమానవులు ఎన్నో విషయాలను తెలుసుకోవాలని ప్రయత్నించారు. రాయి నుంచి నిప్పుపుట్టించగలిగారు. అదే రాయిని ఆయుధంగా మలుచుకోగలిగారు. శబ్దాల నుంచి సంగీతాన్ని పుట్టించగలిగారు. కానీ మరణం ఎందుకు వస్తుందో వారికి అర్థమయ్యేదికాదు. ఏదో పెనుభూతం తమలోని వారిని నోటికి కరుచుకుని వెళ్ళిపోతుందని అనుకునేవారు. కాసేపు చింతించేవారు, ఆ తరువాత మరచిపోయేవారు. కానీ ప్రశ్న మాత్రం అలాగే ఉండిపోయింది. కాలం మారుతున్నా, ఈ ప్రశ్నకు సమాధానం రాలేదు. అయితే, క్రీస్తు పూర్వం 22వ శతాబ్దిలోనే గిల్గమేష్ అనే సాహసికుడు మరణాన్...