జగన్ జైలుయాత్రకి సిద్దం కావాలి
ఓదార్పు యాత్ర తరువాత జగన్ చేసేది జైలు యాత్రేనని మైలవరం ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని ఉమా అన్నారు. స్థానిక ఆర్అండ్‌బి అతి«థి గృహంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలో న్యాయస్థానాలు అవినీతిని రూపుమాపడానికి తమవంతు కృషి చేస్తున్నామన్నారు. దానిలో భాగంగానే ఆర్థిక నేరాలకు పాల్పడిన కనిమొళి, కల్మాడి, రాజా, గాలి జనార్ధన్‌రెడ్డి జైలు ఊసలు లెక్కిస్తున్నారన్నారు. జగన్‌ది అదే దారి అవుతుందన్నారు.
అధికార కాంగ్రెస్ నాయకులకు ఇంటి యాత్ర తప్పదన్నారు. కృష్ణాడెల్టాకు అన్యాయం జరిగిందని గొంతు చించుకుంటున్న జగన్ తన తండ్రి పాలనలో జరిగిన తప్పిదాలను తెలుసుకోవాలన్నారు. ఆల్మట్టి ఎత్తు పెంపు పై దేశం నాయకత్వంలో పోరాటం జరిగితే వైఎస్ హయాంలో 526 మీటర్ల పెంపునకు ఆస్కారం ఏర్పడిందన్నారు. కాంగ్రెస్ ఎంపీలు నోరిప్పలేదు సరే, కృష్ణా ట్రిబునల్ గురించి మీరెప్పుడైనా మాట్లాడారా అంటూ ప్రశ్నించారు.
టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కొనకళ్ళ జగన్నాధరావు (బుల్లయ్య) మాట్లాడుతూ, కడప ప్రయోజనాల కోసం వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణాడెల్టాను వంచించారన్నారు. అవినీతిని చట్టబద్దత చేసే రీతిలో అధికార దుర్వినియోగానికి పాల్పడి ఓదార్పుతో ప్రజల్ని మభ్యపెట్టాలని చూస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గ ఇన్‌చార్జి, తెలుగు యువత అధ్యక్షుడు కొల్లు రవీంద్ర మాట్లాడుతూ, 2007 లోనే వైఎస్ బాగోతం బయటపడిందన్నారు. వికిలిక్స్ రిపోర్టు అందుకు నిదర్శనమన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చుల అర్జునుడు మాట్లాడుతూ, ఇడుపుల పాయ, బ్రహ్మణి స్టీల్‌కు నీటిని తరలించేందుకు వైఎస్ కుట్ర చేశారన్నారు. తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి కుర్రా నరేంద్ర మాట్లాడుతూ, వరద ముంపునకు గురైన మెట్ట రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. పట్టణ అధ్యక్షులు మోటమర్రి బాబా, సైకం భాస్కరరావు, గోపు సత్యనారాయణ, లంకే నారాయణ ప్రసాద్, బత్తినదాసు, నారాయణరావు, మౌలాలి, వంపుగడవల చౌదరి పాల్గొన్నారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి