కెవిపికి కాంగ్రెస్‌లో ప్రాధాన్యత..
రాష్ట్ర కాంగ్రెస్ లో మళ్లీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు చక్రం తిప్పుతారా? ఆయన సేవలను వాడుకోవలసిందిగా అధిష్టానం పార్టీ రాష్ట్ర నాయకులకు స్పష్టమైన సంకేతం ఇచ్చిందా? ఈ ప్రశ్నలకు సమాధానమే కెవిపి ఆధ్వర్యంలో వై.ఎస్ఆర్ మేన్ ఆఫ్ ద పీపుల్ పుస్తకం ఆవిష్కర సభ అని అంటున్నారు. ఈ సభలో కాంగ్రెస్ అతిరధ,మహారధులంతా పాల్గొన్నతీరే దీనికి దర్పణంగా కనబడుతుంది. కెవిపి రామచంద్రరావు మార్గదర్శకత్వం పార్టీకి ఇప్పుడు ఎంతో అవసరమని ఈ సందర్భంగా కేంద్ర నేతలు గులాం నబీ అజాద్, ఆ తర్వాత మోతీలాల్ ఓరా, వాయలార్ రవి లు వ్యాఖ్యానించడం విశేషం.ఈ సభ ద్వారా రాజశేఖరరెడ్డి కేవలం ప్రజలకే కాదు, పార్టీ కి కూడా హీరోనేనన్న సంకేతం ఇవ్వడం, అలాగే కెవిపి రామచంద్రరావుకు పార్టీ హై కమాండ్ ఆశీస్సులు ఉన్నాయన్న సందేశాన్ని ఇచ్చారన్నది ఒక ముఖ్య విశ్లేషణగా ఉంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితులలో కెవిపి అండ లేకపోతే ప్రభుత్వం మనజాలదన్నది కాంగ్రెస్ పెద్దల అభిప్రాయంగా ఉందంటున్నారు. అందువల్లనే అంత బిజీగా ఉండే సమయంలో కూడా ఎ.ఐ.సి.సి. పెద్దలంతా తరలి వచ్చారు. వీరు వస్తుండే సరికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ తదితరులు హాజరయ్యారు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు వంటివారు ఈ సభను విమర్శించినా, అలాగే ఎవరూ వెళ్లరాదని కోరినా, పెద్ద నాయకులే పట్టించుకోకపోయేసరికి , ఆయన మాట చెల్లకుండా పోయినట్లయింది.అలాగే కెవిపి కూడా వై.ఎస్. జగన్ ఈ సభకు ఎటూ రారు కనుక వై.ఎస్. రాజశేఖరరెడ్డి సోదరుడు వివేకానందరెడ్డి వచ్చేలా జాగ్రత్తపడారని భావించాలి. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ని సిబిఐ కుట్రదారుడిగా పేర్కొంటూ ఎఫ్.ఐ.ఆర్.లో ప్రస్తావిస్తున్న తరుణంలోనే ఆయనను పొగుడుతూ కేంద్ర నాయకులు మాట్లాడడం కూడా విశేషంగానే చెప్పుకోవాలి. రాజకీయాలు గమ్మత్తుగా ఉంటాయనడానికి ఇది ఉదాహరణే.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి