బాబుకి అస్కార్ అవార్డివ్వాలి..
సినిమాలలో నటించి స్వర్గీయ ఎన్టీఆర్ అందిర అభిమానాన్ని చూరగొంటే ఆయన అల్లుడు చంద్రబాబు మాత్రం రాజకీయాల్లో చాలా బాగా నటిస్తున్నాడని.. ఆయన నటనకు ఆస్కార్ అవార్డు కూడా ఇవ్వొచ్చని లక్ష్మీపార్వతి అంటున్నారు. చంద్రబాబు నాయుడు ఆస్తుల ప్రకటన చేసిన మరుక్షణమే ఆయనపై విమర్శనాస్త్రాలు సంధిస్తోంది లక్ష్మీపార్వతి. చంద్రబాబు నాయుడు తన ఆస్తులను పూర్తిగా ప్రకటించలేదని, ఈ ఆస్తులపై ఆయన తన కుమారుడు లోకేష్ మీద ప్రమాణం చేయాలని, అలాగే కాణిపాకం దేవాలయంలో ప్రమాణం చేయాలని లక్ష్మీపార్వతి సవాల్ చేశారు. అనేక అక్రమాస్తులను సంపాదించిన చంద్రబాబు వాటినన్నిటిని అమ్మివేసి ఇప్పుడు అవేమీ తనవి కావని చెబుతున్నారని అన్నారు. సింగపూర్ లో ప్రముఖ హోటలీయర్ సాయిబాబను అడ్డం పెట్టుకుని సింగపూర్ లో హెటల్ కొనుగోలు చేశారని , ఆ తర్వాత దానిని అమ్మివేశారని అన్నారు. పంజగుట్ట లో హెరిటేజ్ కంపెనీ భవనం ఎవరు ఇచ్చారు?ఒక పవర్ ప్రాజెక్టు పొందిన యజమాని ఆ బిల్డింగ్ పై అంతస్తు వేశారని అన్నారు. 1988 లోనే లక్షా నలభైవేల రూపాయల వ్యవసాయం ఆదాయం చూపిన చంద్రబాబు ఇప్పుడు ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల ఆస్తులు ఎలా సంపాదించారని ఆమె అన్నారు. చంద్రబాబు నాయుడుకు ఆయన మామ ఎన్.టి.రామారావు ఐదు లక్షల రూపాయల కట్నం ఇస్తానని చెప్పారని, కాని ఆయన ఇవ్వలేదని, ఎన్.టి.ఆర్ చనిపోయేవరకు చంద్రబాబు తనకు కట్నం ఇవ్వలేదని నిందించేవారని లక్ష్మీపార్వతి అన్నారు.ఎన్.టి ఆర్ కుమార్తె కనుక తన భార్య భువనేశ్వరి కి ఆస్తి ఉందని ఇప్పుడు చెబుతున్నారని, 1988 లో ఆమె పేర కేవలం నలభై గ్రాముల ఆభరణాలు మాత్రమే చూపారని చెప్పారు. చంద్రబాబు కుమారుడు లోకేష్ ఏమి వ్యాపారాలు చేశాడని ఇన్ని కోట్లు సంపాదించారని ఆమె ప్రశ్నించారు.కూరగాయలు అమ్మి కుటుంబాన్ని పోషించిన చంద్రబాబు తల్లి మదీనా గూడ వద్ద ఐదు ఎకరాలు భూమి ఎలా సంపాదించారని అన్నారు. రాజకీయాలలో నటిస్తున్న చంద్రబాబు ఆస్కార్ అవార్డు ఇవ్వవచ్చని,ఎన్.టి.ఆర్ సినిమా నటుడు మాత్రమేనని, కాని చంద్రబాబు నిజ జీవితంలో అందరిని మించిన నటుడని ఆమె వ్యాఖ్యానించారు.కోర్టులలో ఆయా కేసులలో స్టే తెచ్చుకు న్నారని, దేనినైనా మేనేజ్ చేయగల సమర్ధుడు చంద్రబాబు అని ఆమె ఆరోపించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి