ప్రణబ్‌పై ఫైర్ అయిన హరీష్‌రావు
డిసెంబరు తొమ్మిదిన తెలంగాణ ప్రకటన చేయడం పొరపాటైందని కేంద్ర మంత్రి ప్రణబ్ ముఖర్జీ సీమాంద్ర నేతల వద్ద వ్యాఖ్యానించడాన్ని తెలంగాణ రాష్ట్ర సమితి నేత, సిద్దిపెట ఎమ్మెల్యే టి.హరీష్ రావు తీవ్రంగా ఆక్షేపించారు. చాటు మాటుగా సీమాంధ్ర నేతల వద్ద ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కాదని, పార్లమెంటులో చెప్పాలని హరీష్ రావు సవాల్ చేశారు.రెండువేల తొమ్మిదిలో తెలంగాణ ఇస్తున్నట్లు పార్లమెం టులోనే ప్రకటన చేశారని ఆయన గుర్తు చేశారు.తెలంగాణ రాష్ట్ర సమితితో అప్పట్లో అధికారం కోసం పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ నేతలు ఇప్పుడు ఇలా మాట్లాడడం తగదని , తెలంగాణ ప్రజలు దీనిని గమనిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజల సహనాన్ని కేంద్ర నేతలు పరీక్షిస్తున్నారని ఆయన అన్నారు. కేంద్ర నేతల వైఖరి వల్ల ఇరు ప్రాంతాల ప్రజల మధ్య వైషమ్యాలు మరింత పెరుగుతాయని ఆయన హెచ్చరించారు. కాగా గుంటూరులో టిడిపి నేతలు సమైక్య సదస్సు పెట్టారని ఇక్కడ తెలంగాణ నేతలు బస్ యాత్రలు చేస్తున్నారని,దీనిపై తెలంగాణ టిడిపి ఫోరం కన్వీనర్ దయాకరరావు వివరణ ఇవ్వాలని హరీష్ రావు అన్నారు. ఇప్పటికీ తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్దాంతాన్ని అమలు చేస్తోందని ఆయన విమర్శించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి