వైఎస్ జగన్ వరాల జల్లులు..
నేడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ ప్లీనరీలో ప్రసం గించారు.ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపు తూ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఎంత ముఖ్యమో వివరించి చెప్పారు. అంతేకాదు తాను అధికారంలోకి వస్తే పేదవారికి స్వర్ణయుగం వచ్చినట్టే నని అభివర్ణించారు. అంతేకాదు..రాష్ట్ర బడ్జెట్ ప్రకారం ఆచరణ సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాపేదలకి వరాల జల్లులని కురిపించాడు. అంతా బాగానే ఉంది కానీ.. కనుచూపు మేరలో ఎన్నికలు కూడా లేవు.. అప్పుడే తమ పార్టీ అధికారంలోకి వస్తే.. అంటూ తాను ముఖ్యమంత్రిని అయితే అంటూ ప్రసంగించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.. జగన్ వుద్దేశ్యం ప్రకారం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం మధ్యలోనే పడిపోతుందేమోనని, మధ్యంతర ఎన్నికలు వస్తే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మ్రోగిస్తుందన్నంత ధీమాతో వైఎస్ జగన్ ప్రసంగం సాగింది.. అంతేకాదు వైయస్సార్ మృతికి దిగ్భ్రాంతికి గురై మరణించినవారి కుటుంబాలను తాను పరామర్శించడానికి వేలాది కిలోమీటర్లు తిరిగానని, తాను తిరిగినంతగా ఏ రాజకీయ నాయకుడు కూడా తిరగలేదని, ఎన్నో కుటుంబాలను పరామ ర్శించానని, ఈ సందర్భంగా పేదరికాన్ని దగ్గరగా చూసే అవకాశం కలిగిందని, పేదరికాన్ని ఎలా నిర్మూలించా లనే ఆలోచనలను రేకెత్తించిందని ఆయన అన్నారు. కులాలకు, మతాలకు, రాజకీయాలకు అతీతంగా పేదరికం అందర్నీ పీడిస్తోందని ఆయన అన్నారు. పేద విద్యార్థులను ఎల్‌కెజీ నుంచి పిజి దాకా చదివించే బాధ్యతను తమ పార్టీ అధికారంలోకి వస్తే తీసుకుంటుందని ఆయన అన్నారు. ఫీజు రీయంబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం విడుదల చేయడం లేదని దయ్యబట్టారు. పేదరికం పోవాలంటే ప్రతి కుటుంబం నుంచి ఒక్కరన్నా పెద్ద చదువులు చదవాలని, పేదలకు భూమి పంచి సాగు నీటి సౌకర్యాలు కల్పించాలని తాను తెలుసుకున్నట్లు ఆయన తెలిపారు. సంక్షేమ పథకాలను నిర్దిష్ట ప్రణాళికతో, బడ్జెట్ కల్పనతో అమలు చేస్తామని ఆయన మొత్తంగా ప్రజలకు హామీ ఇచ్చారు.
అంతేకాదు ఆయన ప్రసంగంలో పేద వృద్దులకు ఇచ్చే ఫించన్లు ప్రస్తుతం 200 అయితే తమ ప్రభుత్వం 700 రూపాయలు అందజేస్తుందని, పేదలకి ఎంతో ఉపయోగపడే 2 రూపాయలకు కిలో బియ్యాన్ని పునరుద్దరిస్తామని, ఒక్కో కుటుంబనాకి 30 కిలోల బియ్యం ఇస్తామని హామీ ఇచ్చారు. ఇవాళ ఎన్నికలు లేవు, ఈ విషయం చెప్పాల్సిన అవసరం లేదు, కానీ పేదరికాన్ని చూసి తనకు నోటి నుంచి ఆ మాట వస్తోందని ఆయన అన్నారు. వైయస్సార్ మరణించిన రెండేళ్లకే ఆ నేతను, ప్రజలను ప్రభుత్వం మరిచిపో యిందని ఆయన అన్నారు. మహిళలకు తాము అధికారంలోకి వస్తే వడ్డీ లేని రుణాలు ఇస్తామని నిరుపేద లకు ఉచితంగా అమలు చేసే విధంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తామని ఆయన చెప్పారు. వైయస్సార్ లాగానే తమ ముఖ్యమంత్రి ఉన్నాడని ప్రజలు అనుకోవాలని ఆయన అన్నారు.
మొత్తానికి ఆయన ప్రసంగం మొత్తం పేదవారి చుట్టూనే తిరగడం, తాను ముఖ్యమంత్రిని అయితే అంటూ ప్రసంగించడం విశేషం.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి