వార‌సుల‌తో వ‌ర్కవుట్ అయ్యేనా..?


పిసిసి అధ్యక్షుడు కొత్త ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ లో ప్రముఖులుగా ఉంటున్నవారి పిల్లలు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వైపు ఆకర్షితులు కాకుండా ఉండడానికి చేసిన ఆయన వ్యూహం ఫలిస్తుందా అన్నది చర్చనీయాంశంగా ఉంది.రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, ధర్మాన ప్రసాదరావు, ఎరాసు ప్రతాపరెడ్డి, ముకేష్ గౌడ్, విశ్వరూప్ ల కుమారులు కార్తీక్ రెడ్డి, ఫణింద్ర, రామ్ మనో హర్ నాయుడు, అరవింద రెడ్డి, విక్రమగౌడ్, క్రిష్ణలను బొత్స పిలిపించుకుని బొత్స సంప్రదింపులు జరిపారు. అలాగే సికింద్రాబాద్ ఎమ్.పి అంజన్ కుమార్ యాదవ్ కుమారుడు అనిల్ కుమార్ యాదవ్, పటాన్ చెరు ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కొడుకు అశిష్, మల్కాజిగిరి ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ కుమారుడు శ్రావణ్ లు కూడా బొత్సతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ లోనే భవిష్యత్తు ఉంటుందని, తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దని, కాంగ్రెస్ ను బలోపేతం చేయడానికి కృషి చేయాలని బొత్స కోరారు. దానికి వారు సానుకూలంగా స్పందించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్నప్పుడు వారి తల్లిదండ్రులను కాదని ఇప్పటికిప్పుడు వారు మాత్రం ఎందుకు వెళతారన్న ప్రశ్న వస్తుంది. వీరిలో మంత్రి విశ్వరూప్ కుమారుడు ఇప్పటికే జగన్ వైపు తిరిగారని అంటారు. ఆయనను కూడా రప్పించకోవడం విశేషం.కాగా మరో సీనియర్ మంత్రి కాసు కృష్ణారెడ్డి కుమారుడు మహేష్ రెడ్డి మాత్రం ఈ సమావేశానికి హాజరుకాకపోవడం గమనించదగిన పరిణామంగా కనిపిస్తుంది.ఆయన కూడా వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ వైపు వెళ్లవచ్చని ప్రచారం జరిగింది. కాగా ఎన్నికలు వచ్చేసరికి ఎందరు పార్టీలో ఉంటారో, ఎందరు ఉండరో, అప్పటికి పరిస్థితి ఏ రకంగా ఉంటుందో ఎవరు చెప్పలేని పరిస్థితి ఉన్నప్పట్టికి బొత్స తనవంతు కృషి తాను చేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు సోదరుడు కృష్ణదాస్ ఇప్పటికే జగన్ పార్టీలోకి వెళ్లిపోయారు. కాని ప్రసాదరావు కుమారుడు మాత్రం తండ్రి వెంటే ఉన్నారు. కాగా మంత్రుల కుమారులంతా రాజకీయాలలోనే కొనసాగాలని బొత్స కోరుకుంటున్నారా? వారసత్వ రాజకీయాలకు బొత్సనే బీజం వేస్తారా అని కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే తమకేమి ప్రత్యేకం గా ఎలాంటి హామీని బొత్స సత్యనారాయణ ఇవ్వలేదని కార్తీక్ రెడ్డి, మనోహర్, ఫణింద్రలు చెప్పారు.గతంలో జగన్ పార్టీలోఉన్నప్పుడు ఆయనతో తిరిగాము కాని , ఇప్పుడు ఆయన పార్టీలో లేరు కనుక ఆయన వద్దకు వెళ్లమని, పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పామని వీరు అన్నారు.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!