సిలికానాంధ్ర పదేండ్ల పండుగ
వేదమంత్రోచ్ఛారణలతో ప్రారంభమైన కార్యక్రమానికి సిలికానాంధ్ర అధ్యక్షులు శ్రీ దీనబాబు కొండుభొట్ల స్వాగత వచనాలతో అందరినీ సాదరంగా ఆహ్వానించారు. సిలికానాంధ్ర ప్రథమ ప్రచురణ ‘బతుకమ్మ శతకం’ విశేషాలను, ఆ శతకకర్త శ్రీ జొన్నవిత్తుల రామలింగేశ్వర రావుగారు మొదటగా వివరించారు. ఆబాలగోపాలాన్ని ఆకట్టుకోనే విధంగా అందరికి అందుబాటులో ఉండే సులభమైన తెలుగులో రచించిన పద్యాలు భక్తి భావనలు ప్రేరేపించాయి. సాంఘిక, సామాజిక, ఆధ్యాత్మిక విశేషాలు పద్యాలలో స్ఫురించాయి. ఈ కార్యక్రమానికి కిరణ్ ప్రభ గారు సమన్వయకర్తగా వ్యవహరించి, శతకంలోని వివిధ దృక్కోణాలను వారి ప్రశ్నల ద్వారా శతకకర్త నుండి ఆవిష్కరించారు. అనంతరం సిలికానాంధ్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ కూచిభొట్ల ఆనంద్ గారి ఆధ్వర్యంలో, ప్రముఖ హృద్రోగ నిపుణులు డా|| లక్కిరెడ్డి హనిమిరెడ్డిగారు , శ్రీ రామలింగేశ్వర రావుగారిని దుశ్సాలువతో, సన్మాన పత్రంతో ఘనంగా సత్కరించారు.
తెలుగువారికే సొంతమైన పద్యనాటకానికి దశమ వార్షికోత్సవంలో సముచిత స్థానం లభించింది. ప్రఖ్యాత రంగస్థల నటుడు శ్రీ గుమ్మడి గోపాలకృష్ణగారి దర్శకత్వంలో ‘భువనవిజయంలో వికటకవి’ నాటకాన్ని బే ఏరియాలోని నటులు ప్రదర్శించారు. తెనాలి రామకృష్ణగా శ్రీగోపాలకృష్ణ గారి నటన ప్రేక్షకులని ఆకట్టుకుంది. ప్రముఖ హాస్యనటులు శ్రీ రాళ్ళపల్లిగారు ఈ నాటకంలో తమ సహజ హాస్యంతో అందరినీ అలరించారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త శ్రీ జగదీష్ గారు, శ్రీ గోపాలకృష్ణగారిని సన్మానిస్తూ, కన్నడిగుడినైన తనకు రెండు భాషలవారు సగర్వంగా చెప్పుకొనే ‘రాయలవారి ఆస్థానం’ అమెరికాలో పద్యనాటక రూపంలో చూడడం, తన చిన్ననాటి రోజులను గుర్తుచేశాయని, ఈ కళల పరిరక్షణలో సిలికానాంధ్ర కృషిని కొనియాడారు. శ్రీ రాళ్ళపల్లి వారిని సిలికానాంధ్ర వ్యవస్థాపక ఉపాధ్యక్షులు శ్రీ దిలీప్ కొండిపర్తిగారు సత్కరించారు.
అనతరం పది సంవత్సరాలలో కార్యవర్గంలో పనిచేసిన అధ్యక్షులు, కార్యకర్తలు అందరూ వేదికనలంకరించారు. పూర్వ అధ్యక్షులందరూ ఇన్నేళ్ళూ సిలికానాంధ్ర నిర్వహించిన కార్యక్రమాలను చేయటానికి తమకు కలిగిన స్ఫూర్తిని తెలియచేసారు. శ్రీ ఆనంద్ గారు మాట్లాడుతూ, గిన్నిస్ రికార్డు నెలకొల్పిన ‘రెండవ అంతర్జాతీయ కూచిపూడి సమ్మేళ ణానికి’ భారత రాష్ట్రపతిని ముఖ్యఅతిథులుగా ఆహ్వానించే స్థాయికి సిలికానాంధ్ర ఎదగడంలో సభ్యులందరి తోడ్పాటు, ప్రోత్సాహం ఉన్నాయని, ప్రపంచ మూలల్లో ఉన్న తెలుగు చిన్నారులకు మాతృభాష నేర్పే ‘మనబడి’, అన్నమయ్య కీర్తనలకు ప్రాచుర్యం కలిగించే లక్షగళార్చనవంటి కార్యక్రమాలు నిర్వహించి సిలికానాంధ్ర తెలుగువారి ఆశీస్సులు పొందిందని తెలియచేశారు. ఇదే పరంపరలో రాబోయ సంవత్సరాలలో ఆధునిక, సాంకేతిక సదుపాయాలతో, భావి నర్తకులకు చరిత్ర తెలియచేస్తూ, స్ఫూర్తిని కలిగించే ఒక అంతర్జాతీయ స్థాయి కూచిపూడి కళానిలయాన్ని కూచిపూడి గ్రామంలో ఏర్పాటు చేస్తామని, , తెలుగుభాషను నేర్చుకొన్నవారు తెలుగులోనే సాంకేతిక రంగాలలో కూడా ఉద్యోగాలు చేయగలిగే విధంగా పట్టభద్రులయ్యే ‘సిలికానాంధ్ర విశ్వవిద్యాలయాన్ని’ స్థాపిస్తామని తెలియచేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, సిలికానాంధ్ర సంయుక్తంగా ఈ సంవత్సరం సెప్టెంబర్ 28, 29, 30 తేదీలలో బే ఏరియాలో నిర్వహిస్తున్న మొదటి ‘అంతర్జాతీయ తెలుగు అంతర్జాల సమావేశం’’ ద్వారా తెలుగు భాషకు సమాచార, సాంకేతిక సంబంధ అధ్యయనానికి, కంప్యూటర్ అవసరాల గురించిన యూనీకోడ్ లిపి ప్రావీణ్యుల గోష్ఠి వివరాలు తెలియచేశారు.
తరువాత గత రెండు వారాలుగా ప్రముఖ గాయకుల శ్రీ రామాచారిగారు నిర్వహిస్తున్న, ‘లలితా సంగీత శిక్షణా శిబిరంలో’ పాల్గొన్న పిల్లలు, పెద్దలు ఎన్నో మధురగీతాలను గానంచేశారు. శ్రీ రామాచారిగారిని స్థానిక సత్యనారాయణ స్వామి దేవస్థానం అధ్యక్షులు శ్రీ జగదీష్ బాబుగారు సన్మానించారు. చివరగా శ్రీ దిలీప్ కొండిపర్తిగారి నిర్వహణలో సిలికానాంధ్ర ఆడపడుచులు, నలభీములు వండిన తెలుగు వంటకాలను పండుగకు విచ్చేసిన వారందరు ఆస్వాదించారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తగా వ్యవహరించిన సంయుక్త కార్యదర్శి శ్రీ బండి ఆనంద్ వర్ధన్ తుదిపలుకులు తెలిపారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి