అష్టదిగ్బంధంలో అమెరికా (Part-2)



అమెరికా సెనెట్ రుణపరిమితి బిల్లుకు ఆమోదం తెలిపినంతమాత్రాన ఆర్థిక అష్టది గ్బంధం నుంచి అమెరికా బయటపడిందనే అనుకోవాలా…? లేదంటే, ప్రస్తుతానికి బలహీనపడిన పెను తుపాను గానే భావించాలా? డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య కీలక బిల్లు విషయంలో ఏకాభిప్రాయం కుదిరి నంతమాత్రాన ఆర్థిక వ్యవస్థ ఒక్కసారిగా మెరుగైపోతుందా…? అంకుల్ శామ్ దివాళాతీస్తే యావత్ ప్రపంచం కుదేలవు తుందన్న భయాలు ఇక పోయినట్టేనా…? వాస్తవ చిత్రం ఏమిటి…? ఒక వేళ మన దేశానికే ఇలాంటి ఆర్థిక ముప్పు వస్తే, మనం తట్టుకోగలమా? అప్పుడు మనదేశాన్ని ఏ శక్తి రక్షిస్తోంది…?

(రెండ‌వ భాగం)

రుణపరిమితి పెంచకుంటే…

ఇది సరే,  ఇప్పుడు కాకపోతే, మరెప్పుడైనా ,  ఒకవేళ రుణ పరిమితి పెంచకపోతే వచ్చే అనర్ధాలు ఎలా ఉంటాయో ఓసారి చూద్దాం…

- ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేరు
- సైనికులకు జీతభత్యాలపై కోత
- పెన్షన్ చెల్లింపులు ఆగిపోవడం
- హెల్త్ కేర్ బెనిఫిట్స్ గుండుసున్నా
- ఇతర బిల్లలకు చెల్లుచీటీ
- సంక్షేమ పథకాలకు గండి
- క్రెడిట్ రేటింగ్ కుప్పకూలవచ్చు
- మొత్తం వ్యయంలో 40 శాతం కోత తప్పదు

ఒకవేళ అమెరికా దివాళా తీస్తే, కేవలం అమెరికా మాత్రమే నష్టపోదు, అనేక ఆర్థిక వ్యవహారాలతో లింక్ లు పెట్టుకున్న వర్ధమాన దేశాల్లోనూ ఆర్థిక వ్యవస్థ కల్లోలం కాకమానదు.
ఖర్చు ఎక్కువైనప్పుడు అప్పు చేయడం చాలా సహజం. వ్యక్తి అయినా ప్రభుత్వాలైనా అదే పని చేస్తుంటాయి. అమెరికా ప్రభుత్వం రుణ పరిమితిని పెంచడం ఇదే తొలిసారి కాదు. 1962 నుంచి ఇంతకు ముందు వరకు 74 సార్లు పరిమితిని సవరించారు. గడచిన పదేళ్లను పరిగణలోకి తీసుకుంటే, అమెరికా ఆదాయానికి మించి ఎక్కువే ఖర్చు పెట్టేసింది. ఈ పరిస్థితిని మరో రకంగా చెప్పుకోవాలంటే, ఒక ఉద్యోగస్థుడు నెల జీతానికి మించి ఖర్చుపెట్టినట్టే. ఆర్థిక సూత్రాలకు ఇది విరుద్ధమని తెలిసినా అమెరికా ప్రభుత్వం ఎందుకు ఇలా చేసింది?

బుష్ టైమ్ లో బోల్తా

అమెరికాలో ఒబామాకంటే ముందు బుష్ పాలన సాగింది.  జార్జి బుష్ అధ్యక్షుడిగా  ఉన్న సమయంలోనే ఆర్థిక వ్యవస్థ కుప్పకూలడం మొదలైంది. అమెరికా అగ్రరాజ్యంగా ఎదిగినప్పటి నుంచీ అనేక దేశాలకు ఆయుధాలు సరఫరా చేస్తూనేఉంది. ప్రత్యక్షంగానో, లేదా పరోక్షంగానో యుద్ధాలను ప్రోత్సహిస్తూనేఉంది. తాలిబన్లకు ఆయుధాలు ఇచ్చి రెచ్చగొట్టింది కూడా అమెరికానే. పాకిస్తాన్ ను చీటికీ మాటికీ భారత్ పై రెచ్చగొట్టేలా చేసిందీ అమెరికానే. 2005 నుంచి 2008 మధ్య కాలంలో అమెరికా ప్రభుత్వం యుద్ధాల కోసం పెట్టిన ఖర్చు అక్షరాలా 30వేల కోట్ల డాలర్లు. యుద్ధానంతర ప్రభావాల్లో ఇప్పుడు అమెరకన్లు చవిచూస్తున్న ఆర్థిక సంక్షోభం కూడా ఒకటిగా మిగిలిపోయింది.
జార్జి బుష్ కాలంలో పన్ను రాయితీలు కూడా ఖజానాను కొల్లగొట్టాయి. లక్షా76వేల కోట్ల డాలర్లు కరిగిపోయాయి. వృద్ధులకు ఇచ్చిన  ఆరోగ్య రాయితీల వల్ల కూడా 55వేల 200 కోట్ల డాలర్లు ఖర్చయ్యాయి. ఎన్నికల ముందు  ప్రజాకర్షణ పథకాలు కూడా కొంపముంచాయి. దీనికి తోడు బ్యాంకింగ్ వ్యవస్థ సరిగా లేకపోవడంతో ఆర్థిక మాంద్యం చాపకిందనీరులా ప్రవేశఇంచింది. దీంతో అమెరికా డాలర్ కళావిహీనమైపోయింది. ఆర్థిక వ్యవస్థ పతనం అయ్యేముందు ఉండే లక్షణాలు ఏమిటో తెలిసాయి కాబట్టి, ఇక మనదేశ భవిష్యత్తు ఎలా ఉంటుందో కూడా ఇట్టే అర్థం చేసుకోవచ్చు.


అప్పుచేసి పప్పుకూడు


అప్పుచేసి పప్పుకూడు తినకూడదన్నది మన పూర్వీకులు చెప్పిన గొప్ప ఆర్థిక సూత్రం. స్థాయిని మించి ఖర్చులు పెంచుకుంటూపోతుంటే, ఆర్భాటాలకుపోయి అతిగా ఖర్చు చేస్తే ఏమవుతుంది? కొంప కొల్లేరవుతుంది. వ్యక్తి అయినా, కుటుంబమైనా, లేదా సమాజమైనా  ఈ ఆర్థిక చట్రంలోనే బతుకుబండిని లాగించాలి. అంతేకానీ, హెచ్చులకు పోతే చివరకు తిప్పలు తప్పవు. ప్రస్తుతం అమెరికా, ఐరోపా దేశాలు ప్రస్తుతం ఎదుర్కుంటున్నది ఇదే.
మామూలుగా సాధరణ వ్యక్తులకు ఈ పరిస్థితులు వస్తే, `డబ్బులు చేతిలో ఆడటంలేదు’ అని అంటారు. లేదంటే, డబ్బుకు కటకటలాడాల్సి వస్తున్నదని కూడా చెబ్తుంటారు. ఇప్పుడు అదే పరిస్థితి అమెరికా వంటి సంపన్న దేశానికి వచ్చేసింది. ఈ డబ్బు ఇబ్బంది ప్రభుత్వాల స్థాయికి విస్తరిస్తే, దాన్నే ద్రవ్య కొరత అంటారు. లిక్విడిటీ సమస్య అని కూడా పిలుస్తుంటారు.  ఇది ముదిరితే దివాళా తీయడం అని సింపుల్ గా చెప్పేయవచ్చు.


సబ్ ప్రైమ్ సంక్షోభం


అమెరికాలో తలెత్తిన తాజా సంక్షోభానికి తొలి రూపం ఏమిటో తెలుసా…అదే, సబ్ ప్రైమ్ సంక్షోభం. నాలుగైదేళ్ల కిందట ఈ తరహా సంక్షోభం చుట్టుముట్టింది. ఇదంతా డబ్బు కటకటలాడటం వల్లనే వచ్చింది. దీంతో మార్కెట్ ను నిలబెట్టాలనుకున్నారు. కొనుగోలు శక్తి పెంచాలనుకున్నారు. కానీ మూలం విస్మరించారు. ప్రభుత్వం , ప్రజల వద్దనే వనరుల కొరత ఉన్నదని దీని కారణంగానే సమస్య తలెత్తిందని   దొరగార్లు తెలుసుకునేసరికి ఆర్థిక బండి బోల్తా పడింది. దీంతో ఖజానా వైపు దృష్టి పెట్టాల్సి వచ్చింది. ఆరోగ్య బీమా చట్టం అమలు బాధ్యత నుండి ఒబామా ప్రభుత్వం వైదొలిగింది ఇందుకే. ఇక్కడితో సర్దుబాట్లు ఆగలేదు. కార్మికుల వేతనాల పెరుగుదలపై మారటోరియం విధించే వరకు వెళ్ళింది.
సమస్య తలెత్తినప్పుడు పరిష్కార మార్గాలు వెదకడం సహజమే. ఇక్కడా అదే జరిగింది. జేబులు ఖాళీ అయితే, అప్పు కోసం వెతకాల్సిందే, అయితే, తీర్చలేని భారంగా అప్పు మారితేనే కష్టం.  ఒక వేళ ఇదే పరిస్థితి దేశానికి వస్తే, దాన్నే సార్వభౌమత్వ ఆర్థిక సంక్షోభం అంటారు. మరి ఇలాంటి పరిస్థితి నుంచి దేశాలు ఎలా బయటపడతాయి? ఇందుకు కొన్ని మార్గాలు లేకపోలేదు..అవి…


- ప్రభుత్వం డబ్బు ముద్రించడం
- మార్కెట్ అవసరాలకు నిధులు అందుబాటులోకి తేవడం
- ద్రవ్య సంస్థల నుంచి  అప్పు తీసుకోవడం
- రుణాలను సర్దుబాటు చేసుకుంటూ పోవడం

(మిగ‌తా మూడ‌వ భాగంలో)
- తుర్లపాటి నాగభూషణ రావు

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ప్రత్యేక కథనం: భూతాన్ని, యజ్ఞోపవీతాన్ని నేనే...

దోమల సెక్స్ రహస్యం తెలిస్తే, డెంగ్యూ దూరం!

బర్నింగ్ కామెంట్రీ - 5: నగ్న పాచికల జూదం!!