`సుప్రీం’ సంచలనం


నకిలీ ఎన్ కౌంటర్ల బాధ్యులను ఉరి తీయాలని సుప్రింకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. ప్రజలకు రక్షణగా ఉండవలసిన పోలీసులు కిల్లర్ లుగా మారుతున్నారని కూడా సుప్రింకోర్టు వ్యాఖ్యానించింది.ఎన్ కౌంటర్ల కేసుపై విచారణ జరుపుతున్న సుప్రింకోర్టు ఇంత సీరియస్ గా మాట్లాడడం ఇదే మొదటిసారి. జస్టిస్ మార్కండేయ, జస్టిస్ సీ.కె.ప్రసాద్ లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం నకిలీ ఎన్ కౌంటర్లపై ఘాటైన వ్యాఖ్యలే చేసింది. నకిలీ ఎదురు కాల్పుల మరణాలు క్రూరమైన హత్యలే అంటూ ధర్మాసనం వ్యాఖ్యానిం చింది. సామాన్య పౌరులు నేరానికి పాల్పడితే సాధారణ శిక్షతో సరిపెట్టవచ్చు, కానీ, పోలీసులే నేరానికి పాల్పడితే కఠిన శిక్షలే ఉండాలన్న అభిప్రాయాన్ని సుప్రీం వ్యక్తం చేసింది. తీవ్ర వాదాన్ని అరికట్టడానికిగాను పోలీసులు ఎన్ కౌంటర్లు చేస్తుంటారు. తీవ్రవాదులు ఎదురుబడినప్పుడు పరస్పరం కాల్పులు జరిపితే అప్పుడు ఎవరైనా చనిపోతే అది ఎన్ కౌంటర్ గా పరిగణిస్తారు. అలాకాకుండా పట్టుబడిన తీవ్రవాదులను పోలీసులు కొన్నిసార్లు కాల్చి చంపుతారు. వాటిని నకిలీ ఎన్ కౌంటర్లు గా భావిస్తారు. నకిలీ ఎన్ కౌంటర్లు చేయడం ఎవరికి మంచిది కాదు. చట్టం ప్రకారం వారిని కోర్టుకు సరెండర్ చేయావలసి ఉంటుంది. కాని కొన్ని సార్లు అలా చేయరన్నది బహరంగ రహస్యమే. ఇది మన రాష్ట్రంలోనే కాదు. దేశంలోని అనేక చోట్ల ఇదే పరిస్థితి ఉంది.మరో మాట చెప్పాలంటే ప్రపంచలో అనేక చోట్ల కూడా ఈ సమస్య ఉంది.మానవహక్కులపై ఎంతో చర్చ జరుగుతోంది. కొన్నిసార్లు అమాయకులు కూడా ఈ నకిలీ ఎన్ కౌంటర్లకు బలైపోతున్నారు. అలాంటప్పుడు తీవ్రమైన విమర్శలు ఎదుర్కుంటారు.ఇప్పుడు సుప్రింకోర్టు చేసిన వ్యాఖ్యలతో  నకిలీ ఎన్ కౌంటర్లు తగ్గుతాయని అనుకోవచ్చా…?

కామెంట్‌లు