`సుప్రీం’ పవర్ (Part-1)
మనదేశంలో న్యాయవ్యవస్థ సమానాంతర పరిపాలన సాగిస్తోందా? ఇటీవల కాలంలో న్యాయస్థానాలు ఇస్తున్న సంచలన తీర్పులు, స్వయంగా కేసులు స్వీకరించి పరిష్కరిస్తున్న తీరుతెన్నులు చూస్తుంటే ఏమనిపిస్తోంది? ప్రజదల పక్షాన నిలుస్తున్నది శాసన వ్యవస్థ ద్వారా ఎన్నికైన పాలకులా, లేక న్యాయవ్యవస్థను సమున్నుతంగా నడిపిస్తున్న న్యాయమూర్తులా? ఏది నిజం? మరేది అవాస్తవం…??
మనదేశంలో ప్రజాస్వామ్యమే ఉన్నప్పటికీ, పాలకుల అనాలోచిత నిర్ణయాలతో ప్రజలు అనునిత్యం ఇబ్బందులు పడుతూనేఉన్నారు. మరి అలాంటప్పుడు ప్రజావ్యతిరేక పనులు చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని ఎవరు మందలించగలరు? కుంభకోణాలకు పాల్పడతూ నిస్సిగ్గుగా సమర్థించుకునే నేతలను ఎవరు సూటిగా ప్రశ్నించగలరు. ఆ పని చేస్తున్నది ఎవరో తెలుసా? మనదేశ సర్వోన్నత న్యాయస్థానం. ఎటువంటి రాజకీయ జోక్యానికి తావులేని రాజ్యాంగబద్ధమైన స్వతంత్ర్య న్యాయ వ్యవస్థ ఈ మధ్యకాలంలో తీసుకుంటున్న అనేక నిర్ణయాల పట్ల ప్రజలు హర్షం వెలుబుచ్చుతున్నారు. జయహో సుప్రీం – అంటూ సర్వోన్నత న్యాయవ్యవస్థ ప్రశంసలు అందుకుంటోంది.
ఛత్తీస్ గఢ్ లో సల్వజుడం ఏర్పాటు తీరుపై సుప్రీంకోర్టు మండిపడింది. `SPOలతో మీరు ఆటలాడుకుం టున్నారు…వారు రాష్ట్రానికి ఎదురుతిరిగితే ఏం జరుగుతుందో మీకు తెలుసా…?’ అంటూ సూటిగా ప్రశ్నించింది.
అలాగే, 2g స్పెక్ట్రమ్ కేసులో సీబీఐని పదునైన కత్తిగా మార్చింది కూడా సుప్రీంకోర్టే. దీంతో సీబీఐ, అక్రమార్కులపై విరుచుకుపడుతూ, ఒక్కొక్కరినీ తీహార్ జైలుకు పంపిస్తోంది. మొన్నటికిమొన్న దయానిధి మారన్ మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయనపై రేపోమాపో ఛార్జిషీట్ దాఖలు కావడం, ఆపైన జైలుకు పంపడం తప్పకపోవచ్చు. ఇక కామన్వెల్త్ గేమ్స్ పేరిట సాగిన కుంభకోణాన్ని, నల్లధనం వెలికితీయాల్సిందేనంటూ సిట్ ను ఏర్పాటు చేయడంలోనూ సుప్రీం తన సర్వోన్నత పవర్ ని ఉపయోగించిందనే చెప్పాలి.
సూటి ప్రశ్నలు
ప్రజావ్యతిరేక పనులు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎవరు మందలించగలరు..?
కుభకోణాలకు పాల్పడుతూ నిస్సిగ్గుగా సమర్దించుకుంటున్న కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఎవరు నిగ్గదీయగలరు?
నల్లధనం వెలికితీయాల్సిందేనంటూ సూటిగా ప్రశ్నించగలిగేది ఎవరు?
వీటన్నింటికీ ఒకటే సమాధానం. దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు….
పాలనావ్యవస్థలోని లొసుగుల్ని వేలెత్తి చూపుతూ, చురకలు అంటించే సత్తా న్యాయవ్యవస్థకే ఉంది.
ఈ మధ్యకాలంలో సుప్రీం పవర్ ఏమిటో ప్రజలందరికీ తెలుస్తోంది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు, తీర్పులు తి హర్షించే స్థాయిలో ఉంటున్నాయి. ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టుల ఏరివేత కోసం అక్కడి ప్రభుత్వం సృష్టించిన సల్వాజుడం పై ఈ మధ్యనే సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ పేరిటనో లేదా కోయ కమెండోస్ లేదా, సాల్వాజుడం పేరిటనో గిరిజనులతో సాయుధ బలగాన్ని ఏర్పాటు చేసిన తీరును సుప్రీంకోర్టు ఆక్షేపించింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు ఇలా వ్యాఖ్యానించింది.
`SPOలతో మీరు ఆటలాడుకుంటున్నారు.
వారు రాష్ట్రానికి ఎదురు తిరిగితే ఏం జరుగుతుంది?
ఆ సమయంలో దేవుడు కూడా ఈ దేశాన్ని రక్షించలేడు’
రాజ్యాధికారాన్ని సవాల్ చేశారనే పేరుతో సమస్యను శాంతి భద్రతల సవాల్ గానే మాత్రమే పరిగణిస్తూ మావోయిస్టు ఉద్యమాన్ని అణచడానికి పోలీసు యంత్రాంగం, ప్రభుత్వాలు అదే రాజ్యాంగ వ్యతిరేక, ఉల్లంఘనలకు పాల్పడడం ఎట్టి పరిస్థితుల్లోనూ సమర్థనీయం కాదని సుప్రీంకోర్టు మరోసారి సల్వాజుడుం వ్యవహారంలో తేల్చిచెప్పింది.
(మిగతా రెండవ భాగంలో)
తుర్లపాటి నాగభూషణరావు
తుర్లపాటి నాగభూషణరావు
nrturlapati@gmail.com
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి