జయలలిత రూటు ఎటు..?
తమిళనాడు ముఖ్యమంత్రి మళ్లీ రాజకీయాలలో ఒక వెలుగు వెలగడానికి రంగం సిద్దం చేసుకుంటున్నారు. ఆమె బ్రహ్మాండమైన మెజార్టీతో గెలుపొందడంతో 2014 లో కేంద్రంలో అదికారంలోకి రావడానికి జయలలిత మద్దతు అవసరం అవుతుందని భావిస్తున్నారు.ఈ నేపధ్యంలోనే అన్ని కూటములవారు జయతో రాజకీయ స్నేహం చేయడానికి ఉబలాటపడ్డారనిపిస్తుంది.వామపక్షాలకు, బిజెపికి మధ్య సంబంధాలు ఉప్పు,నిప్పుగా ఉంటాయని తెలుసు. కాని జయలలిత తమిళనాడులో తనతో కలిసి పోటీచేసిన వామపక్ష నేతలను తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించారు. అలాగే తనకు మద్దతు ఇచ్చిన తెలుగుదేశం నేత చంద్రబాబు నాయుడును కూడా పిలిచారు. ఇంతవరకు అయితే ఫర్వాలేదు.కాని చిత్రంగా భారతీయ జనతా పార్టీకి చెందిన ముఖ్యమంత్రి నరేంద్ర మోడిని కూడా పిలిచి అందరిని ఆశ్చర్యపరిచారు. అయితే వామపక్షాలు ఏమనుకున్నాయో , ఏమోకాని వారు కూడా ఈ సందర్భం వరకు సరేలెమ్మని సరిపెట్టుకున్నాయి. మోడి అంటేనే అసలు పడని సిపిఐ నేతలు బర్దన్, రాజాలు నరేంద్ర మోడి సరసన కూర్చుని జయ ప్రమాణ స్వీకార వేడుకను తిలకించారు. అలాగే బిజెపి అధికారంలో ఉన్న రోజులలో నరేంద్ర మోడి అంశంలోనే చంద్రబాబుకు బిజెపి అధినాయకత్వానికి పెద్ద తగాదా అయింది. అయినా చంద్రబాబు కూడా ఈ విషయంలో సరిపెట్టుకున్నారు.ఇక నరేంద్ర మోడి కూడా ఎందుకైనా మంచిదని జయలలిత ఆహ్వానాన్ని మన్నించి చెన్పై వచ్చారు.భవిష్యత్తులో ఎన్.డి.ఎ వైపునకు తిప్పుకోవడానికి అవకాశం ఉంటుందేమోనని కమలనాధుల ఆశ. ఇక వీరికంటే వెనుకబడి పోకూడదనుకున్న ఎ.ఐ..సి.సి అధ్యక్షురాలు సోనియాగాందీ కూడా జయలలితకు ఫోన్ చేసి అబినందనలు తెలిపి తేనీటి విందుకు రమ్మన్నారు. వీరందరి దృష్టి 2014 పైనే ఉంది.ఈ మూడు కూటములలోను జయలలిత ఏదో ఒక టైమ్ లో ప్రముఖ పాత్ర పోషించారు. కొద్ది సంవత్సరాల క్రితం మూడో కూటమికి ప్రత్యేకంగా ప్రాంతీయ పార్టీలతో ఏర్పాటు చేయడానికి చంద్రబాబు తో కలిసి కొంతకాలం పనిచేశారు కాని,ఆ తర్వాత పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఆమె ఏ వైఖరి అవలంభించబోతున్నారన్నది చర్చనీయాంశంగా ఉంది. కాంగ్రెస్,బిజెపిలకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమిని తయారు చేసుకోవడం ద్వారా తన ప్రాముఖ్యతను పెంచుకోవడానికి ఆమె యోచిస్తున్నట్లు బావిస్తున్నారు.ఎందుకంటే ప్రాంతీయ పార్టీలలో ముఖ్యమైన తెలుగుదేశం, సమాజవాది వంటి పార్టీలు ప్రస్తుతం అధికారంలో లేవు.అందువల్ల తన పాత్ర కీలకం అవుతుందని ఆమెకు తెలుసు. అలాగే వామపక్షాలు కూడా కొంతకాలం పాటు అన్నా డిఎమ్ కె తో కలిసి ప్రయాణం చేసే అవకాశం ఉంది. కాంగ్రెస్,బిజెపిలకు ప్రత్నామ్నాయంగా రాజకీయాలు నడపాలంటే జయ మద్దతు అవసరమని ఆ పక్షాలు భావిస్తున్నాయి. ఈ నేపధ్యంలో జయ భవిష్యత్తు రాజకీయం అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకోబోతోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి