రణ గర్జనతో టిడిపి తెలంగాణ వాదం బలపడిందా..?
అడుగడుగునా టీఆర్ఎస్ అడ్డంకులు.. దానికి తోడు భారీ వర్షంతో తాండూరులో నిర్వహించిన రణగర్జన సభను విజయవంతం చేసుకున్నారు టిడిపి, తెలంగాణ నాయకులు. వికారాబాద్‌లో టీఆర్ఎస్ కార్యకర్తలు టీడీపీ నేతల కాన్వాయ్‌లోని వాహనాలపై కోడిగుడ్లు, రాళ్లతో దాడి చేశారు. దాంతో టీఆర్ ఎస్, టీడీపీ నాయకుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో పోలీసులు లాఠీలు ఝళిపించారు. భారీగా వర్షం పడుతున్నా, రణగర్జణ సభలో టిడిపి సీనియర్ నాయకులందరూ ప్రసంగించారు. ముఖ్యంగా టిఆర్ ఎస్ అధినేత కేసీఆర్, తెలంగాణ జేఏసీ కన్వీనర్ కోదండరాంలపై విరుచుకుపడ్డారు. ధైర్యముంటే రౌండ్ టేబుల్ సమావేశానికి పిలవాలని, కేసీఆర్‌ను తాము కొన్ని ప్రశ్నలడుగుతామని సవాల్ విసిరారు. ముందుంది మొసళ్ల పండుగ అంటూ హెచ్చరించారు. తెలంగాణ వస్తే తాము జీరోలమవుతామన్న భయంతోనే కేసీఆర్ ఉద్యమానికి అడ్డుపడుతున్నాడని ఆక్షేపించారు. తాండూరు సభలో విమర్శలకు పదును పెట్టడంతోపాటు ప్రశ్నలు సంధించడంద్వారా టీఆర్ఎస్, జేఏసీలను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించారు. ఉద్యమం పేరుతోనే కేసీఆర్ పదేళ్లనుంచి బతికేస్తున్నాడని, తెలంగాణను సాధించడం కేసీఆర్‌కు, టీఆర్ఎస్‌కు, తెలంగాణ జేఏసీకి సాధ్యం కాదని స్పష్టం చేశారు. తెలంగాణను సాధించేది తెలుగుదేశం తెలంగాణ నేతలేనని స్పష్టం చేశారు. పదవులకు రాజీనామాలు చేద్దామని, తెలంగాణ వచ్చేవరకు ఎవ్వరమూ పదవులు తీసుకోవద్దని తాము డిమాండ్ చేస్తున్నామని, టీఆర్ఎస్ నేతలు అందుకు సిద్ధమేనా? అని సవాల్ విసిరారు. తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని, తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.మొత్తానికి తాండూరు సభద్వారా టిడిపి తెలంగాణ నాయకులు తెలంగాణపై తమ గళాన్ని భారీగానే వినిపించారు.. దాంతో టిడిపి అధినేత తెలంగాణకి అడ్డుకాడన్న సంకేతాన్ని తెలంగాణ ప్రజలకి వినిపించడంతో టిడిపి తెలంగాణ నాయకులు సక్సెస్ సాధించినట్టే.. అన్నట్టుగా కనిపిస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి