చిల్లర `పెద్దన్న’ల దోపిడీ-2
విదేశీ కంపెనీలు ధరలు ఎడాపెడా పెంచకుండా ఉండేలా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతోంది. కొన్నేళ్ల కిందట దేశీయ రిటైల్ కూరగాయల మార్కెట్ లోకి కూడా బడాకంపెనీలు ప్రవేశించాయి. అప్పుడు కూడా అనేక విమర్శలు తలెత్తాయి. చిల్లర దుకాణాలకూ, కూరగాయల వ్యాపారాలకు తీవ్రనష్టం కలుగుతుందని ఇది సామాన్యుల జీవనంపై పెను ప్రభావం చూపుతోందని ఘాటైన విమర్శలు వచ్చాయి. అయినప్పటికీ దేశీయ బడా సంస్థల సూపర్ మార్కెట్లను ఎవ్వరూ ఆపలేకపోయారు. అవి ఇప్పుడు నగరాలుదాటి పట్టణాలు, పలెల్లో కూడా వ్యాపిస్తున్నాయి. ఇప్పుడు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులతో ఆ పని విదేశీ సంస్థలు చేయబోతున్నాయి. అంతే తేడా.
ఇదో దోపిడీ
దేశీయ రిటైల్ మార్కెట్ లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులపై యూపీఏ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోవడంపై విపక్షాలు మండిపడుతున్నాయి. కేంద్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీ స్వరం పెంచుతోంది. అయితే, ఇదే బీజేపీ 2004 వరకు ఎఫ్.డి.ఐలను సమర్ధించడాన్ని మరిచిపోకూడదు. అసలు విపక్షాలు ఎందుకింతగా రిటైల్ ఎఫ్.డి.ఐలను విమర్శిస్తున్నాయో, ఆ కారణాలు కూడా తెలుసుకోవాల్సిందే..
చైనాలో వందశాతం ఎఫ్.డి.ఐలకు అనుమతి ఇచ్చాక చిల్లర, టోకు వ్యాపారం గణనీయంగా అభివృద్ధిచెందినమాట నిజమే. మరి అలాంటప్పుడు మనం ఎందుకు భయపడాలన్నదే యూపీఏ ప్రభుత్వ అడ్డగోలు వాదన. మరి ఈ వాదనలో పసఉంటే, ప్రతిపక్షాలు ఎందుకింతగా వ్యతిరేకిస్తున్నాయి ? ఇక్కడ మరో విషయం కూడా చెప్పుకోవాలి. ఇండోనేషియాలో చాలాకాలం కిందటే సూపర్ మార్కెట్లు వచ్చేసినా, అక్కడ తాజా పండ్లు, కూరగాయల అమ్మకాల్లో 90 శాతం, మిగతా ఆహారపదార్ధాల విక్రయాల్లో 70 శాతం ఇప్పటికీ స్థానిక సాంప్రదాయ రిటైల్ వ్యాపారుల చేతుల్లోనే ఉంది. మరి అలాంటప్పుడు 120కోట్లు దాటిన జనాభాగల దేశంలోని సుస్థిర రిటైల్ వ్యాపార సంస్థలపై విదేశీ సంస్థలు ఏ విధంగా పట్టుసంపాదించగలవంటూ ఊరటకల్గించే మాటలు చెప్పేవారూ లేకపోలేదు. అయితే, ఇదంతా నిజమేనా…? అసలేం జరగబోతోంది…?? వాస్తవ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి?
మనదేశ రిటైల్ వ్యాపారం పటిష్టంగా ఉన్నప్పుడు విదేశీ రిటైల్ సంస్థల రాక అవసరమా ? గ్లోబల్ రిటైల్ దిగ్గజాలు వచ్చేసి ఏం ఊడపీకుతారు ? వీళ్లంతా వచ్చేది దోచుకెళ్లడానికి కాకపోతే మరేంటీ…? ప్రభుత్వం చెబుతున్నట్టు కోటి మందికి ఉపాధి అవకాశాలు వస్తే రావచ్చు. కానీ విదేశీ సంస్థలు ఉద్యోగాలు ఇచ్చేటప్పుడు అనుసరించే నైపుణ్య ప్రమాణాలను పరిగణలోకి తీసుకుంటే కనీసం 50 నుంచి 60 శాతం మందికి ఉన్న ఉద్యోగాలు ఊడిపోవచ్చు. ఉపాధికల్పన పేరిట శిక్షణకేంద్రాలు వెలిసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఒకరకంగా చెప్పాలంటే ఇది మరో దోపిడీనే. కానీ ఏఫ్.డి.ఐలు నిర్దేశించే భవిష్యత్తు ఇదే.
నాణ్యతకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చే విదేశీ సంస్థల ముందు దేశీయ సంస్థలు, చిల్లర దుకాణాలు నిలబడలేకపోవచ్చు. వినియోగదారులు సైతం నాణ్యమైన వస్తువులవైపే మొగ్గుచూపుతారు. ప్రస్తుతం సూపర్ మార్కెట్లు కూడా ఇదే సూత్రం ఆధారంగా లాభాలబాట పట్టాయి. ఇంతకంటే నాణ్యమైన సరుకు సరసమైన ధరలకు విక్రయిస్తున్నప్పుడు వినియోగదారులు సహజంగానే విదేశీ చిల్లర కోట్లవైపే ఆకర్షితులవుతారు. ఇదే జరిగితే దేశీయ చిల్లర కొట్లు క్రమంగా అదృశ్యమవుతాయి. ఇది జరిగాక విదేశీ సంస్థలు, సూపర్ మార్కెట్లే మనదేశంలో రాజ్యమేలతాయి. అప్పుడు ధరలు పెంచినా గత్యంతరంలేక కొనుక్కోవాల్సిందే..
రిటైల్ లో ఎఫ్.డి.ఐలను అనుమతించిన అనేక దేశాల్లో ఇదే పరిస్థితి అలుముకుంది. తయారైన ప్యాకెడ్ వస్తువులే మనదేశంలోకి రావడంతో ఇక్కడ వస్తోత్పత్తి సంస్థల అవసరం గణనీయంగా తగ్గిపోతుంది. దీంతో లక్షలాది మంది ఉపాధి కోల్పోతారు. రిటైల్ ఎఫ్.డి.ఐలకు తలుపులు బార్లాతెరిచిన అనేక దేశాల్లో ఉపాధి కోల్పోయి చీకట్లో బతుకుతున్న అభాగ్యుల సంఖ్య లక్షల్లోకి చేరింది.
చైనాలో రిటైల్ ఎఫ్.డి.ఐలకు తలుపులు తెరిచిన తర్వాత అక్కడ ఆర్థికాభివృద్ధి పుంజుకున్నమాట నిజమే. అయితే, అంతమాత్రాన చైనాతో మనదేశాన్ని పోల్చకూడదు. ఎందుకంటే…
బహుళ బ్రాండ్ రిటైల్ విభాగంలో ఎఫ్.డి.ఐలను అనుమతించడం, సింగిల్ బ్రాండ్ విభాగంలో పరిమితి ఎత్తివేయడంపై అమెరికా కంపెనీలు ఇప్పటికే హర్షం వ్యక్తం చేస్తున్నాయి. భారత్ సాహసోపేత నిర్ణయం తీసుకున్నదంటూ పెద్దన్న కితాబు ఇచ్చేసింది. భారత్ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం చేయడానికి తమవంతు కృషిచేస్తామంటూ వాల్ మార్ట్ వంటి సంస్థలు గొంతుకలిపాయి. రిటైల్ దిగ్గజాలు రంగంలోకి దిగడంవల్ల తాత్కాలికంగానైనా ఉద్యోగఅవకాశాలు పెరగడం నిజమే కావచ్చు, మధ్యదళారీల బెడద కూడా తగ్గిపోవచ్చు, కానీ ఓ పదేళ్ల తర్వాత ఈ పరిస్థితి ఉండదు. అప్పుడు విదేశీ సంస్థల కబంధ హస్తాల్లో మన రిటైల్ వ్యాపారరంగం చిక్కుకోవడం ఖాయం. విదేశీయుల పాలన ఎంతటి ప్రమాదకరమో, విదేశీ చిల్లర కొట్టు అంతటి ప్రమాదకరమన్న సంగతి గుర్తించేలోగా చేతులు కాలకమానవు.
- తుర్లపాటి నాగభూషణ రావు
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి