అదిగో మరో భూమి !
ఈ విశాల విశ్వంలో భూమిని పోలిన గ్రహం ఒకటున్నదని శాస్త్రవేత్తలు గుర్తించారు. అంతేకాదు, ఈ గ్రహంపై జీవరాశి ఉండేందుకు అనుకూల వాతావరణం ఉన్నదనే చెబ్తున్నారు. అంటే మనం త్వరలోనే గ్రహాంతరవాసుల్ని చూడబోతున్నా మన్నమాట.
భూమిమీద కాకుండా వేరే గ్రహంమీద ఎక్కడైనా జీవరాశి ఉన్నదా? అన్నది మానవజాతిని శతాబ్దాల తరబడి తొలుస్తున్న ప్రశ్న. ఇందుకోసం చేయని ప్రయోగం లేదు. నిరంతర అధ్యయనం సాగుతూనే ఉంది. ఈ శోధన ఒక కొలిక్కి వచ్చేసినట్టేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. 600 కాంతి సంవత్సరాల దూరంలో ఈ గ్రహం ఉన్నదట. అక్కడ జీవరాశి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయని శాస్త్రవేత్తలు బల్లగుద్దిమరీ చెబ్తున్నారు.
మన సౌరకుటంబానికి ఆవల 500 గ్రహాలు సంచరిస్తున్నట్టు ఇప్పటికే శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటిలోనే భూమిని పోలిన గ్రహం కూడా ఉంది. దీనిపేరు `కెప్లర్ -22-బి’. ఈ గ్రహంమీద నీరు అపారంగా ఉన్నదని అంటున్నారు. అంతేకాదు, జీవరాశి మనుగడకు అవసరమైన వాతావరణం కూడా అక్కడ ఉన్నదట.
అత్యంత శక్తివంతమైన టెలిస్కోప్ సాయంతో విశాల విశ్వాన్ని నిరంతరం అధ్యయనం చేయడంతో ఈ గ్రహం జాడ తెలిసింది. ఇప్పటివరకు గుర్తించిన గ్రహాల్లో జీవరాశి ఉండేందుకు అనుకూలంగా ఉన్నది ఇదొక్కటే.
`కెప్లర్ -22-బి’ అనే ఈ గ్రహం మన భూమి వ్యాసానికి 2.4 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఈ గ్రహంలో వాతావరణం అచ్చు మన భూమిమీదలాగానే ఉంది. భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టుగానే ఈ గ్రహం తనదైన సూర్యుడి చుట్టూ తిరుగుతోంది. అక్కడ 22డిగ్రీల సెల్సియస్ గా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మొత్తానికి ఈ గ్రహంపై జీవరాశి ఉండే అవకాశాలు చాలా ఎక్కువగానే ఉన్నాయని శాస్త్రవేత్తలు చెప్పడం గమనార్హం. అంటే, త్వరలోనే ఈ గ్రహాంతరవాసుల ఉనికిని మనం పసిగట్టబోతున్నామన్నమాట.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి