`మాయ’ వీడుతోంది
ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు బీఎస్పీకి నల్లేరుమీద నడక కాకపోవచ్చు. మాయావతి పాలనపట్ల వ్యతిరేకత పార్టీని కష్టాల్లో పడేయవచ్చు. కష్టాల కడలిలో బీఎస్పీ నావ ఎలా సాగబోతోంది?ప్రభుత్వ వ్యతిరేక సుడిగాలిలో కొట్టుకు పోతుందా…? మాయావతికి ఎదురీత తప్పదు. మాయ ప్రభావం ప్రజల్లో నెమ్మదిగా వీడిపోతోంది. అంటే వచ్చే ఎన్నికల మాయావతికి నల్లేరుమీద నడక కాదు.
వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలకు ముఖ్యమంత్రి మాయావతి ఎంతగా వ్యూహాత్మకంగా అడుగులువేస్తున్నా, బీఎస్పీ పార్టీకి పూర్వవైభవం తెచ్చిపెట్టడంలో ఆమె విఫలం కావచ్చు. 2007 ఎన్నికల్లో మాయావతి ఒంటిచేత్తోనే పార్టీకి ఘన విజయం సాధించిపెట్టారు. అయితే ఇప్పుడు సీన్ మారబోతోందా ?
రాజకీయ చదరంగం ఆడటంలో మాయావతి దిట్ట. ఈమాట నిజమే కావచ్చు. అందుకే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని మాయావతి ఇప్పటికే ప్రతిపక్షాలు దిమ్మరబోయేలా చెక్ పెట్టారు. దేశంలోకెల్లా అతిపెద్ద రాష్ట్రంగా భాసిల్లుతున్న ఉత్తరప్రదేశ్ ను నాలుగు చిన్నరాష్ట్రాలుగా విడదీయాలంటూ మాయావతి ఈ మధ్యనే రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం పెట్టారు. ఈ ఎన్నికల ఎత్తుతో రాజకీయ శత్రువులు చిత్తయిపోతారని అనుకోవడానికి వీల్లేదు. వచ్చే ఎన్నికలు ఆమెకు కేక్ వాక్ కాకపోవచ్చు.
`విభజించు, పాలించు’ అన్న సూత్రంతో మాయావతి పావులు కదుపుతున్నారు. అయితే, ఇదే సూత్రం ఆమె కొంపముంచనూ వచ్చు.
మాయావతి సంగతి ఇలా ఉంటే, మరో పక్క సమాజ్ వాదీ పార్టీ నెమ్మదిగా కోలుకుంటోంది. ములాయంసింగ్ యాదవ్ కుమారుడు అఖిలేష్ సైకిల్ ర్యాలీలు, రథయాత్రలతో ప్రజలకు చేరువ అవుతున్నారు. దీంతో ఆ పార్టీ బలపడుతోంది.
సమాజ్ వాదీ పార్టీ సంగతి ఇలా ఉంటే, రాహుల్ గాంధీ తన పొలిటికల్ మైలేజ్ కు అవకాశంగా యూపీని ఎంచుకున్నప్పటికీ, అక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఆశించిన స్థాయిలో లేదు. రాహులు వచ్చినప్పుడున్న ఉత్సాహం, ఆయన అటు ఢిల్లీకి వెళ్లగానే జావగారిపోతోంది.
మరో పక్క బీజేపీ గత వైభవం మళ్ళీ తెచ్చుకోవాలని తపనపడుతున్నా, అదంతా పగటికలగానే ఉంది. మొత్తానికి యూపీలో మళ్ళీ బీఎస్పీనే అధికార పగ్గాలు అందుకునే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అయితే, మునపటి పట్టు మాత్రం ఉండకపోవచ్చు. ఈ సంగతి ముందే పసిగట్టిన మాయావతి ప్రస్తుతం లోపాలు సవరించే పనిలో పడ్డారు.
మరి రాజకీయ చదరంగంలో మాయావతి చెక్ పెడతారా, లేకుంటే, ప్రతిపక్షాల నుంచి ఎదురుదెబ్బ తినబోతున్నారో తేల్చేది రాబోయే ఎన్నికలే.
-ఎన్నార్టీ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి