కేంద్రం ఒంటెద్దు పోకడ
దేశ ప్రజలకు ఉపయుక్తంగా ఉండే ఏ విధాన నిర్ణయం తీసుకోవాలన్నా, రాజకీయ అవగాహన ఉండాల్సిందే. అది లోపిస్తే చిక్కులు తప్పవు. ప్రస్తుతం జరుగుతోంది. అదే. యూపీఏ సర్కార్ ఎప్.డి.ఐల విషయంలో కీలక నిర్ణయం తీసుకునేముందు రాజకీయపార్టీల మనోభావాలను అంచనావేయలేకపోయింది. ఫలితంగా పార్లమెంటు ఉభయసభలు స్తంభించిపోతున్నాయి. ఎంతో విలువైన కాలం కరిగిపోతోంది. గతంలో ఈ పరిస్థితి ఉండేదికాదు. పివీ నరసింహారావు ప్రధానిగా ఉన్నప్పుడు ఆర్థిక సంస్కరణల విషయంలో నాటి ఆర్థికమంత్రి మన్మోహన్ సింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఈ కీలక నిర్ణయం తీసుకునేటప్పుడు పెద్దాయన రాజకీయ అవగాహనను మరిచిపోలేదు. అయినప్పటికీ తప్పులు జరిగిపోయాయి. ఫలితంగా కాంగ్రెస్ పతనం తప్పలేదు. మళ్ళీకోలుకోవడానికి దశాబ్దికాలం పట్టింది. అప్పట్లో ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ ఘోరంగా ఓడిపోయినప్పుడు, అక్కడ కేంద్రంలో పీవీ టర్మ్ మధ్యలో ఉంది. సరిగా అప్పుడే,
ఆర్థిక సంస్కరణలను ఆపేయమన్నప్పుడు మన్మోహన్ సింగ్ చాలా ఇబ్బందిపడ్డారు. ఒక దశలో ఆయన రాజీనామాచేసేదాకా వెళ్ళారు. చివరకు కాంగ్రెస్ తర్వాతి సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓటమి చవిచూడక తప్పలేదు.
నాటి ఓటమిని కాంగ్రెస్ సరిగా విశ్లేషించుకుంటే ఒక విషయం అర్థమయిఉండేది. తాను చేపట్టిన ఆర్థిక సంస్కరణల వల్ల ప్రజలకు ఏమేరకు మేలు జరుగుతుందో వివరించడంలో కాంగ్రెస్ విఫలమైంది. మరో రకంగా చెప్పుకోవాలంటే, అద్భుతమని తాము భావిస్తున్న విధాన నిర్ణయాలను ఓటు బ్యాంక్ లుగా మలుచుకోలేకపోయారు.
1990నాటి సంస్కరణల సంగతి సరే, మరి ఇప్పుడేం జరుగుతోంది. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం మల్టీ బ్రాండ్ రిటైల్ రంగంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. దీంతో సహజంగానే ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. ఫలితంగా పార్లమెంట్ సమావేశాలు స్తంభించిపోతున్నాయి.
ప్రజాప్రయోజనాలకు సంబంధించిన అంశంపై కీలక నిర్ణయం తీసుకునేముందు కనీసం తన కూటమిలోని పార్టీల అభిప్రాయాలనైనా కచ్చితంగా తీసుకోవాలి. ఈ పని కూడా యూపీఏను నడిపిస్తున్న కాంగ్రెస్ చేసినట్టు కనబడటంలేదు. అందుకు ప్రతిఫలం కాంగ్రెస్ అనుభవిస్తోంది. కూటమి భాగస్వాములైన తృణమూల్ కాంగ్రెస్, డిఎంకెలతో పాటుగా మద్దతుఇస్తున్న సమాజావాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు కూడా ఎఫ్.డి.ఐ బాగోతాన్ని ఉతికారేస్తున్నాయి.
రిటైల్ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల వల్ల దేశంలోని నిరుపేదల పరిస్థితి ఎలా ఉంటుందో కనీసం ఒక్క క్షణం ఆలోచించిఉంటే కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయం తీసుకునిఉండేది కాదన్న విమర్శలు సర్వత్రా వినవస్తున్నాయి. దీంతో యూపీఏ సర్కార్ గొంతులో పచ్చివెలక్కాయి పడినట్టయింది. ప్రధానమంత్రి మన్నోహన్ సింగ్ ప్రముఖ ఆర్థికవేత్త అయితే అయువుండవచ్చు. అంతమాత్రాన ఏకోన్ముఖంగా ఆర్థిక సంస్కరణబాట తొక్కేస్తే 120కోట్ల జనాభాలో 80 శాతం నిరుపేదలున్న మన దేశ పరిస్థితి ఏమవుతోంది?
ప్రజాస్వామ్య దేశంలో రాజకీయపార్టీల అభిప్రాయాలు తెలుసుకోకుండా అడుసులో కాలేయడం, కాళ్లుకడుక్కోవడం మంచిదేనా…? మరో మూడేళ్లలో సార్వత్రిక ఎన్నికలు రాబోతున్న తరుణంలో ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల ప్రధాని కావాలనుకుంటున్న రాహుల్ పరిస్థితి ఏం కాబోతుంది… అసలు పార్టీ మనుగడ ఎలా ఉండబోతుందన్న అనుమానాలు ముసురుకుంటున్నాయి.
-ఎన్నార్టీ
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి