దామోదర్‌రెడ్డి మౌనం వెనుక..?
ఒకప్పుడు గర్జించే సింహంలా వ్యవహరించిన మాజీ మంత్రి , సూర్యాపేట ఎమ్మెల్యే ఇటీవలికాలంలో ఆసలు మాట్లాడ కపోవడంపై కాంగ్రెస్ వర్గాలలో రకరకాల గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన కాంగ్రెస్ నేతలలో దామోదరరెడ్డి కూడా ప్రముఖుడే. అవసరమైతే తెలంగాణ కాంగ్రెస్ పేరుతో కొత్త పార్టీని ఏర్పాటు చేయాలని యోచించినవారిలో ఈయన కూడా ఉన్నారని అంటారు. అలాగే తెలంగాణ ఉద్యమం బాగా ఎక్కువగా ఉన్న రోజులలో వేరే ప్రాంత నాయకులపై తీవ్రమైన విమర్శలు చేసేవారు. ఒక సందర్భంలో అయితే ఇతర ప్రాంతాల నుంచి తెలంగాణలోకి ఎవరూ ప్రవేశించకుండా జాతీయ రహదారిపై అడ్డుగోడ కడతామని హెచ్చరించారు. అంత తీవ్రంగా మాట్లాడిన దామోదరరెడ్డి ఇప్పుడు విమర్శల సంగతి కాదు కదా అసలు తెలంగాణ రాష్ట్ర సాధన గురించి కూడా పెద్దగా ప్రస్తావించడం లేదని అంటున్నారు. దీనికి గురించి విచారిస్తే నల్లగొండ జిల్లాలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి పదవికి రాజీనామా చేయడంతో ఆ పదవి తనకు దక్కే అవకాశం ఉందన్న భావన కలగడం లేదా తత్సమానమైన పదవి ఒకటి ఇవ్వవచ్చన్న అభిప్రాయం ఉండడం ఒక కారణంగా చెబుతున్నారు. అదికాకుండా మరో విషయం కూడా చెబుతున్నారు.ఇది ఎంతవరకు నిజమో తెలియదో కాని తన అనుచరులపై ఉన్న ఒక హత్య కేసు తిరగదోడే అవకాశం ఉన్నట్లు ప్రచారం రావడం కూడా ఆయన తగ్గడానికి మరో కారణమని అంటున్నారు. మొత్తం మీద ఏ నాయకుడైనా ముందుగా తన సంగతి చూసుకున్నాక తర్వాతే ఏ విషయం అయినా అని అర్ధం కావడం లేదూ.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి